వైఎస్సార్‌సీపీ ఓట్లే టార్గెట్‌

TDP Target to YSRCP Voters in PSR Nellore - Sakshi

తొలగించేందుకు టీడీపీ నాయకుల ప్రయత్నాలు

ఆన్‌లైన్‌లో సుమారు  3 వేల ఫారం–7 దరఖాస్తులు

నివ్వెరపోయిన రెవెన్యూ డివిజనల్‌ అధికారులు

ఫోన్‌ చేసి ఆరాతీయగా తాము దరఖాస్తు చేయలేదన్న ఓటర్లు 

నాయుడుపేట: వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్లను టార్గెట్‌ చేశారు. ఓటరుకి తెలియకుండా ఫారం–7ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఒక్కసారిగా అంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వారు స్పందించడంతో అసలు వ్యవహారం బయటపడింది.

నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లోని వైఎస్సార్‌సీపీ ఓటర్లను టీడీపీ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. నాయుడుపేట మండలం నుంచి 1,746 ఓట్లు, పెళ్లకూరు మండలం నుంచి 635 ఓట్లు, ఓజిలి మండలం నుంచి 583 ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్‌లో ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. టీడీపీ నాయకులు అనేకమంది ఐడీలు వినియోగించి అభ్యంతరాలు పెట్టినట్లుగా తెలిసింది. ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ చేపట్టారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడంతో ఆర్డీఓ కార్యాలయ అధికారులు అనుమానం వ్యక్తం చేసి గురువారం ఆర్డీఓ శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె సిబ్బందితో ఇలా జరగడానికి గల కారణాలను ఆరా తీశారు.

ఫోన్‌ చేయగా..
ఆర్డీఓ శ్రీదేవి దరఖాస్తుదారుల్లో ఇద్దరికి ఫోన్‌ చేసి అభ్యంతరాలు పెట్టింది మీరేనానని అడిగారు. తమకు తెలియదని వారు చెప్పారు. దీంతో ఆమె దరఖాస్తు చేయలేదని సంతకాలు చేస్తే ఓట్లను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. ఈ క్రమంలో మండల అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన ఆర్డీఓ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలగింపునకు అభ్యంతరాలు పెట్టిన ఓట్లను యథావిధిగా ఉంచేలా చూడాలని చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతో వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించేందుకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top