టీడీపీలో ఢిష్యుం..ఢిష్యుం

TDP Leaders Fight At Ongole - Sakshi

ఉప్పుగుండూరులో స్ట్రీట్‌ వార్‌కు దిగిన టీడీపీ వర్గీయులు

ఒకరి తలకు తీవ్ర గాయాలు

ప్రకాశం  : మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో అధికార తెలుగు దేశం పార్టీలో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు గ్రంథాలయం సెంటర్‌లో బాహాబాహీకి దిగారు. అధికార పార్టీ నాయకుడు సింగు రాజా నరసింహరావు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈక్రమంలో అంకమ్మ తల్లి దేవస్థానం పరిసరాల్లో రోడ్డు నిర్మాణం చేస్తున్న చోట కంటైనర్‌లో గురువారం రాత్రి కొన్ని వస్తువులు అపహరణకు గురయ్యాయని.. దీనికి నల్లూరి రాజశేఖర్‌ భాధ్యత అంటూ శుక్రవారం పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

దీంతో గ్రంథాలయం సెంటర్‌ వద్ద తనపై తప్పుడు కేసు ఎందుకు పెట్టించావని ప్రశ్నిస్తూ సింగు రాజా నరసింహరావుపై నల్లూరి రాజశేఖర్‌ దాడి చేశాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. అది తెలుసుకున్న సింగ్‌ రాజా బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని నల్లూరి రాజశేఖర్‌పై దాడి చేయగా రాజశేఖర్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అధిక తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి క్షతగాత్రుడు రాజశేఖర్‌ను 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. 

ఈ ఘర్షణలో సింగు రాజా నరసింహరావుకు కూడా గాయాలు కావడంతో ఒంగోలు రిమ్స్‌లో చేర్చారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరస్థితులను అదుపు చేయడానికి ఇన్‌చార్జి సీఐ దేవ ప్రభాకర్, మద్దిపాడు ఎస్సై సురేష్‌ తన సిబ్బందితో గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వారిపై పలు సెక్షన్ల కింద  కేసు నమోదు చేసినట్లు నాగులుప్పలపాడు పోలీసులు తెలిపారు.

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top