గురువులకు పారా పోలీస్‌ విధులు..!

Teachers Will Educate Public On Covid-19 Pandemic - Sakshi

సాక్షి, ఒంగోలు: ఇన్నాళ్లూ తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఇకపై కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.  కోవిడ్‌ –19 వ్యాప్తి కారణంగా స్కూళ్లు తెరుచుకోలేదు. ప్రస్తుతం వ్యాధి విస్తృత వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో దాదాపు నాలుగు నెలలుగా ఉపాధ్యాయులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరో వైపు లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసుల అవస్థలను గమనించిన ప్రభుత్వం..ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకునేందుకు వారిని పారా పోలీసులుగా ఎంపిక చేసింది. రోడ్లపై తిరిగితే వచ్చే నష్టాలను, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సేవలను వినియోగిస్తోంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులను పారా పోలీసులుగా వ్యవహరిస్తూ నిర్దేశిత ప్రాంతాల్లో పోలీసులతో కలిసి విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టింది. దీంతో కోవిడ్‌ వ్యాప్తి నిరోధానికి ఇకపై ఉపాధ్యాయులు సేవలందించనున్నారు.  

విధుల్లోకి 1861 మంది టీచర్లు 
జిల్లా వ్యాప్తంగా 1861మంది ఉపాధ్యాయులను పారా పోలీసులుగా విధుల్లో నియమించారు. వారిలో వ్యాయామ ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారు. స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీలు కూడా కొందరు ఉన్నారు. మహిళలు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారితో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల్లో 51 ఏళ్లు నిండిన వారిని ఈ విధుల్లోంచి మినహాయించారు. ఇతర టీచర్లలో 46 ఏళ్ల పైన వయసు ఉన్న వారిని కూడా మినహాయించారు. ఉపాధ్యాయులకు దగ్గర ప్రాంతాల్లోనే విధులు కేటాయించారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఉపాధ్యాయులు పారా పోలీసులుగా ప్రజాసేవలో నిమగ్నమవుతారు. 

సమీప పోలీస్‌స్టేషన్‌లలో రిపోర్టు.. 
డ్యూటీ ఆర్డర్లు పొందిన టీచర్లు వారి సమీప పోలీసుస్టేషన్‌ అధికారికి రిపోర్టు చేసి రోజువారీ డ్యూటీకి హాజరు కావాల్సి ఉంది. పారా పోలీసులుగా ఎంపికైన ఉపాధ్యాయులకు సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారి శానిటైజర్లు, మాస్కులను సమకూరుస్తారు. ఆయా ప్రాంతాల్లో కూడళ్లు, దుకాణాల సముదాయాలు, టీస్టాళ్లు, బస్టాండ్‌లు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు, చేపలు, మాంసం మార్కెట్లు తదితర ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా గుమికూడకుండా వీరు చూడాల్సి ఉంటుంది. అదే క్రమంలో వాహనాలను పరిశీలిస్తూ ఎక్కువమంది ప్రయాణించకుండా చర్యలు తీసుకుంటారు. రెడ్‌జోన్లు, కంటోన్‌మెంట్‌ జోన్లలో పారా పోలీసుల విధులు నిర్వహిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top