అధికారమే పరమావధిగా..అడ్డదారులు..! 

TDP Illigal activities for power - Sakshi

తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నం 

సాధికార సర్వే ద్వారా నంబర్ల సేకరణ 

వాటిని తమ పార్టీ వాట్సప్‌ గ్రూపుల్లో చేరుస్తున్న ‘పచ్చ’ నేతలు 

తమ ప్రమేయం లేకుండా నంబర్‌ యాడ్‌ చేయడంపై ప్రజల ఆగ్రహం 

కాల్‌ చేస్తే కనెక్టవ్వని గ్రూప్‌ అడ్మిన్ల నంబర్లు 

ప్రతిపక్షంపై వ్యతిరేక ప్రచారం ప్రారంభం 

మంగళగిరిలో వెలుగు చూసిన టీడీపీ బండారం

సాక్షి, అమరావతి బ్యూరో : ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో తెలుగుదేశం అడ్డదారులు తొక్కుతోంది. తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనైతిక చర్యలకు పాల్పడుతోంది. పది రోజుల కిందట వెలుగు చూసిన డేటా స్కాం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. సాధికార సర్వే ద్వారా ప్రజల డేటా దొంగిలించిన టీడీపీ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్‌ నంబర్లను వాట్సాప్‌ గ్రూపుల్లో చేర్చి.. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీపై విష ప్రచారం మొదలు పెడుతోంది.  

నారా లోకేష్‌కు సీటు కేటాయించిన తర్వాత బండారం బట్టబయలు 
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్‌ను ప్రకటించిన వెంటనే ఆ పార్టీ ఐటీ వింగ్‌ రంగంలోకి దిగింది. నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల వివరాలు సేకరించి వారి నంబర్లను ‘ఉమెన్‌ ఆఫ్‌ మంగళగిరి’, ‘మెన్‌ ఆఫ్‌ మంగళగిరి’ పేరుతో పదుల సంఖ్యలో వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేశారు. వీటిలో ప్రతిపక్షానికి వ్యతిరేకంగా, వైఎస్సార్‌ సీపీపై విద్వేషాలు రగిల్చేలా పోస్టులు పెట్టడం ప్రారంభించారు. తమ అనుమతి లేకుండా గ్రూపుల్లో చేర్చడాన్ని ఆగ్రహించిన ఓటర్లు.. ప్రశ్నించిన వెంటనే గ్రూప్‌ నుంచి నంబర్‌ను తొలగిస్తున్నారు.  

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే..  
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యహరించినా అది నేరం కిందనే పరిగణిస్తారు. ఈ దఫా ఎన్నికల్లో సోషల్‌ మీడియాపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తన సోషల్‌ మీడియా అకౌంట్లను వెల్లడించాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం లోకేష్‌ను ఎలాగైనా గెలుపించుకోవాలన్న అత్యాశతో టీడీపీ ఐటీ వింగ్‌ అడ్డదారుల్లో పయనిస్తోంది. 

నాకు తెలియకుండానే యాడ్‌ చేశారు 
నా నంబర్‌ వాళ్లకి ఎలా తెలిసిందో తెలియదు. రెండు రోజుల కిందట వాట్సాప్‌లో మంగళగిరి ఉమెన్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు. అదే గ్రూపుల్లో పురుషులనూ యాడ్‌ చేస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షంపై విషం చిమ్మేలా పోస్టులు పెడుతున్నారు. సాధికార సర్వే సమయంలో మా నంబర్‌ తీసుకున్నట్లున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి నీచపు ఎత్తుగడలు వేయడం సిగ్గు చేటు. 
–దొంతిరెడ్డి, విష్ణుకుమారి, తాడేపల్లి, మంగళగిరి 

డేటా స్కాం వల్లే ఇదంతా..  
ఐటీ గ్రిడ్స్‌లో వెలుగుచూసిన డేటా స్కాంలో భాగంగానే మా నంబర్లు టీడీపీ నాయకులకు చేరాయి. అసలు మాకు తెలియకుండానే మా నంబర్లు వాళ్ల దగ్గరికి ఎలా వెళ్లాయో అర్థం కావడం లేదు. నన్ను గ్రూపులో యాడ్‌ చేసిన అడ్మిన్‌కి ఫోన్‌ చేస్తే కాల్‌ కనెక్ట్‌ కావడం లేదు. మంగళగిరి సీట్‌ లోకేష్‌కు కేటాయించిన రోజే వందల సంఖ్యలో గ్రూప్స్‌ని క్రియేట్‌ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలి. 
–టి. మహేశ్‌ రెడ్డి, తాడేపల్లి, మంగళగిరి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top