రూ.5వేలూ వదల్లేదు

 అంగన్‌వాడీ కేంద్రాల సామగ్రి కొనుగోలులో  సర్పంచ్‌ల చేతివాటం       తామెందుకు కొనాలంటూ పలుచోట్ల నిరాకరణ

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది జిల్లాలోని తెలుగు తమ్ముళ్ల తీరు. ఇసుక దందా మొదలు నీరు–చెట్టు పనులు, పోస్టుల అమ్మకాలు, మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి ఇలా ప్రతి దానిలోనూ అక్రమాలకు తెరతీసి దోచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లల అవసరాల నిమిత్తం ఖర్చుచేస్తున్న రూ. 5వేలు పంచాయతీ నిధులను కూడా అధికారపార్టీకి చెందిన సర్పంచ్‌లు వదల్లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించి ఆయా పంచాయతీల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఈ బాధ్యత గ్రామసర్పంచ్‌లే చేపట్టాలని ఆదేశించింది. దీంతో వీటిలోనూ సర్పంచ్‌లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది తామెందుకు ఇవ్వాలంటూ సామగ్రి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సర్పంచులను ప్రశ్నించలేకపోతున్నారు. కొన్నిచోట్ల వారు కొన్న అరకొర వాటినే శిరోధార్యంగా స్వీకరించే పరిస్థితి నెలకొంది.

కార్యకర్తలకు భారంగా నిర్వహణ
జిల్లాలో 15 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల ద్వారా 3,268 అంగన్‌వాడీ కేంద్రాలు, 353 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 45,435 మంది గర్భిణీలు, బాలింతలు, 2,03,281 మంది చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అయితే అంగన్‌వాడీ కేంద్రాల్లో కుర్చీలు, ఫ్యాన్లు, గ్యాస్, వంటకు సంబంధించిన సామాన్లు లేకపోవడంతో కేంద్రాల నిర్వహణ కార్యకర్తలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ. 5వేల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిధులను పంచాయతీల ద్వారా ఆయా గ్రామ సర్పంచులే ఖర్చుచేయాలని ఆదేశించింది. కానీ జిల్లాలో ఎక్కువచోట్ల నేటివరకు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.

జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది సర్పంచులు అరకొర సామగ్రి కొని నిధులు స్వాహా చేసినట్లు సమాచారం. వాస్తవానికి రూ.5 వేల నిధులతో అంగన్‌వాడీ కేంద్రానికి కావాల్సిన ఫ్యాన్లు, కుర్చీలు, స్టవ్, కుక్కర్‌తోపాటు వంటకు సంబంధించిన చిల్లర సామగ్రి కూడా కొనుగోలు చేసే అవకాశముంది. కానీ ఏ అంగన్‌వాడీ కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో సామాన్లు కొనలేదనే చెప్పవచ్చు. అరకొర సామాన్లు కొని రూ.5 వేలు బిల్లులను పంచాయతీల్లో పెట్టుకుంటున్నట్లు సమాచారం. కార్యకర్తలు ఏమీ అనలేక ఇచ్చిన వాటినే తీసుకుంటుండడం విశేషం.

సామాన్లే కొనలేదు
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాన్లు కొనని పంచాయతీలు చాలానే ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాన్లు లేక కార్యకర్తలు సతమతమవుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా పంచాయతీల నుంచి కొనమనడాన్ని సర్పంచులు తప్పుబడుతున్నారు. తమ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలకు సామాన్లు కొనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి ఖాదర్‌బాషను ‘సాక్షి’ వివరణ కోరగా, అన్ని పంచాయతీల్లోనూ అంగన్‌వాడీ కేంద్రానికి సామాన్లు కొనుగోలు చేయాలని ఆదేశించామన్నారు. కానీ డబ్బులున్న పంచాయతీల్లో కొనుగోలు చేస్తున్నారని, మిగతా వాటి విషయమై ఆలోచిస్తున్నామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top