పైసా వసూల్‌

TDP Govt Corruption in Welfare schemes - Sakshi

‘అధికార’ నాయకుల చేయి తడపందే పేదలకు అందని సంక్షేమ పథకాలు

‘చంద్రన్న పెళ్లి’ కానుక నుంచి ‘ఆదరణ’ వరకు అంతా అవినీతే 

ఇళ్లు మంజూరు చేయాలన్నా..బిల్లులు చెల్లించాలన్నా లంచం ముట్టజెప్పాల్సిందే

సీఎం ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్‌ చికిత్సలోనూ తాండవిస్తున్న అక్రమాలు

వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఉత్తుత్తే.. మరోవైపు హాస్టళ్లలో నాణ్యత లేని భోజనం

అందని స్కాలర్‌షిప్‌లు.. ఫీజుల కోసం యాజమాన్యాల వేధింపులు

రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో వెల్లడైన వాస్తవాలు

ఈ చిత్రంలో మహిళ పేరు సరోజమ్మ.
ఈమెది అనంతపురం జిల్లా నంజాపురం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మూడేళ్ల కిందట పక్కా ఇంటి కోసం అధికారుల దగ్గరకు వెళ్లింది. వాళ్లేమో జన్మభూమి కమిటీ సభ్యుల వద్దకు పంపించారు. మూడేళ్లుగా వారి చుట్టూ తిరుగుతూ ఉంది. చివరకు రూ.10 వేలిస్తే గానీ ఇల్లు మంజూరు చేయబోమని జన్మభూమి కమిటీ సభ్యులు కరాఖండిగా చెప్పడంతో ఆమె కన్నీటితో వెనుతిరిగింది. అంత డబ్బిచ్చే స్థోమత లేక ఇంటి కోసం తిరగడం మానుకున్నా అని వాపోయింది. ఈ గవర్నమెంట్‌లో మాలాంటోళ్లకు ఏ పథకమూ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. ఇదే విషయం సాక్షాత్తూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో సైతం వెల్లడవ్వడం గమనార్హం.

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: ‘గేదె చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా..’ అన్న చందంగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. ఓవైపు ప్రభుత్వ పెద్దలు భూ కేటాయింపులు, ప్రాజెక్టుల టెండర్లు తదితరాల్లో భారీగా దోచేస్తుంటే.. మరోవైపు అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం తామేమైనా తక్కువ తిన్నామన్నట్లుగా అందినకాడికి అవినీతికి పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. పేదలనే కనికరం కూడా లేకుండా ఏ పథకం మంజూరు చేయాలన్నా లంచాలు అడుగుతున్నట్లు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలోనే బయటపడింది. టీడీపీ నాయకుల చేయి తడపందే ఏ పథకం కూడా అందట్లేదని ప్రజలు వాపోతున్నట్లు వెల్లడైంది. చంద్రన్న పెళ్లి కానుక నుంచి ఆదరణ పథకం వరకూ అంతటా అవినీతి తాండవిస్తోందని తేలింది. ఇళ్లు మంజూరు చేయాలన్నా.. వాటికి బిల్లులు చెల్లించాలన్నా లంచమివ్వందే పని జరగట్లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇక వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్న మాటలైతే.. నీటి మూటలే అని ఏకంగా ప్రభుత్వ సర్వేలోనే తేలడం గమనార్హం.  

టీడీపీ నేతలకు ‘కానుక’ ఇవ్వాల్సిందే!
చంద్రన్న పెళ్లి కానుక మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఇళ్లకు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చే కళ్యాణమిత్రలు భారీగా లంచాలు డిమాండ్‌ చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. లంచమిస్తేనే పెళ్లి కానుక మంజూరు చేస్తామని కళ్యాణమిత్రలు బెదిరిస్తున్నట్లు లబ్ధిదారులు వాపోయారు. ఏకంగా 72 శాతం మందికి పైగా కళ్యాణమిత్రలు లంచాలు అడుగుతున్నట్లు వెల్లడైంది. ఇక వివాహ వేదిక వద్దకు వచ్చే పరిశీలకులతో పాటు స్థానిక అధికార ప్రజా ప్రతినిధులు 14 శాతం మంది లంచాలు తీసుకుం టున్నట్లు లబ్ధిదారులు వాపోయారు. వారి చేతిలో ‘కానుక’ పడందే.. తమకు పెళ్లి కానుక అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు లంచాలు సమర్పించుకున్నా.. పెళ్లి కానుక మంజూరయ్యే సరికి చాలా సమయం పడుతోందని సర్వేలో తేలింది.

