పథకం ప్రకారమే పంపిణీ! 

TDP sympathetic officers hands in Pagan Campaign on bus tickets in Tirumala - Sakshi

తిరుమలలో అన్యమత ప్రచారం బస్సు టికెట్లపై నిజాలు వెలుగులోకి

ఆర్టీసీ హౌజ్‌ ఉన్నతాధికారి అండతో నెల్లూరు స్టోర్స్‌ నుంచి ప్లాన్‌ అమలు

టీడీపీ పెద్దల మెప్పు కోసం కుట్రకు కొందరు అధికారుల సహకారం 

సాక్షి, అమరావతి:  తిరుమలలో అన్యమత ప్రచారం బస్సు టికెట్లకు సంబంధించి టిమ్‌ రోల్స్‌ పంపిణీ వెనుక టీడీపీ సానుభూతిపరులైన అధికారుల పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఇద్దరు ఆర్టీసీ హౌజ్‌లో కీలక అధికారులు కాగా మరొకరు నెల్లూరు స్టోర్స్‌ అధికారి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి అందిన సూచనల మేరకే తిరుమలకు ఈ రోల్స్‌ పంపినట్లు స్టోర్స్‌ అధికారులు పేర్కొనడం గమనార్హం. మైనార్టీ సంక్షేమ పథకాలతో ఉన్న టిమ్‌ రోల్స్‌ను అన్నీ తెలిసే తిరుమలకు పంపించారని దీన్ని బట్టి రూఢీ అవుతోంది. ఒక్కో టిమ్‌ రోల్‌ ఖరీదు రూ.6 కాగా 30 వేల టిమ్‌ రోల్స్‌ నెల్లూరు స్టోర్స్‌లో ఉన్నాయి. వీటి ఖరీదు రూ.1.80 లక్షలు. గత ప్రభుత్వం ముద్రించిన ఈ టిమ్‌ రోల్స్‌ను పక్కన పడేయకుండా తిరుమలకు పంపించేలా టీడీపీ రచించిన కుట్రలో అధికారులు పావులుగా మారినట్లు పేర్కొంటున్నారు. 

టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు... 
నెల్లూరు స్టోర్స్‌లో టిమ్‌ రోల్స్‌ కేటాయించే ఓ అధికారికి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం ఆయన చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి అండదండలున్నాయని, టీడీపీ పెద్దల మెప్పు కోసమే బస్సు టికెట్ల వివాదానికి సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు పథకాలతో కూడిన టిమ్‌ రోల్స్‌ను జూన్‌ 18 తర్వాత పంపిణీ చేయడాన్ని బట్టి పథకం ప్రకారమే చేశారని తెలుస్తోంది.  

‘నామినేటెడ్‌’ చేతిలో పావులు... 
గత ప్రభుత్వం ఆర్టీసీ నామినేటెడ్‌ పోస్టులో నియమించిన ఓ టీడీపీ నేత సహకారంతో చేసిన దుష్ప్రచారంలో అధికారులు పావులుగా మారారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయినా ఇంకా నామినేటెడ్‌ పోస్టులోనే కొనసాగుతున్న సదరు నేత బదిలీ వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్నట్లు సమాచారం. 

ఖాళీగా విజిలెన్స్‌ డైరెక్టర్‌ పోస్టు... 
ఆర్టీసీలో ఫిర్యాదులపై విచారణ జరిపే విజిలెన్స్‌ విభాగానికి ఐజీ స్ధాయి అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఏళ్ల తరబడి ఈ పోస్టును యాజమాన్యం భర్తీ చేయడం లేదు. పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించే ఈడీ మూడేళ్లుగా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్‌ విభాగం నివేదికల్ని ఆర్టీసీ బోర్డు, ఎండీ పరిశీలిస్తున్నారో  లేదో కూడా అంతుబట్టని పరిస్థితి నెలకొంది. దీంతో ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

విలీనాన్ని అడ్డుకునే ఎత్తుగడలు.. 
ఆర్టీసీలో కొందరు ఉన్నతాధికారులు సంస్థ విలీనాన్ని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్టీసీ విలీనంపై కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సీనియర్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి జగన్‌ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. పలు దఫాలు కారి్మక సంఘాలు, అధికారులతో సమావేశమైన కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. అయితే ఆర్టీసీ విలీనం జరిగితే తమ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని కొందరు ఉన్నతాధికారులు దీన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top