పీలేరు దేశంలో గండి

TDP Leader Iqbal Ahmed Join In YSRCP Tirupati - Sakshi

టీడీపీని వీడుతున్న ముఖ్యనేతలు

కిషోర్‌ నాయకత్వంపై పెరుగుతున్న అసమ్మతి

ఆ పార్టీ మాజీ ఇన్‌చార్జ్‌ ఇక్బాల్‌ అహ్మద్‌తో సహా ముఖ్యనేతలు

జగన్‌ సమక్షాన వైఎస్సార్‌సీపీలో చేరిక

వరుస రాజీనామాలతో టీడీపీ డీలా

జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువు పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలకనేత ఇక్బాల్‌ అహ్మద్‌ టీడీపీని వీడారు. శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిపోయారు. ఈ పరిణామం కోలుకోలేని నష్టమని పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. ఇటీవల వరుసగా అధికార పక్షానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఇక్బాల్‌ నిష్క్రమణతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాక పార్టీలోని నేతలు ఒకరి వెనుక ఒకరు వరుసగా పార్టీకి దూరమవుతున్నారు.

సాక్షి, తిరుపతి/పీలేరు :   కలకడ, పీలేరు పట్టణం, కలికిరి మండలంలోని మహల్‌ ప్రాంతంలో పట్టున్న ఇక్బాల్‌ అహ్మద్‌ టీడీపీని వీడటం ఆ పార్టీకి తీరని నష్టమే. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఈయనకు ముఖ్యమైన నేతలు సహకరించలేదు. ముస్లిం అభ్యర్థి కావడమే ఇందుకు కారణం. 2004, 09 ఎన్నికల్లో ఇంతియాజ్‌ అహ్మద్‌కు టీడీపీ టికెట్‌ ఇచ్చినా కేడర్‌ సంపూర్ణంగా పనిచేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యారు.  ఇక్బాల్‌ విషయంలోనూ ఇదే పునరావృతమైంది. వైద్య వృత్తిలో ఉన్న ఇక్బాల్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు చివరి క్షణంలో పిలిచి టికెట్‌ఇచ్చారు. అది కూడా ముస్లింలకు ఎక్కడో చోట ప్రాతిని«థ్యం కల్పించాల్సిన పరిస్థితి ఉండటం వల్లే అవకాశం వచ్చింది.  ఓడిపోతే  సముచిత స్థానం కల్పిస్తామని అప్పట్లోనే చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లు గడిచినా ఏ పదవీ ఇవ్వలేదు. పైగా ఇన్‌చార్జ్‌గా తొలగించి వలస వచ్చిన కిషోర్‌కుమార్‌రెడ్డి పార్టీ బాధ్యతలను కట్టబెట్టారు.

ఇక్బాల్‌తో పాటు ఆయన వర్గం దీనిని జీర్ణించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో పీలేరు పట్టణంలో 24 పోలింగ్‌ కేంద్రాల్లో 14 కేంద్రాల్లో అప్పటి సమైక్యాంధ్ర అభ్యర్థి కిషోర్‌కుమార్‌రెడ్డికి మూడో స్థానం ఓట్లు లభించగా ఇక్బాల్‌ ద్వితీయ స్థానం ఓట్లు లభించాయి. నియోజకవర్గంలో ఇక్బాల్‌కు 34వేల ఓట్లు దక్కగా పార్టీ కార్యకర్తలు, ముస్లిం సామాజిక వర్గం మాత్రమే ఆదరించినట్లు తెలుస్తోంది.  

కిషోర్‌పై పెరుగుతున్న అసమ్మతి
పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా కిషోర్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసమ్మతి రాజుకుంది. సీనియర్లను దూరంగా ఉంచి అవమానాల పాలు చేస్తున్నారు. నిన్నటి దాకా కాంగ్రెస్‌తో ఉండి టీడీపీ శ్రేణులు, నాయకులను వేధిం పులకు గురిచేసిన వ్యక్తి నాయకత్వంలో పని చేసేందుకు సీనియర్లు సిద్ధమైనా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. చివరకు పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితి తెచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీలోని అసమ్మతి, విభేదాలను వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మార్చే విషయంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.  వైఎస్సార్‌సీపీలోకి వస్తే ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుందని భరోసా ఇవ్వగలిగారు. నేరుగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలోనే పార్టీలో చేరేలా చర్యలు తీసుకోవటం వారిలో నమ్మకాన్ని పెంచింది. వైఎస్సార్‌సీపీలోకి చేరికతో పార్టీ నూతనోత్సహంతో ఉంది. ఇప్పటికే పలు సామాజిక వర్గాలు పార్టీకి అండగా నిలుస్తుండగా కీలక ముస్లిం సామాజిక వర్గం మద్దతుతో మరింత బలం చేకూరింది.

వైఎస్సార్‌సీపీలో టీడీపీ నేతలు..
పీలేరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి, ప్రముఖ మైనారిటీ నాయకులు డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌తో పాటు జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు ఫయాజ్‌ అహ్మద్‌ఖాన్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కారపాకల భాస్కర్‌నాయుడు, కేవీపల్లె మండల పార్టీ కన్వీనర్‌ శ్రీనివాసులు, మహల్‌ ఎంపీటీసీ సభ్యుడు రిజ్వాన్, మారేళ్ల మాజీ సర్పంచ్‌ వెంకటరమణ, జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు రియాజ్‌తో పాటు నాయకులు గయాజ్‌ అహ్మద్, జిలానీ, అమీర్, గడ్డం ఏసురాజు, రామచంద్ర తదితరులు శుక్రవారం శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top