ఉచిత విద్యుత్తా.. అదెక్కడ!
వంద యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే పేదల ఇళ్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని ఏకంగా 60 శాతం మంది తేల్చిచెప్పారు. తమ ఇళ్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని 61 శాతం మంది స్పష్టం చేశారు. మరోవైపు విద్యుత్‌ అధికారులు బిల్లులు చెల్లించాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వైర్లు కట్‌ చేస్తున్నారని వీరంతా సర్వేలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

స్కాలర్‌షిప్‌ల మంజూరులో తీవ్ర జాప్యం..
మరోవైపు పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కూడా నెలవారీగా మంజూరు చేయడం లేదని.. తీవ్ర జాప్యం చేస్తున్నారని 36.36 శాతం మంది విద్యార్థులు సర్వేలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం తమను ఇబ్బంది పెడుతున్నాయని 29.79 శాతం మంది, బ్యాంకులో సమస్యలు ఎదురవుతున్నాయని 33.85 శాతం మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇక బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్‌లో చదువు సరిగా చెప్పడం లేదని 35 శాతం మంది, స్కూల్‌ యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయని 33 శాతం మంది, హాస్టళ్లలో భోజనం బాగుండటం లేదని 17 శాతం మంది విద్యార్థులు వాపోయారు.

మెనూనా.. అదేంటి? 
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో భోజనం ‘మెనూ’ గురించి అడిగితే అత్యధిక శాతం మంది విద్యార్థులు తెల్లమొహం వేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని 23 శాతం మంది విద్యార్థులు చెప్పగా.. మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని 42 శాతం మంది పేర్కొన్నారు. తమకు నాణ్యమైన ఆహారం పెట్టకుండా భారీ ఎత్తున నిధులు మిగుల్చుకుంటున్నారని పలువురు విద్యార్థులు సర్వేలో స్పష్టం చేశారు. వార్డెన్స్‌ ప్రవర్తన కూడా సక్రమంగా లేదని పేర్కొన్నారు. రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌లో కూడా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని 28 శాతం మంది, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని 37.69 శాతం మంది విద్యార్థులు తెలియజేశారు. ఇక ఓవర్సీస్‌ విద్యకు సంబంధించి నగదు జమ కావడం లేదని, మంజూరు చేసిన మొత్తం సరిపోవడం లేదని.. లంచాలు అడుగుతున్నారని ఐదు శాతం మంది వాపోయినట్లు సర్కార్‌ సర్వేలో వెల్లడైంది.

సొంతింటి కల నెరవేరాలంటే అమ్యామ్యా తప్పదు! 
ఇక పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసేందుకు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు లంచాలు వసూలు చేస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని సర్కార్‌ సర్వేలో స్పష్టమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు 13.70 శాతం మంది, అధికారులు 36.53 శాతం మంది లంచాలు తీసుకుంటున్నారని లబ్ధిదారులు వాపోయారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లలో వసతులు సరిగా లేవని, నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇళ్ల మంజూరుకు, బిల్లుల చెల్లింపులకు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు లంచాలు డిమాండ్‌ చేస్తున్నారని.. డబ్బులివ్వందే మంజూరు చేయడం లేదని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ఆదరణలోనూ అవినీతి కంపు..
ఆదరణ పథకం కింద పేద వృత్తిదారులకు పనిముట్లు మంజూరు చేయడంలోనూ అవినీతి కంపు కొడుతోందని, నాణ్యత లేనివి అంటగడుతున్నారని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఆదరణ పథకం కింద రుణం మంజూరు చేయించేందుకు లంచం అడుగుతున్నారని.. పనిముట్లు ఇవ్వట్లేదని, ఇచ్చిన అరకొర మందికి కూడా నాణ్యత లేనివి అంటకట్టారని 42 శాతం మంది ఫిర్యాదు చేశారు. స్థానిక అధికార ప్రజాప్రతినిధుల(టీడీపీ నాయకులు) వల్ల పనిముట్లు అందక ఇబ్బంది పడుతున్నామని మెజారిటీ లబ్ధిదారులు తమ అసంతృప్తి తెలియజేశారు.

