‘స్థానిక’ ఎమ్మెల్సీ ఫలితాల్లో ‘బ్రీఫ్డ్‌ మీ’!

‘స్థానిక’ ఎమ్మెల్సీ ఫలితాల్లో ‘బ్రీఫ్డ్‌ మీ’!


ఓటుకు కోట్లు తంత్రం విజయవంతం

అడుగడుగునా ప్రలోభాలు.. బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు, కర్నూలు, కడప :  బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గడానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘ఓటుకు కోట్లు’ తంత్రాన్ని విజయంతంగా అమలు చేసింది. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ భావించింది. తమ అభ్యర్థి గెలుపు కోసం నాడు తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అధినేత సహా టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.ఈ కేసు ఇంకా కోర్టు విచారణలో ఉంది. ఈ కేసు విచారణ పూర్తయి దోషులను శిక్షించి ఉంటే ఇపుడు రాష్ట్రంలోనూ అదే అవినీతి సంస్కృతి కొనసాగి ఉండేది కాదు. వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థలలో బలం లేదు. అయినా అభ్యర్థులను బరిలోకి దింపింది. మెజారిటీ స్థానిక ప్రజాప్రతినిధులున్న వైఎస్సార్సీపీ నుంచి ఓట్లను నల్లడబ్బుతో కొనుగోలు చేసింది.  లొంగని వారిని బెదిరించింది. చెప్పినట్లు వినకపోతే నష్టపోతారంటూ కళ్లెర్ర చేసింది.నెల్లూరు  జిల్లాలో 852 ఓట్లకు 851 పోల్‌ కాగా ఇందులో 8 ఓట్లు చెల్లనివిగా ప్రకటించి పక్కన పెట్టేశారు. మిగిలిన 843 ఓట్లలో టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి 465 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డికి 378 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రకటించారు.  కర్నూల్లో  జిల్లాలో పోలైన 1077 ఓట్లలో 11 చెల్ల లేదు. మిగిలిన 1066 ఓట్లలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డికి 564 రాగా,  వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 62 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.  కడపలో రూ.100 కోట్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలు నివ్వెరపోయేలా వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ పెద్దలు గెలుపు కోసం అక్షరాలా వంద కోట్ల రూపాయలు వెదజల్లారు.జిల్లాలో 521 మంది వైఎస్సార్‌సీపీ ఫ్యాను గుర్తుపై గెలిచినవారు ఉండగా, 300 మంది టీడీపీ సైకిల్‌ గుర్తుపై గెలిచిన వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ  డబ్బుతో నిమిత్తం లేకుండా గెలుపే లక్ష్యంగా వ్యవహరించింది. జిల్లాలో పోలైన 839 ఓట్లలో 8 చెల్ల లేదు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి)కి 434 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డికి 396 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చింది. దీంతో టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు  ప్రకటించారు.

Back to Top