ఖానా, పీనా, బజానా కోసం మాత్రమే.. రోజూ రూ.5 కోట్లు!

ఖానా, పీనా, బజానా కోసం రోజూ 5 కోట్లు!

నంద్యాలలో టీడీపీ నేతల విచ్చలవిడి ప్రచారం ఖర్చు

 

ఇప్పటివరకు కోట్లు పోసి ఎమ్మెల్యేలను కొనడం చూశాం.. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులను కొనడం చూశాం.. కార్లు వంటి ఖరీదైన బహుమతులతో ప్రలోభపెట్టడం చూశాం..మందు, బిర్యానీలతో లొంగదీసుకోవడమూ చూశాం.. ఇపుడు నంద్యాలలో తెలుగుదేశంవారు తమ పాత రికార్డులన్నీ తామే అధిగమించారు.ఎదుటివారి ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం వారి మనుషులకు డబ్బు పంచుతున్నారు... వారు చేయాల్సిందేమిటంటే ప్రచారానికి గైర్హాజరు కావడమే.. ఇక ఇక్కడ తమకు ప్రచారం చేసేవారు లేకపోవడంతో పొరుగు నియోజకవర్గాల నుంచి కూలీకి జనాన్ని తరలిస్తున్నారు.. ఇందుకోసం తమ్ముళ్లు రోజుకు రూ. 5 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నారు.. .. ఇదీ కొత్త ట్రెండ్‌.. 

 

నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ప్రశ్నించిన వారిపై దాడులకు యత్నిస్తూ.. పథకాలు ఆపేస్తామంటూ స్థానికులను బెదిరింపులకు గురిచేస్తూ.. గెలుపే లక్ష్యంగా అడ్డదారిలో ముందుకు సాగుతున్న టీడీపీ పెద్దలు నంద్యాలలో ఒక్క ప్రచారం కోసం మాత్రమే రోజుకు రూ.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి దిగుమతి అయిన నల్ల ధనం మూటలను ఇసుక బస్తాల్లా గుమ్మరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటనకు భారీగా జనం వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టింది. నంద్యాల పట్టణంలో తమకూ బలం ఉందని గోబెల్స్‌ తరహా ప్రచారం చేసుకునేందుకు వీలుగా వార్డుల్లో ఆర్భాటంగా పర్యటనలను మొదలు పెట్టింది.ఇందు కోసం ఒక్కో వార్డుకు రోజుకు రూ.5 లక్షల చొప్పున 42 వార్డుల కోసం ఏకంగా రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. స్థానికంగా మనుషులు దొరక్క లారీల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి జనసమీకరణ చేస్తోంది. మూడు రోజులుగా పట్టణంలో భారీగా ప్రచార పర్వానికి తెరలేపింది. జగన్‌ పర్యటనకు వెళ్లవద్దంటూ మరోవైపు గ్రామాల్లో ప్రధానంగా యువత, మహిళ లకు ఆ పార్టీ స్థానిక నేతల ద్వారా రూ.300 చొప్పు న పంపిణీ చేస్తోంది. అయినప్పటికీ జగన్‌ సభలకు జనం పోటెత్తడంతో ఏం చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రుల కార్యక్రమాలకు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏకంగా రూ.30 కోట్ల విలువైన మద్యం బాటిళ్లను నంద్యాల పరిసర ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడి నుంచే రోజువారీ అవసరం మేరకు పట్టణంలోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. 

 

వార్డుల్లో హంగామా..

ఓటమి భయంతో టీడీపీ నేతలు మూడు రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డు సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రచారం సాగిస్తు న్నారు. కర్నూలు, పాణ్యం, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మంది చొప్పున వివిధ వాహనాల ద్వారా నంద్యాలకు తీసుకొస్తున్నా రు. మొత్తం మీద రోజుకు సుమారు 5 వేల మందిని ప్రచారానికి వినియోగించుకుంటు న్నారు. వారిచేతి కి జెండాలు ఇచ్చి వార్డుల్లో తిప్పుతున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం స్నాక్స్‌ ఇచ్చి వారి చేత రెండు విడతలుగా ప్రచారం చేయిస్తున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వర కు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రచా రం చేయిస్తున్నారు. మహిళలకు రూ.400, పురుషు లకైతే రూ.500లు చెల్లిస్తున్నారు. పురుషుల కు అదనంగా 2 క్వార్టర్‌ బాటిళ్లు (మద్యం) ఇస్తున్నట్లు ప్రచారానికి వెళ్తున్నవారు తెలిపారు. ఇలా అన్ని కార్యక్రమాలకు కలిపి ఒక్కో వార్డుకు రూ.5 లక్షలకు పైనే ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

 

గ్రామాలపై ప్రత్యేక దృష్టి

నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల పరిధిలో సుమారు 30 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ఓటర్ల కోసం మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తూనే ఓటర్లను ప్రలోభ పెట్టేందు కు నగదు, బహుమతులు ఇస్తున్నారు. ప్రతి గ్రామం లో స్థానిక టీడీపీ నేత ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.దీనికి రోజుకు రూ.2.70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని రెండు మండలాల్లోని కీలక నేతలకు అప్పజెప్పుతున్నారు.     

 

గృహోపకరణాలు, నగదు ఎర

టీడీపీ నేతలు మరో వైపు ఓటర్లకు గృహోప కరణాలు ఎర వేస్తున్నారు. వస్తువుల కోసం అంటూ పది పదిహేను ఓట్లున్న వారికి ప్రత్యేకంగా నగదు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని 19, 20, 32, 35, 36వ వార్డుల్లో 20, 25 ఓట్లు ఉన్న 27 కుటుంబాల వారికి శుక్రవారం రూ.లక్ష చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. 

 

పోలీసులపై ఒత్తిళ్లు..

టీడీపీ నేతలు వివిధ ప్రాంతాల నుంచి నల్లధనా న్ని నంద్యాలకు చేరవేస్తున్నట్లు నిఘా అధికారి ఒకరు వెల్లడించారు. మద్యం బాటిళ్లను కూడా భారీ పరిమాణంలో నిల్వ చేసినట్లు వివరించారు. ప్రతి రోజూ ఓ వాహనంలో నగదు వస్తోందని, ఆ నగదును నంద్యాల పరిసర ప్రాంతాల్లోని పాత భవనాల్లో దాచారని చెప్పారు. అయితే ఆ నగదు, మద్యం బాటిళ్లు ఎక్కడ ఉన్నాయో తెలిసినా వాటిని స్వాధీనం చేసుకోవద్దని పోలీసులపై  పైస్థాయి నుంచి ఒత్తిడి ఉందన్నారు.  
Back to Top