కారు చీకట్లలో సైకిల్‌

TDP Party Loss In Telangana Elections - Sakshi

తెలంగాణా ఫలితాలతో అధికార పార్టీ నాయకుల డీలా

చంద్రబాబు నిర్ణయాలపై రగులుతున్న శ్రేణులు

కాంగ్రెస్‌ నాయకులదీ అదే తీరు

వచ్చే ఎన్నికలపై వేసుకున్న లెక్కలకు చిక్కులు

ఉభయపక్షాలలో అలముకున్న నిరాశ

తెలంగాణా ఫలితాలతో జిల్లా టీడీపీ డీలా పడింది. తమ నాయకుడి వ్యూహాలపై పెంచుకున్న విశ్వాసం కాస్తా వికటించింది. చంద్రబాబు రాజకీయజాలంతో తమకు మళ్లీ మంచిరోజులొస్తాయని భావించిన కాంగ్రెస్‌ నాయకుల భ్రమలు కూడా పటాపంచలయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ శిబిరంలో ఉత్తరాదిలో గెలిచిన ఆనందం కూడా లేకుండా పోయింది. బాబు బాటలో పయనించి మూటగట్టుకున్న పరాభవమే వారిని దిగ్భ్రమకు గురిచేసింది. జాతీయ రాజకీయాల్లోనూ తమ అధినేత చక్రం తిప్పుతున్నాడని సంబరపడుతున్న తరుణంలో తెలంగాణ ఫలితాలు ఆ పార్టీ నాయకులను ఖంగు తినిపించాయి.

సాక్షి, తిరుపతి: తెలంగాణా ఫలితాలతో జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు నైరా శ్యంలో పడ్డారు. ఏపీలో ఎన్నికల ముందు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఘోరంగా దెబ్బతిన్నామని కలవరపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా అడుగులేయడంతోనే ఇలా జరిగిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగాఆవిర్భవించి పార్టీని కాంగ్రెస్‌తో జతకటŠ?ట్టంచడాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలకు ఈఫలితాల తర్వాత  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు వద్దని జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ శిబిరాల్లో నిరాశ అలముకుంది. పార్టీ కార్యాలయాలకు కూడా ఎవరూ రాలేదు. నేతలంతా నిరాశలో మునుగుతూ టీవీలకు అతుక్కుపోయారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చెలిమిపై నాయకులంతా మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. పొత్తు ఉంటే మళ్లీ నష్టపోతామని..చంద్రబాబు జాతీయ రాజకీయాలంటూ పార్టీని నట్టేట ముంచుతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

పొత్తుతో చిత్తు..
పొత్తు లాభిస్తుందని ఆశపడ్డ జిల్లా నాయకులకు తెలంగాణా ఫలితాలు షాకిచ్చాయి. తెలంగాణా గెలుపుతో ఊపొచ్చి బలోపేతమవుతామని ఉభయపక్షాలు భావించాయి. ఆ నమ్మకంతో తిరుపతి, నగరి, పీలేరు, మదనపల్లికి చెందిన ఈ నాయకులు వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు మూడు అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేస్తుందని టీడీపీ నేతలు లెక్కలేసుకున్నారు.  టీడీపీతో చెలిమితో రెండు పార్లమెంట్‌ స్థానాలపై ఆశలు కాంగ్రెస్‌ నాయకులు ఆశలు పెంచుకున్నారు.  తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్‌ ఏకంగా ప్రచారం కూడా మొదలుపెట్టాశారు కూడా. రాజంపేట పార్లమెంట్‌ సీటుపైనా కాంగ్రెస్‌ నేతలు ఆశగా చూస్తున్నారు.  రాజంపేట నుంచి మాజీ కిరణ్‌ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్‌ ఇటీవల ఒక దశలో చెప్పారు కూడా. తెలంగాణా ఫలితాలతో ఇరు పార్టీ నేతలు ప్రశ్నార్థకంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామా? వద్దా? పెట్టుకుంటే తెలంగాణా ఫలితాలు పునరావృతం అవుతాయా అని మదనపడుతున్నట్లు భోగట్టా. ఇరు పార్టీలకు చెందిన ఎక్కువ నాయకులు మాత్రం అంతర్గత చర్చలలో పొత్తు అనైతికమంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని, దెబ్బలాడుకుని, కేసులుపెట్టుకుని కేవలం అధికారం కోసం చేతులు కలపటం భావ్యం కాదని చెప్పినట్లు సమాచారం. తాజా ఫలితాల తర్వాత రెండు పార్టీల నేతల్లో విభేదాలు కూడా అప్పుడే పొడసూపుతున్నాయి. కాంగ్రెస్‌ సరిగ్గా తమ నేతను పట్టించుకోనందునే ఓటమి ఎదురైందని తిరుపతికి చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

కొంపముంచి బెట్టింగులు
లగడపాటి సర్వేని నమ్మి బెట్టింగ్‌లు పెట్టిన ఇరు పార్టీల నేతలకు తెలంగాణా ఫలితాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణా ఫలితాలపై జిల్లాలో కోట్ల రూపాయలు బెట్టింగులు జరిగినట్లు తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లికి చెందిన ఐదుగురు నాయకులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... ఫలితాలు వెలువడ్డాక లగడపాటి సర్వేని నమ్మకుండా ఉండి ఉంటే బాగుండని తమ అనుచరుల వద్ద బోరుమనటం ఇందుకు నిదర్శనం. కాగా తెలంగాణా ఫలితాలపై వ్యాఖ్యలు చెయ్యొద్దని అధిష్టానం నుంచి ఆదేశాలు అందటంతో టీడీపీ నాయకులు నోరెత్తటం లేదు. తెలంగాణ వల్ల ఉత్తరాది విజయంతో సంతోషం పొందలేకపోతున్నామని మదనపల్లెకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడన్నారు.

ప్రజాభిప్రాయం మేరకే  వెళ్లాలి
ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాభిప్రాయం మేరకే ముందుకు వెళ్లాలి. అది పోలైనా? చంద్రబాబు కేవలం పార్టీ మనుగడ కోసం తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. కేసీఆర్‌ తన పరిపాలనలో లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా ద్దాంతాల్లో మార్పు తీసుకురావాలి. పార్టీని రద్దుచేసి కొత్త పోకడలతో ముందుకు వెళ్తే భవిష్యత్‌ ఉంటుంది.– మాజీ స్పీకర్, అగరాల ఈశ్వర్‌రెడ్డి, తిరుపతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top