రక్షణలేని భటుడు

TDP Leaders Threats To Traffic Police In Vijayawada - Sakshi

మితిమీరిన అధికార పార్టీ నేతల ఆగడాలు

పోలీసులపై దాడులకు వెనుకాడని వైనం

నేతల అండతో పెట్రేగిపోతున్న పార్టీ శ్రేణులు

పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నా చర్యలు శూన్యం

రక్షకభటులకు బెజవాడలో రక్షణ కరువైందా?.. అధికార బలంతో రెచ్చిపోతున్న పచ్చ శ్రేణులు పోలీసులను లెక్క చేయడం  లేదా? దాడులకు  కూడా వెనుకాడటం లేదా? వంటి ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. అధికార పార్టీ ముసుగులో కొందరు పోలీసులపై దాడులకు తెగబడుతున్నా చర్యలు మాత్రం శూన్యం.

సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ నగరంలో పోలీసులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సివస్తోంది. నగర నడిబొడ్డున ఓ టీడీపీ నేత తప్పతాగి పోలీసులపై దాడి చేసి నానా హంగామా సృష్టించాడు. అయినా అతనిపై కేసు నమోదు చేయకుండా ఓ అమాత్యుడు పోలీసులపై ఒత్తిడి తేవడం జరిగింది. దీంతో పోలీసులు అసలు అక్కడ గొడవే జరగలేదని చెప్పడం విస్మయానికి గురిచేసింది. నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరులమరావు ఆదేశాల మేరకు నగరంలో ఈ నెల 7వ తేదీ రాత్రి పోలీసులు డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసుల తనిఖీల్లో  ఎన్‌టీఆర్‌ సర్కిల్‌వద్ద ఒక టీడీపీ నేత తప్పతాగి వాహనం నడుపుతూ పొలీసులకు పట్టుబడ్డాడు. ట్రాఫిక్‌ పోలీసులు అతను ఎంత మోతాదు మద్యం సేవించాడో నిర్ధారించుకోవడానికి బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టు చేయటానికి సిద్ధమవుతుండగా వారిపై ఆ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. విధుల్లో ఉన్న పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించడంతో కోపోద్రిక్తుడైన టీడీపీ నేత ఒక్కసారిగా వారిపై దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించటంతో స్థానిక పోలీసులు సైతం అక్కడకు చేరుకుని టీడీపీ నేతతో పాటు అతని అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత అనుచరులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని అక్కడ నానా హంగామా సృష్టించారు. పోలీసులపై దుర్భాషలాడారు. మమ్మల్నే స్టేషన్‌కు తీసుకు వస్తారా? అంటూ వీరంగం సృష్టించారు. చివరకు మంత్రి రంగంలోకి దిగడంతో పోలీసు ఉన్నతాధికారులు కేసును నీరుగార్చారు. దీంతో దాడిలో దెబ్బతిన్న పోలీసులు ఉన్నతాధికారులకు ఎదురు చెప్పేందుకు సాహసించలేక మౌనంగా ఉండిపోయారు.

ఫొటో తీసి.. ఏమీ పికుతావ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌పై దుర్భాషలాడిన ఓ టీడీపీ నేత
నీవెంత.. నీవు ఏం చేస్తావ్‌.. నీఇష్టం వచ్చిన వారికి చెప్పుకో’ అంటూ ఓ టీడీపీ నేత ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడిన ఘటన ఈ నెల 20వ తేదీ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ముందు చోటుచేసుకుంది. సాయంత్రం 5.55 గంటల సమయంలో బందరు రోడ్డు నుంచి పాత బస్టాండ్‌ రోడ్డు వైపునకు వెళ్లేందుకు కారు మలుపు తిరుగుతోంది. అయితే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కుమార్‌ వాహనాన్ని నిలిపివేయడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో వాహనం నడుపుతున్న వ్యక్తి నడిరోడ్డుపై వాహనాన్ని ఆపి కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లి కొట్టేంత పనిచేశాడు. కానిస్టేబుల్‌ కుమార్‌ అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగానే.. మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ నేత.. ‘నేను ఎవరనుకుంటున్నావ్‌.. నీకంటికి ఏవిధంగా కనబడుతున్నాను.. నేనేమన్నా అడుక్కునే వాడినా..’ అంటూ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ కుమార్‌పై దురుసుగా మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నందుకే మిమ్మల్ని ఆపానని కానిస్టేబుల్‌ బదులు ఇస్తూ.. తన కెమెరాతో వాహనం ఫొటో తీశారు. అయినా ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా కానిస్టేబుల్‌కు దగ్గరగా వెళ్లి ‘నువ్వేం చేస్తావ్‌.. ఫొటోలు తీసి ఏమి పికుతావ్‌’ అంటూ మళ్లీ హేళనగా మాట్లాడాడు. బాగా రద్దీ ఉన్న రోడ్డుపై ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై టీడీపీ నేత అలా దురుసుగా వ్యవహరించడంపై రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు చూసి ముక్కన వేలేసుకోవడం కనిపించింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే మరో కానిస్టేబుల్‌ వచ్చి ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేయడం కొసమెరుపు. కాగా.. నిబంధనల్ని బేఖాతరు చేసిన వ్యక్తి మాత్రం కానిస్టేబుల్‌ వైపు ఆగ్రహంగా చూస్తూ దర్జాగా వాహనం నడుపుకుంటూ వెళ్లడం గమనార్హం.

సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడి..
గణేష్‌ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఈ నెల 22న పటమటలోని బందరు రోడ్డులో అధికార పార్టీకి చెందిన కొందరు సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచారు. రాత్రి 11 గంటల సమయంలో నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న గణేష్‌ విగ్రహాన్ని ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. అయితే గుర్రపు బగ్గీలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఊరేగింపులో హడావుడి చేస్తున్న టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆ వివాదం కాస్త చినికి చినికి గాలివానగా చివరకు సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడులకు కారణమైంది. పూటుగా మద్యం తాగి ఉన్న పార్టీ శ్రేణులు పోలీసుల మాటలు పెడచెవిన పెట్టడమే కాకుండా ఏకంగా విధుల్లో ఉన్న సీఐ బ్యాడ్జీని చించివేశారు. ఎస్‌ఐను పట్టుకుని గాల్లోకి లేపారు. ముగ్గురు కానిస్టేబుళ్లను తోసేసి, ఒక కానిస్టేబుల్‌పై దాడికి దిగి చొక్కాను చించేశారు. కేవలం కొందరు అల్లరిమూకలపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధి ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో కేసును మమ అనిపించినట్లు తెలిసింది.

ఓ సినిమాలో పేరు మోసిన విలన్‌ను ఓ కుర్రాడు కొట్టాడన్న విషయం దావనంలా వ్యాప్తించడంతో.. ఆ విలన్‌ ‘నన్ను ఎవరూ కొట్లా..’ అంటూ బతిమలాడినట్లుగా బెజవాడ నగర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎక్కడా ఏమీ జరగలేదు.. ఎవరూ పోలీసులపై దౌర్జన్యం చేయలేదు.. కేవలం ఘర్షణ పడ్డారు..’ అంటూ తేలిగ్గా తీసిపారేయడం కొసమెరుపు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top