వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతల దాడి

TDP leaders attack on YSRCP communities - Sakshi

ఆరుగురికి గాయాలు.. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స

యడ్లపాడు (చిలకలూరిపేట): ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పనిచేశారనే కక్షతో ఆ పార్టీ సానుభూతిపరులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం కారుచోలలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కంచర్ల సురేష్‌ కుటుంబం, వారి బంధుగణం వైఎస్సార్‌సీపీ విజయం కోసం కృషి చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు వారిపై కక్ష పెంచుకున్నారు. గతంలో ఫ్లెక్సీల విషయంలోనూ ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకున్నారు.

ఈ నెలాఖరున రజక సంఘీయుల ఆధ్వర్యంలో గ్రామ దేవత మహాలక్ష్మమ్మ కొలుపులను నిర్వహించుకునేందుకు నిర్ణయం జరిగింది. ఇందు కోసం కంచర్ల కుటుంబీకులను టీడీపీ వర్గీయులు చందాలు అడిగారు. కొన్ని కారణాల వల్ల చందా ఇచ్చేందుకు వారు నిరాకరించారు. దీన్ని సాకుగా తీసుకుని శనివారం రాత్రి 8 గంటల సమయంలో కంచర్ల సురేష్‌ బావమరిది చెన్నుపల్లి శ్రీనివాస్‌తో టీడీపీ నేతలు హేళనగా మాట్లాడి గొడవకు దిగారు. ఇది తెలిసి సురేష్‌ కుటుంబీకులు, బంధువులు అక్కడికి రావడంతో ఘర్షణకు దారితీసింది.

ఈ గొడవలో సురేష్‌ కాలివేలు, ముఖం, మణికట్టుపై తీవ్రంగా గాయాలయ్యాయి. తండ్రి వెంకటేశ్వర్లు, అన్న కంచర్ల సుబ్బారావు, అక్క నగరాజ, బావమరిది శ్రీనివాస్, నర్సమ్మలకు బలమైన దెబ్బలు తగిలాయి. వారిని గ్రామస్తులు చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. తమపై దాడి చేసిన టీడీపీ వర్గీయులు ఉన్నవ వెంకటప్పయ్య, భార్య వెంకాయమ్మ, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు తదితరులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జె.శ్రీనివాస్‌ గ్రామానికి చేరుకుని మరలా గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top