టీటీడీ తరహాలో శ్రీశైలం అభివృద్ధి

TDP Leaders Absent Chandrababu Naidu Meeting In Kurnnol - Sakshi

ఈ నెలలోనే పులికనుమ, గోరుకల్లు పూర్తి

వేదవతి, రాజోలిబండకు త్వరలో టెండర్లు

కర్నూలు నుంచి కుప్పం వరకు నీటిని తీసుకెళ్తాం

సున్నిపెంట  సభలో సీఎం చంద్రబాబు  

‘పులకుర్తి’ జాతికి అంకితం

శ్రీశైలం ప్రాజెక్టుకు జలహారతి

మల్లన్న దర్శనం, జలహారతి కార్యక్రమాలకు మీడియాకు నో ఎంట్రీ

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : శ్రీశైలం–సున్నిపెంట అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శ్రీశైలంలో గంట, రుద్రాక్ష, గణేష్, విభూతి, పాలధార–పంచధార మఠాల పనులను వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.  శుక్రవారం ఆయన శ్రీశైలం ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చారు. అంతకుముందు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలోనే పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ శ్రీశైలం– సున్నిపెంటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి.తిరుమల తరువాత అధిక ఆదాయం ఇక్కడి నుంచే వచ్చేలా చేస్తామన్నారు. శ్రీశైలం–సున్నిపెంట టౌన్‌షిప్‌ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది అవుటర్‌ రింగ్‌ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. తాగునీటి సమస్య తీరుస్తామని, రెండేళ్లలో భూగర్భ డ్రైనేజీని నిర్మిస్తామని, సున్నిపెంట పీహెచ్‌సీకి వైద్యులను నియమించి మోడల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

వర్షాల కోసం యజ్ఞాలు చేయండి
రాయలసీమలో 54 శాతం లోటు వర్షపాతం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలకోసం ప్రజలంతా యజ్ఞాలు, యాగాలు, హారతులు ఇవ్వాలన్నారు. తానొక్కడినే హారతులు ఇస్తే దేవుడు కరుణిస్తే కరుణించవచ్చని, లేదంటే లేదని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని నదులు, చెరువులు, కుంటల దగ్గర హారతులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది వర్షాలు సరిగా రాకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో వచ్చిన వరద నీటిని ముందుచూపుతో జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిలో నింపామన్నారు. ఫలితంగా శ్రీశైలం, వెలుగోడు, సుంకేసుల, ముచ్చుమర్రి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ, కేసీల కింద పంటలు సాగవుతున్నాయన్నారు. కర్నూలు నుంచి అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటిని విడుదల చేస్తామన్నారు. కర్నూలు నుంచి కుప్పం వరకు నీటిని తీసుకెళ్లే వరకు తాను విశ్రమించబోనన్నారు. ఈ నెలలోనే పులికనుమ, గోరుకల్లు రిజర్వాయర్లు పూర్తవుతాయన్నారు. వేదవతి, ఆర్‌డీఎస్‌ కుడికాలువకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్‌ను అంతర్‌ రాష్ట్ర సమస్య కారణంగా పరిష్కరించలేకపోతున్నామన్నారు. 

సగం మంది డుమ్మా
సీఎం జలహారతి కార్యక్రమానికి సగంమంది టీడీపీ ప్రజాప్రతినిధులు , ఇన్‌చార్జ్‌లు డుమ్మా కొట్టారు. ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరెడ్డి, భూమా బ్రహ్మానందారెడ్డి, ఇన్‌చార్జ్‌లు కేఈ ప్రతాప్, మాండ్ర శివానందరెడ్డి గైర్హాజరయ్యారు.  కాగా..సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయ దర్శనం, జలహారతి కార్యక్రమాలకు విలేకరులను అనుమతించలేదు. ఈ రెండు కార్యక్రమాలకు అనుమతించ కూడదని ముందుగానే నిర్ణయించినా.. విలేకరులను తీసుకెళ్లి మళ్లీ మధ్యలో దింపి కాన్వాయ్‌ను ముందుకు పోనిచ్చారు. అంటే ఓ పథకం ప్రకారం నెగిటివ్‌ అంశాలను ఫోకస్‌ చేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు విన్పించాయి. బహిరంగ సభలో జనం పలుచగా ఉండడంతో శ్రీశైలం పరిధిలోని విద్యాసంస్థల నుంచి విద్యార్థులను రప్పించారు. విద్యాసంస్థలకు సెలవు ఇప్పించి మరీ వారిని తీసుకొచ్చినట్లు సమాచారం. కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమా, అఖిలప్రియ, ఎంపీ ఎస్‌పీవై రెడ్డి, మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యే మణిగాంధీ, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, గొర్రెలు,మేకల రాష్ట్ర ఫెడరేషన్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరయాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్‌లు వీరభద్రగౌడ్, తిక్కారెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు వరప్రసాదరావు, నారాయణరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top