తీర్పు..మార్పు..పశ్చిమలో రాజకీయ ఒరవడి

Tdp Trouble In West Vishaka Constituency,Ysrcp In Positive Wave - Sakshi

సాక్షి, గోపాలపట్నం: పశ్చిమ నియోజకవర్గం రాజకీయాలకు పురిటిగడ్డ. ఎందరో నేతలకు రాజకీయ మార్గాన్ని చూపి అసెంబ్లీ మెట్లెక్కేలా చేసింది. నగరంలో అనేకమంది నేతలు ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధాలేర్పరుచుకుని ఉనికిని పెంచుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం ఏర్పడకముందు ఇక్కడ పెందుర్తి, విశాఖ రెండో నియోజకవర్గంలో కొంత భాగంగా ఉండేది ఈప్రాంతం. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన గుడివాడ అప్పన్న, పెతకంశెట్టి అప్పలనరసింహం, ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాథరావు, రాజాన రమణి, పల్లా సింహాచలం తదితర నేతలు ఇక్కడి ప్రజల అభిమానంతో అసెంబ్లీ అనుభవాన్ని పొందారు. 

వైఎస్సార్‌ సీపీకి అనుకూల పవనాలు 
వైఎస్సార్‌ సీపీకి నియోజకవర్గంలో అనుకూల వాతావరణమే ఉంది. ఇక్కడ మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు భారీగా ఉన్నారు. ఆయన హయాంలో చేపట్టిన సంక్షేమం జనంలో నాటుకుపోవడం, అదే సమయంలో ఇక్కడ మళ్ల విజయప్రసాద్‌ ఎమ్మెల్యేగా పని చేయడంతో పార్టీకి బలాన్నిస్తోంది. మళ్ల విజయప్రసాద్‌ ప్రజలతో పార్టీ శ్రేణులతో బాగా మెలగడం పార్టీకి లాభిస్తోంది. అలాగే అధికార పార్టీ చేపట్టిన సంక్షేమ లోపాలు వైఎస్సార్‌ సీపీకి మేలు చేకూరుస్తాయన్న భావన ప్రజల్లో ఉంది.

వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఓమారు ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆశ ప్రజల్లో కనిపిస్తోంది. పార్టీ కూడా నిర్మాణాత్మక పోరాటాలు, ప్రజాసమస్యలపై స్పందించే తీరు అనుకూలంగా మారే పరిస్థితి ఉంది. నవరత్న పథకాలు జగన్‌ అమలు చేస్తానని చెప్పడం కూడా మంచి విశ్వాసాన్నిచ్చింది.

ముడుపుల వసూళ్లు 
గణబాబు నియోజకవర్గంలో, చంద్రబాబు రాష్ట్రంలో సాగించిన పరిపాలన చాలా వర్గాలకు సంతృప్తినివ్వలేదనే ఆరోపణలున్నాయి. సంక్షేమం మాటున అవినీతి సాగిందని ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు పార్టీ అధినాయకత్వం ఎలా ఆదేశించిందో...సూచించిందో గానీ ఇక్కడ మాత్రం కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులుగా చెలామణి అయిన వారు ఇళ్ల స్ధలాలు అమ్ముకోవడం, హౌసింగ్‌ స్కీంలు మంజూరు చేసినా లబ్ధిదారుల నుంచి వేల మొత్తంలో ముడుపులు గుంజడం వల్ల ప్రజల్లో విశ్వాసం పొందలేకపోయారు.

ముడుపులు తీసుకుని పని చేస్తే ఏం సంక్షేమం జరిగిందని చెప్పాలన్న ప్రశ్న జనంలో వ్యక్తమవుతోంది. సంక్షేమాన్ని పొందడానికి ఇన్ని తిప్పలా అని పేదలు ప్రశ్నిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు కూడా ఆన్‌లైన్‌ పేరిట ముప్పుతిప్పలు పెట్టిన పరిస్థితులు కూడా మహిళలు, పేదల్లో ఒకింత అసహనానికి గురిచేశాయి. దళారీ లేకుండా మేమున్నాం అనే భరోసా ఇచ్చే పరిస్థితి లేదన్న బాధ జనంలో వ్యక్తమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top