కేఈ Vs తుగ్గలి

TDP Leaders Conflicts In Kurnool - Sakshi

కార్పొరేషన్‌ రుణ లబ్ధిదారుల ఎంపికలో విభేదాలు

అనుచరులను ఎంపిక చేయలేదని తుగ్గలి నాగేంద్ర మండిపాటు

జూనియర్‌ అసిస్టెంట్‌పై చేయిచేసుకున్న అనుచరులు?

అంతకుముందు రైల్వే కాంట్రాక్టు విషయంలోనూ అదే తీరు  

దాడులతో ఉద్యోగుల్లో భయాందోళన

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక వ్యవహారంలో అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు రేగుతున్నాయి. తాజాగా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో వివిధ కార్పొరేషన్‌ రుణాలకు లబ్ధిదారుల ఎంపికలో తన అనుచరులను ఎందుకు చేర్చలేదంటూ అధికార పార్టీ నేత తుగ్గలి నాగేంద్ర ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. ఆయన అనుచరులు ఏకంగా జూనియర్‌ అసిస్టెంట్‌ హరిచరణ్‌పై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. కేఈ వర్గానికి చెందిన వారిని మాత్రమే వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని తుగ్గలి నాగేంద్ర అనుచరులు మండిపడుతున్నారు. అయితే, ఎంపీడీవో చెప్పిన మేరకే తాను అర్హులైన వారి వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నానని జూనియర్‌ అసిస్టెంట్‌ చెబుతున్నారు. నేతల మధ్యవిభేదాలతో తమపై ప్రతాపం చూపడం ఏమిటని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. తమను లక్ష్యం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఈ, తుగ్గలి మధ్య విభేదాలు గతంలో రైల్వే కాంట్రాక్టు పనుల విషయంలోనూ ఇదే తీరుగా తలెత్తినట్లు తెలుస్తోంది. రైల్వే కాంట్రాక్టుల విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పినప్పటికీ నాగేంద్ర టెండర్‌ వేసి మరీ పనులను దక్కించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా నాగేంద్ర నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమానికి కూడా కేఈ వర్గం నుంచి ఎవ్వరూ హాజరుకాలేదు. మొత్తమ్మీద అధికారపార్టీ నేతల మధ్య వివిధ అంశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న విభేదాలు కాస్తా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.  

ఒక్కొక్కటిగా...  జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గంలో ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఆదరణ లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ఎస్వీ ఒక క్యాంపు నిర్వహించగా..  టీజీ వెంకటేష్‌ తనయుడు భరత్‌ మరో క్యాంపు ఏర్పాటు చేశారు. కర్నూలు డీఎస్పీతో పాటు సీఐల పోస్టింగ్‌ విషయంలోనూ వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇక పాణ్యం నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌ ఏరాసు ప్రతాపరెడ్డిపై మొదటి నుంచీ పార్టీలో కొనసాగిన నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తమను ఏరాసు పట్టించుకోవడం లేదంటూ నేరుగా లోకేష్‌తో పాటు చంద్రబాబును కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వ్యవహారశైలిపై జెడ్పీ వైస్‌–చైర్మన్‌తో పాటు మునిసిపల్‌ కౌన్సిలర్లలోని మరో వర్గం వారు మండిపడుతున్నారు. ఆళ్లగడ్డలో మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నంద్యాలలో ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్, ఎంపీ ఎస్పీవైరెడ్డి వర్గాల మధ్య లోలోపల కుమ్ములాటలు సాగుతున్నాయి. మంత్రాలయంలో ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డితో మరో వర్గం విభేదిస్తోంది. కోడుమూరులో ఎమ్మెల్యే మణిగాంధీ, ఇన్‌చార్జ్‌ విష్ణువర్దన్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. మణిగాంధీ వర్గానికి చెందిన వారికి కనీసం పార్టీ సభ్యత్వం ఇప్పటివరకు దక్కనీయకుండా చేయడంలో విష్ణువర్దన్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. ఈ నియోజకవర్గంలోని ఓ ఎంపీడీవో ఏకంగా తాను ఎమ్మెల్యే సమావేశానికి హాజరుకాబోనని  ప్రకటించారు. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ విభేదాలు నెలకొన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top