బాహాబాహీ

TDP Leaders Conflicts in West Godavari - Sakshi

వైస్‌ చైర్మన్‌ వెర్సస్‌ వైస్‌ ఎంపీపీ

కొవ్వూరులో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

విలేకరుల ఎదుటే టీడీపీ నాయకుల తిట్ల పురాణం

పార్టీ కార్యాలయం వేదికగా ఘటన

పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్‌: కొవ్వూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. దీనికి మంగళవారం మధ్యాహ్నం కొవ్వూరులోని టీడీపీ కార్యాలయం వేదికగా నిలిచింది. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దుద్దుపూడి రాజా రమేష్, వైస్‌ ఎంపీపీ మద్దిపాటి సత్యనారాయణపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ గొడవతో అక్కడఉన్న పార్టీ ముఖ్య నాయకులు అయోమయానికి గురయ్యారు. విలేకరుల ఎదుటే నాయకులు బాహాబాహీకి దిగడంతో గొడవను రాయవద్దంటూ రాయబారాలు నడిపారు.

వివరాల్లోకి వెళ్తే, పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ జొన్నలగడ్డ రాధారాణి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల మంత్రి జవహర్‌కు వ్యతిరేక వర్గంగా పేరుపొందిన కొందరు పార్టీ ముఖ్య నాయకులు నిర్వహించిన వన సమారాధనపై స్పందిస్తూ పార్టీ అంతా ఒకే తాటిపై ఉందన్న సంకేతాన్ని ఇస్తూ సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం రాజా రమేష్, సత్యనారాయణలుఒక పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. అనంతరం ఒక్కసారిగా రాజా రమేష్‌ అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతున్నావ్‌ అంటూ రాయకూడని పదజాలం పలుకుతూ చంపేస్తానంటూ సత్యనారాయణ పైకి దూసుకు వచ్చారు. ఈ క్రమంలో సత్యనారాయణ అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది.

అక్కడే ఉన్న ఆత్మ చైర్మన్‌ పొట్రు సిద్ధు, ఏఎంసీ చైర్మన్‌ వేగి చిన్న వారిని వారించి విడదీయడానికి ప్రయత్నిస్తోన్న సమయంలో రాజా రమేష్‌ సత్యనారాయణ చెంపపై కొట్టడంతో అంతా అవాక్కయ్యారు. దీంతో నన్ను సమావేశానికి కొట్టి చంపడానికి పిలిపించావా? అంటూ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ వేగి చిన్నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను ఏ విధంగా చంపుతావో చంపు అంటూ సత్యనారాయణ కేకలు వేశారు. దీనికి సమాధానంగా నీ అపార్ట్‌మెంట్‌ ముందే ఉంటా రా.. నీ అంతు చూస్తా.. అంటూ రాజా రమేష్‌ అక్కడి నుంచి నిష్క్రమించడంతో నాయకులు సత్యనారాయణను సముదాయించే పనిలో పడ్డారు. ముఖ్య నాయకుల ముందే తనపై దాడి జరగడంతో వైస్‌ ఎంపీపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయిన పార్టీ ఈ పరిణామంతో ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లోకేష్‌ పర్యటనపై ప్రెస్‌మీట్‌ అని పిలిచారు : టీడీపీ పట్టణ అధ్యక్షుడు చక్రధరరావు
పార్టీ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీన నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన ఏర్పాట్లపై ప్రెస్‌మీట్‌ ఉందని తనను పిలిచారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు అనుపిండి చక్రధరరావు తెలిపారు. తీరా ఇక్కడకు వచ్చిన తరువాత మంత్రి జవహర్‌కు అనుకూలంగా వ్యతిరేక వర్గీయులు ఏర్పాటు చేసిన అన్న సమారాధనపైకి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు దాడి చేయడం సమంజసం కాదని, ఇది తనను బాధించిందని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top