ఇంత జనమా.. ఎలా?!

TDP Party Shock To See People In YS Jagan Padayatra - Sakshi

వైఎస్‌జగన్‌ సభకు జనం పోటెత్తడంతో టీడీపీలో కలవరపాటు

నర్సీపట్నంలో జగన్‌ ప్రభంజనంపై సీఎం చంద్రబాబు ఆరా

స్వచ్ఛందంగా తరలి వచ్చారని నివేదించిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు

జోరు వర్షంలోనూ నిల్చున్నారంటే అద్దె జనం కాదని స్పష్టీకరణ

అయ్యన్న ఇలాకాలో ఇదో కొత్త చరిత్ర

టీడీపీలో దిగాలు... వైఎస్సార్‌సీపీలో హుషారు

నాలుగు రోజులుగా పాదయాత్ర కొనసాగుతోంది.. పైగా వర్షం వెంటాడుతోంది.. ఇక ఏం జనం వస్తారులే.. అని తేలిగ్గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి.. జననేత పాల్గొన్న నర్సీపట్నం బహిరంగ సభ గట్టి షాక్‌ ఇచ్చింది..వర్షం పడుతున్నా.. సభ నిర్ణీత సమయం కన్నా ఆలస్యమైనా వెల్లువలా తరలివచ్చిన జనప్రవాహం.. సభ ఆద్యంతం కదలకుండా వర్షంలో తడుస్తూనే వై.ఎస్‌.జగన్‌ ప్రసంగాన్ని వినడమే కాకుండా.. టీడీపీ పాలనపైనా, మంత్రి అయ్యన్నపైనా విమర్శల విల్లు ఎక్కుపెట్టినప్పుడల్లా స్పందించిన తీరు.. ‘నాకు మీ అందరి ఆశీçస్సులు కావాలని’ ఆయన కోరినప్పుడు.. అంగీకారసూచకంగా నినాదాలతో హోరెత్తించడం.. వంటి పరిణామాలను ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబుతో సహా పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు.. ఎలా.. ఇంత జనం స్వచ్ఛందంగా తరలివచ్చారని మల్లగుల్లాలు పడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ముఖద్వారమైన నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాల్గొన్న మొదటి సభ కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించడం అధికార వర్గాల్లో చర్చకు తెరలేపగా.. అధికార పార్టీ నేతలకు వణుకు పుట్టించింది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విశాఖ జిల్లా గన్నవరం మెట్ట వద్ద మొదలైనప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అయినా పాదయాత్రకు జనం పోటెత్తుతూనే ఉన్నారు. కాగా పాదయాత్రలో భాగంగా నర్సీపట్నంలో శనివారం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే శనివారం ఉదయం నుంచి జోరున వర్షం కురుస్తుండడంతో సభకు ఏ మేరకు జనం వస్తారోనన్న ఆందోళన ఒకింత పార్టీ వర్గాల్లోనూ కన్పించింది. ఇదే విషయం అధికార పార్టీ వర్గాల్లో.. ముఖ్యంగా మంత్రి అయ్యన్న వర్గీయుల్లో చర్చనీయాంశమైంది. సభాప్రాంగణం సహా నర్సీపట్నం అంతా వర్షం కురుస్తుండడంతో ఇక సభ సంగతి అంతే అనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి చేర వేశాయి. ఒక వేళ జరిగినా అంతంత మాత్రంగానే ఉంటుందని నివేదించాయి.  నాలుగు రోజులుగా నర్సీపట్నం నియోజకవర్గంలోనే పాదయాత్ర జరుగుతున్నందున బహిరంగ సభకు జనం ఓ మాదిరిగానే వస్తారన్న వాదనలూ వినిపించాయి.

అయితే అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌ బస చేసిన బలిఘట్టం నుంచే వేలాది మంది పాదయాత్రగా ఆయన వెంట నడుస్తూ సభాస్థలి అయిన శ్రీకన్య డౌన్‌ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి వేలాది మందితో నడుస్తూ శ్రీకన్యడౌన్‌లో మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన వాహనం ఎక్కేందుకు జగన్‌కు అర్ధగంటకు పైగానే పట్టిందంటే అక్కడ ఏ స్థాయిలో జనసందోహం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటికి కూడా వర్షం జోరు తగ్గలేదు. అయినా జనం ఇసుమంౖతైనా కదల్లేదు. గొడుగులు వేసుకుని కొందరు.. మిగతావారు తడుస్తూనే తమ నేత ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. చుట్టుపక్కల బిల్డింగ్‌లు, చివరకు సినిమా థియేటర్లు కూడా ఎక్కేసి మరీ జననేతను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు ఉత్సాహం చూపించడం చర్చకు తెరలేపింది. రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు జనాన్ని తరలిస్తారనే అపప్రద ఉన్న నేపథ్యంలో జోరు వర్షంలో సైతం తడుస్తూ అడుగు కదపక పోవడం చూసి వారంతా స్వచ్ఛందంగా వచ్చినవారేనని ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిర్ధారణకు వచ్చా యి. సభ జరిగిన తీరు.. జగన్‌ ప్రసంగానికి వచ్చి న స్పందన.. ఆయన ప్రశ్నలకు చప్పట్లు కొడు తూ, చేతులూపుతూ సానుకూలంగా స్పందించిన తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

దేశంలో దిగాలు..వైఎస్సార్‌సీపీలో హుషారు
వాస్తవానికి నర్సీపట్నం నియోజకవర్గం టీడీపీకి పెట్టనికోట అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడే ఐదు టెర్ములుగా ప్రాతినిద్యం వహిస్తున్నారు. 2009లో వైఎస్‌ ప్రభంజనంతో ఆయన ఓటమి చవి చూసారు. 2014లో చావుతప్పికన్నులొట్టపోయిన చందంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేష్‌పై అతిస్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కారు. 2009లో ఓటమి, 2014లో పరాజయం అంచు వరకు వెళ్లి బయటపడినప్పటికీ టీడీపీ ఇప్పటికీ నర్సీపట్నాన్ని కంచుకోటగానే భావిస్తుంటుంది. అటువంటి నర్సీపట్నంలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టడం.. ఆయన బహిరంగ సభకు కనీవిని ఎరుగని రీతిలో జనం వెల్లువలా తరలిరావడం అధికార పార్టీ నేతల్లో కలవరం రేపింది. ఇంటెలిజెన్స్‌ నివేదికలతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి దీనిపై ఆరా తీసినట్టు తెలిసింది.  నర్సీపట్నం చరిత్రలోనే ఇది అతిపెద్ద సభగా నమోదు కావడం.. జోరు వర్షంలోనూ జనం నిలబడిపోవడం పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్‌తో నడిచేందుకు పోటీపడి జేజేలు కొట్టడం.. వెరసి జగన్‌ సభ కొత్త చరిత్ర సృష్టించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద సభ ఊహించని విధంగా విజయవంతం కావడంతో టీడీపీ వర్గాలు దిగాలు చెందుతుండగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మాత్రం సమరోత్సాహం ఉరకలెత్తుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top