ఆన్‌లైన్‌ మాటు.. ఓటుపై వేటు

TDP Target to YSRCP Voters in Srikakulam - Sakshi

గంపగుత్తగా ఫారం –7 దరఖాస్తులు

ఒక్క రోజులోనే 16,295 పెరిగిన వైనం

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యం

ఓటమి భయంతోనే అధికార  పార్టీ ఎత్తుగడ

అడ్డుకట్ట వేయని అధికారులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తథ్యమని ఓ వైపు సర్వేల్లో తేలడంతోనూ, మరోవైపు ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండంతోనూ ఆ పార్టీ నేతలకు మింగుడు పడటంలేదు. ఇప్పటికే గత ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమై ఉండటంతో ఇక అధికారం చేజారిపోతుందేమోనని భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత ఓట్లు తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా గ్రామాల్లో సర్వేల పేరిట వివరాలు సేకరించి గంపగుత్తగా ఫారం –7 దరఖాస్తులు ఆన్‌లైన్లో చేయించింది.

ఒక్కరోజులోనే వేలల్లో దరఖాస్తులు
జిల్లాలో ఒక్కరోజులోనే ఫారం –7 ద్వారా 16,295 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చాయి. గత నెల 28న కలెక్టర్‌ సమావేశం నిర్వహించి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 32,876 ఫారం– 7 చేరాయని ప్రకటించారు. ఈ ఒక్క రోజులోనే అంటే ఈ నెల 1వ తేదీ (శుక్రవారం సాయంత్రానికి) వీటి సంఖ్య 49,171కు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిని బట్టి చూస్తే, అడ్డగోలుగా ఓట్లు తొలగింపులో అధికార పార్టీ ఎంత నీచానికి దిగజారుతుందో స్పష్టమవుతోంది.– చోద్యం చూస్తున్న అధికారులు

గంపగుత్తగా ఫారం –7 దరఖాస్తులు చేసిన అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు పెడతామని కలెక్టర్‌ గురువారం సమావేశంలో స్పష్టం చేశారు. అయితే ఇలా అడ్డగోలుగా ఫారం –7 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేస్తున్న, చేసిన వారిని ఇప్పటి వరకు ఒక్కరినీ గుర్తించలేదు. ఎవ్వరిపైనా చర్యలూ తీసుకోలేదు. ఓ వైపు అధికార పార్టీ ఒత్తిళ్లు తలొగ్గుతున్న అధికారులు మాటల తప్ప, చర్యలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతేడాది ఏప్రిల్‌ నుంచే తొలగింపులు
జిల్లాలో టీడీపీ వ్యతిరేక ఓట్లు తొలగింపు ప్రక్రియకు గతేడాది ఏప్రిల్‌లోనే బీజం పడింది. ఆ సమయంలో ప్రధానంగా పట్టణాలపైనే దృష్టిసారించారు. ఈ మేరకు ఇంటింటా సర్వేలు చేసి పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో బీఎల్వోలను భయపెట్టి, మభ్యపెట్టి తప్పుడు సమాచారమిచ్చి జిల్లా వ్యాప్తంగా 40 వేలకుపైగా ఓట్లు తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో సుమారుగా లక్ష ఓట్లు వరకు గల్లంతు చేసేశారు. ప్రస్తుతం ఫారం –7 దరఖాస్తులు ఆన్‌లైన్లో చేసి, ప్రతికూల ఓటును తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు.

ఓటమి భయంతోనే..
ఇటీవల కాలంలో టీడీపీ నాయకుల నియంతృత్వ ధోరణి మితిమీరింది. దురుసుగా ప్రవర్తించడం, ప్రజలపై ఎక్కడికక్కడా భౌతికదాడులకు దిగడం వంటి చేష్టలతో ప్రజా వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పరాజయం తప్పదని టీడీపీ పాలకులకు బెంగ పట్టుకుంది. పలు నియోజకవర్గాలో ఇప్పటికే వారి ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం కోల్పోతామన్న భయంతో అడ్డదారులకు తొక్కుతున్నారు. అందులో భాగంగా సర్వేల పేరిట వివరాలు సేకరించి ఓట్లు తొలగింపునకు దిగారు.

పలుమార్లు వైఎస్సార్‌ సీపీ నాయకుల ఫిర్యాదులు
ఓట్లు తొలగింపులపై గతేడాదిగా జిల్లాకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు కలెక్టర్‌కు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పలుమార్లు గ్రీవెన్సులో విన్నవించారు. ఈ విషయమై వీరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల కొంతమంది సర్వేల పేరిట తొలగించిన యువకులను పట్టుకుని అధికారులకు అప్పగించారు. వారిపై పోలీసులుగానీ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగానీ చర్యలు తీసుకున్న పాపానపోలేదు. తాజాగా శుక్రవారం వైఎస్సార్‌ సీపీ యువ నాయకులు, మరి కొంతమంది కూడా శ్రీకాకుళం ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదులు చేస్తున్నా, ఎన్నికల కోడ్‌ వచ్చినా అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో అక్రమ ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకునే ఆనవాళ్లు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top