పెచ్చుమీరుతున్న టీడీపీ శ్రేణులు

TDP Leaders Burnt YSRCP Leader Bike in Krishna Paritala - Sakshi

పరిటాలలో వైఎస్సార్‌ సీపీ నాయకుడి బైక్‌ను తగులబెట్టిన టీడీపీ గూండాలు

అవసరమైతే చంపుతామని ఎన్నికల ముందు తెలుగు తమ్ముళ్లు చాలెంజ్‌ చేశారని ఆరోపిస్తున్న బాధితుడు

పోలీస్‌ స్టేషన్‌లో ఏడుగురిపై ఫిర్యాదు

కృష్ణాజిల్లా, కంచికచర్ల (నందిగామ) : 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నాటినుంచి గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ఒక పక్క ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేస్తూ.. మరో పక్క వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు తెలుగు తమ్ముళ్లు పాల్పడుతూ, రెచ్చగొడుతూ మంత్రి, ఎమ్మెల్యే అండతో పోలీసులను లోబర్చుకుని కేసులు పెడుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోందని గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఉన్న బైక్‌ను టీడీపీ కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే బైక్‌ పూర్తిగా కాలిపోయింది. వెంకటేశ్వరరావు తన మనుమరాలిని తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష రాయించేందుకు కారులో విజయవాడ తీసుకెళ్లాడు. తాను ఇంటివద్ద లేని సమయంలో బైక్‌ను కావాలని తగులబెట్టారని బాధితుడు ఆరోపించారు. విషయం తెలుసుకున్న నందిగామ డీఎస్పీ ఏ సుభాస్‌ చంద్రబోస్, సర్కిల్‌ సీఐ కే సతీష్, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు ఎస్‌ఐలు ఏ మణికుమార్, సుబ్రహ్మణ్యం, కే లక్ష్మణ్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్‌ టీం వచ్చి పూర్తిగా పరిశీలించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఎన్నికల నాటి నుంచిబెదిరిస్తున్నారు..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తనను చంపుతామని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని బాధితుడు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీ అంతు చూస్తామని.’భయపెడుతున్నారని ఆరోపించారు. ఇంటి వద్ద లేని సమయంతో తన బైక్‌పై పెట్రోలు పోసి నిప్పంటించి కాల్చివేశారని, అదే తాను ఇంట్లో ఉండి ఉంటే తనను కూడా హత్య చేసి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

మొండితోక పరామర్శ..
వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వరరావు బైక్‌ను దగ్ధం చేశారని తెలుసుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండలస్థాయి నాయకులు బండి జానకిరామయ్య, చింతా రవీంద్రనాథ్, మార్త శ్రీనివాసరావు, మాగంటి వెంకటరామారావు, మాగంటి వినయభూషణరావు, కాలవ వెంకటేశ్వరరావు, వేమా సురేష్‌బాబు, యద్దనపూడి విజయారావు, గుదే అక్కారావు, రాయల నరసింహారావు, అబ్బూరి మల్లేశ్వరరావు, కట్టా నరసింహారావు, సిద్ధాంతరెడ్డి, జిక్కుల నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top