అమ్మకానికి ఆపరేటర్‌ పోస్టులు

tdp leaders Sale for Operator posts  - Sakshi

జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని 160 షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులకు బేరసారాలు

 ఒక్కో ఆపరేటర్‌ పోస్టుకు 5 నుంచి 10 లక్షల వసూలు

వాచ్‌మెన్‌ పోస్టుకు రూ.2 లక్షలు

గిద్దలూరు, యర్రగొండపాలెంలో అధిక రేట్లు

పలుచోట్ల పోస్టులకు వేలంపాట

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు కాసులపంట

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని షిఫ్ట్‌ ఆపరేటర్, వాచ్‌మెన్‌ పోస్టులను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టును 5 నుంచి 10 లక్షల రూపాయలకు బేరం పెడుతున్నారు. మార్కాపురం విద్యుత్‌ డివిజన్‌ పరిధిలోని గిద్దలూరు నియోజకవర్గంలో అయితే ఈ పోస్టులకు మరింత డిమాండ్‌ ఉంది. దీంతో ఇక్కడి నేతలు ఒక్కో పోస్టును 8 నుంచి 10 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. యడవల్లి, అర్ధవీడు సబ్‌స్టేషన్ల పరిధిలో నాలుగు షిఫ్ట్‌ ఆపరేటర్, రెండు వాచ్‌మెన్‌ పోస్టులు ఉండగా, స్థలదాతలకు రెండు వాచ్‌మెన్‌ పోస్టులు కేటాయించారు. మిగిలిన 8 షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులను టీడీపీ నేతలు అమ్మకానికి పెట్టారు. 

అర్ధవీడు సబ్‌స్టేషన్‌ పరిధిలో వివాదం...
అర్ధవీడు సబ్‌స్టేషన్‌లో పోస్టుల నియామకం వివాదానికి దారితీసింది. తొలుత ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పోస్టు ఇచ్చిన అధికార పార్టీ నేతలు.. ఆ తర్వాత దాన్ని మార్చి మరొకరికి కేటాయించారు. దీంతో అది కాస్తా వివాదంగా మారింది. దీని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. కచ్చిపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలోని కొన్ని షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులకు అధికార పార్టీ ముఖ్యనేత ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. యడవల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో ఓ పోస్టు కోసం స్థానికులు రూ.7.40 లక్షలకు బేరం మాట్లాడుకుని అధికార పార్టీ నేతకు డబ్బు చెల్లించారు. ఆ తర్వాత సదరు నేత మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు డబ్బు వెనక్కి చెల్లించాల్సి వచ్చింది. 

వై.పాలెంలో ఒక్కో పోస్టు 6 నుంచి 8 లక్షలు...
యర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిధిలోని సబ్‌స్టేషన్‌లో పోస్టులను అధికార పార్టీ ముఖ్యనేత పెద్ద ఎత్తున అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టుకు 6 నుంచి 8 లక్షల రూపాయల మేర వసూలు చేశారు. కొన్ని సబ్‌స్టేషన్ల పరిధిలో పోస్టుల కంటే అదనంగా డబ్బు వసూలు చేయడం వివాదంగా మారింది. సదరు ముఖ్యనేత ఇప్పటికే 35 నుంచి 40 మంది వద్ద డబ్బు పుచ్చుకుని ఏకంగా జాబితాను విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకే సమర్పించినట్లు సమాచారం. ఇది అధికారులకు మరింత తలనొప్పిగా పరిణమించింది. కందుకూరు నియోజకవర్గంలోనూ అధికార పార్టీ ముఖ్యనేతలు షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులను అమ్మకానికి పెట్టారు. అయితే ఇక్కడ స్థానికుల నుంచి ఒక్కో పోస్టుకు 2 నుంచి 3 లక్షల రూపాయల్లోపు మాత్రమే వసూలు చేసినట్లు తెలిసింది. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలోనూ స్థానిక అధికార పార్టీ నేతలు షిఫ్ట్‌ ఆపరేటర్, వాచ్‌మెన్‌ పోస్టులను అమ్మకానికి పెట్టారు. ఇక్కడ ఒక్కో పోస్టును 5 నుంచి 8 లక్షల రూపాయల్లోపు అమ్ముకున్నట్లు సమాచారం.

అమ్మకానికి 160 పోస్టులు...
2015–16లో జిల్లావ్యాప్తంగా 40 (33/11 కె.వి) సబ్‌స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మార్కాపురం డివిజన్‌లోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో 9, ఒంగోలు డివిజన్‌లోని సంతనూతలపాడు, కొండపి, ఒంగోలు నియోజకవర్గాల పరిధిలో 6, అద్దంకి డివిజన్‌లోని దర్శి, అద్దంకి పరిధిలో 4, కందుకూరు డివిజన్‌లోని కొండపి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలో 5, కనిగిరి డివిజన్‌లోని కనిగిరి, మార్కాపురం, కందుకూరు నియోజకవర్గాల పరిధిలో 12 చొప్పున సబ్‌స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. చీరాల డివిజన్‌లో కొత్త సబ్‌స్టేషన్లు లేవు. వీటిలో ఇప్పటి వరకు 36 సబ్‌స్టేషన్లు పూర్తి కాగా, మార్కాపురం విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో సత్తుతండ, రామసముద్రం, గంగుపల్లి, కనిగిరి విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో దర్శి, నాగిరెడ్డిపల్లి, అద్దంకి డివిజన్‌ పరిధిలో పుట్టావారిపాలెం సబ్‌స్టేషన్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఒక్కో సబ్‌స్టేషన్‌ పరిధిలో నలుగురు షిఫ్ట్‌ ఆపరేటర్లు, ఒక వాచ్‌మెన్‌ చొప్పున 200 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. స్థలదాతలకు వాచ్‌మెన్‌ లేదా ఒక షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టు ఇచ్చే నిబంధన ఉంది. 40 మందిపోను మిగిలిన 160 పోస్టులను అమ్మకానికి పెట్టేందుకు కొందరు అధికారులు, అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఒక్కో పోస్టును 5 నుంచి 10 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు.

అధికారులకు సైతం వాటాలు...
యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో 8 నుంచి 10 లక్షల రూపాయలకు పోస్టులను అమ్మకానికి పెట్టారు. ఇందులో అధికార పార్టీ నేతలతో పాటు కొందరు అధికారులకు సైతం వాటాలున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొన్ని చోట్ల బేరాలు కుదరకపోవడంతో పోస్టులు భర్తీ కాలేదు. మరికొన్ని చోట్ల ఉన్న పోస్టులకు రెట్టింపు స్థాయిలో డబ్బు వసూలు చేయడంతో గొడవలు చెలరేగాయి. దీంతో తాత్కాలికంగా పోస్టుల భర్తీని నిలిపివేశారు. డబ్బుల వసూళ్ల కార్యక్రమం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంతో పలు సబ్‌స్టేషన్లలో పోస్టుల భర్తీ వ్యవహారం నిలిచిపోయింది. పాత సబ్‌స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని కొత్త సబ్‌స్టేషన్లలో తాత్కాలికంగా నియమించి పని చేయిస్తున్నారు. ఐదు నెలల క్రితమే సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయి విద్యుత్‌ సరఫరాను ప్రారంభించినప్పటికీ షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుల అమ్మకాల నేపథ్యంలోనే పలుచోట్ల పోస్టుల భర్తీ చేయకపోవడం గమనార్హం. దీంతో సబ్‌స్టేషన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సాక్షాత్తూ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top