కిం కర్తవ్యం!

TDP Leaders Looking For Safe party to Join - Sakshi

అధికార పక్షంలోకి వెళ్లాలనే దిశగా ఆలోచనలు

ఓ మాజీమంత్రి, జిల్లా ముఖ్యనేత పక్కచూపులు

బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఎంచుకుంటున్న వైనం

విషయం తెలిసి రగిలిపోతున్న తెలుగుతమ్ముళ్లు

ప్రజల కోసం, ప్రాంతం కోసం ప్రత్యక్ష పోరాటం చేసేవారు నాటి తరం నేతలు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరైతే..అవకాశవాద రాజకీయాలు చేస్తూ అధికారం మాటున అక్రమ సంపాదనే ధ్యేయంగా వ్యవహరించేవారు మరికొందరు. రెండోరకం నేతలు జిల్లాలో తెరపైకి వస్తున్నారు. అధికారం లేకపోతే అర నిమిషం ఆగలేమనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిపోగానే గత్యంతరం లేదంటూ పక్కచూపులు చూస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలో ఉంటే సేఫ్‌ జోన్‌గా ఉంటోందనే మార్గాలను అన్వేషిస్తున్నారు. కౌంటింగ్‌ ముగిసి ముచ్చటగా మూడు రోజులే         అయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు.

సాక్షి ప్రతినిధి కడప: జిల్లాలో టీడీపీ ఘోర పరాజయానికి ప్రభుత్వ పెద్దగా చంద్రబాబుకు ఎంత బాధ్యత ఉందో, జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిలది అంతే బాధ్యత. వీరి ముగ్గురి నిర్ణయాల కారణంగానే జిల్లాలో ఓటమి చెందామని తెలుగుతమ్ముళ్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా ప్రజలు ఆశించినట్లు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా, ప్రభుత్వం ఇచ్చిన హామీల జాబితా పెరిగిపోయింది. ఫలితం ఎన్నికల్లో టీడీపీపై పడింది. జిల్లాలో ఆ ముగ్గురికే సీఎం ప్రాధాన్యత ఇచ్చారని, అభివృద్ధి పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపకపోగా, వ్యక్తిగతంగా లబ్ధిపొందే చర్యలకు పాల్పడ్డారని తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.టీడీపీ గతంలో ఎన్నడూ ఇంతటి ఘోర పరాజయం చెందలేదని వారు వాపోతున్నారు. ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలే బలమని నాయకులు ఏమాత్రం కాదని వివరిస్తున్నారు. కాగా ఐదేళ్ల కాలం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ వ్యవహరిస్తే మరోమారు ప్రజల మనస్సులు చూరగొనే అవకాశం లేకపోలేదు. అయితే జిల్లాలో తద్భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

పక్కచూపులు చూస్తున్న కీలకనేతలు....
 అధికారానికి దూరమై మూడు నిద్రలు మాత్రమే గడిచాయి. అంతలోనే జిల్లా నేతలు కొందరు పక్కచూపులు చూస్తున్నారు. అధికారం లేకుంటే మనుగడ కష్టమనే దిశగా పావులు కదుపుతున్నారు. అధికారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ నాయకులను, ఆ పార్టీ అధినేతను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశాం. చేయకూడని పనులన్నీ చేపట్టాం. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తిరస్కరించారు, ఇక ఇదే పార్టీలో ఉంటే ఐదేళ్లు ఎలా నెట్టుకురావడమనే దిశగా ఓ నాయకుడు మదనపడుతున్నట్లు సమాచారం. అధికారం కోసం ఎలాంటి అనైతిక చర్యలకైనా పాల్పడే ఆ నాయకుడు సేఫ్‌ జోన్‌ వెతుక్కుంటున్నట్లు సమాచారం. దిగజారి కాళ్లబేరానికి వెళ్లినా వైఎస్సార్‌సీపీ తిరస్కరించే అవకాశముందని గ్రహించారు. ఇక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అటు వైపు చేరకుంటే మరో ఐదేళ్లు అధికారంలో ఉండొచ్చు అనే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇలాంటి మార్గంలో జిల్లాకు చెందిన మరో ముఖ్యనేత కూడా అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఆమేరకు బీజేపీ జాతీయ నాయకులతో సంబంధాలు కల్గిన పులివెందుల ప్రాంతానికి చెందిన నాయకుని ద్వారా ప్రాథమిక సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది. ప్రజాప్రతినిధిగా ఉండగా ఉన్న పరిచయాలతో తెలంగాణ బీజేపీ నాయకులతో కూడా సమాలోచనలు చేస్తున్నట్లు సమచారం. వీరితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వారి మార్గాలను ఎతుకుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీలో చేరాలనే దిశగా పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది.

అనైతికతకు పెట్టింది పేరు...
ఒక పార్టీ ద్వారా ప్రజాప్రతినిధిగా ఎంపికై మరో పార్టీలోకి ఫిరాయించి, నిస్సిగ్గుగా అధికారం అనుభవించడం సహజంగా మారింది. స్వతహాగా ఆ లక్షణం పుణికి పుచ్చుకున్న ఓ నాయకుడి చర్యలపై టీడీపీ సీనియర్లు మండిపడుతున్నారు. అధికారం ఉన్నన్నాళ్లు అనుభవించి అంతలోనే పక్కచూపులు చూడడం ఏమిటనీ ఆశ్చర్యచకితులవుతున్నారు. వాస్తవంగా ప్రతిపక్షంలోనే ప్రజానేతగా ఎదిగే అవకాశం అధికంగా ఉంటుంది. నాయకుడు స్థాయి, స్థోమత ప్రజలకు అండగా ఉన్నప్పుడే తెలుస్తోంది. కాగా అధికారం కోసం అడ్డదారిలో ఏగడ్డైయినా కర్చేందుకు జిల్లాకు చెందిన నాయకులు సిద్దపడుతోన్నారు. అనైతికతకు పెట్టింది పేరుగా నిలుస్తుండడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top