బిడ్డను ఇంటికి చేర్చాలన్నా.. దుప్పటి మార్చాలన్నా లంచమే
ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలకు కూడా లంచం అడుగుతున్నారని.. ఉచితంగా మందులివ్వడం లేదని అత్యధిక మంది ప్రభుత్వ సర్వే ద్వారా తెలిపారు. ఇక చంద్రన్న సంచార చికిత్స కేంద్రాల్లో సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు తల్లీ బిడ్డ వాహనాల డ్రైవర్లు సైతం వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు వాపోయారు. ఎన్టీఆర్‌ వైద్య చికిత్సకు, ఎన్టీఆర్‌ ల్యాబొరేటరీల్లో.. ఆఖరికి ఆస్పత్రుల్లో దుప్పటి మార్చేందుకు కూడా లంచాలు అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు అన్న క్యాంటీన్లలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని 36 శాతం మంది.. పెట్టే అన్నం సరిపోవడం లేదని 27 శాతం మంది సర్వేలో వివరించారు. 

పెళ్లి కానుక అడిగితే.. రూపాయిచ్చారు!
ఐదు నెలల క్రితం బినిపే శేఖర్‌తో నాకు వివాహం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను ఆ సమయంలో చంద్రన్న పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్నాను. అర్హత ఉన్నట్లు గుర్తిస్తూ బ్యాంకులో ఒక రూపాయి జమ చేశారు. మళ్లీ ఇప్పటివరకూ పట్టించుకోలేదు. దీని గురించి ప్రశ్నిస్తే.. లంచం కావాలంటున్నారు. 
– బినిపే మౌనిక, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా

రూ.10 వేలు ఇవ్వాలట!
వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలో మాకు ఇల్లు మంజూరైంది. అయితే ఇంటిని కట్టుకోవాలంటే జిల్లా గృహ నిర్మాణ సంస్థకు చెందిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రూ.10 వేలు లంచం అడుగుతున్నాడు. నిరుపేదలమైన మేము ఆ డబ్బును ఎక్కడ్నుంచి తేవాలో అర్థం కావడం లేదు. నాలాగే చాలా మంది బాధపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇంటిని రద్దు చేస్తారేమోనని భయమేస్తోంది. – కె.సుబ్బరాయుడు, చిన్నచౌకు, కడప

ఇంటికి రూ.2 లక్షల వరకు వసూలు..
శ్రీకాకుళం నగరంలో హుద్‌హుద్‌ బాధితుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 192 ఇళ్లను నిర్మించారు. ఈ కాలనీ నిర్మాణం పూర్తయ్యి ఏడాదిన్నర దాటింది. లబ్ధిదారులను ఇప్పటికీ ప్రకటించలేదు. టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత విధేయులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు అర్హులైన లబ్ధిదారులను పక్కకుపడేసి.. అనర్హుల నుంచి ఇళ్ల కేటాయింపునకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. సాక్షాత్తూ టీడీపీ జిల్లా సమావేశంలో ఆ పార్టీ నాయకులు బహిరంగంగా ఈ ఆరోపణలు చేశారు. ఇందుకు ఆధారాలున్నాయని కూడా వారు చెప్పారు. ఇది జరిగి 8 నెలలు దాటిపోతోంది. అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో వాస్తవం లేదని బుకాయించినా ఇప్పటికీ జాబితాను ప్రకటించకపోవడం గమనార్హం.  

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దౌలూరి నారాయణ. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం రామారావుపేటకు చెందిన దళితుడు. ఇతనికి ఉన్నది చిన్నపాటి పెంకుటిల్లు. కానీ ఇతని ఇంటికి రూ.17 వేలు కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చేతపట్టుకొని అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. కనీసం వంద యూనిట్లు కూడా వినియోగించుకోలేని తనకు.. ఇంత బిల్లు ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నాడు. దళితులకు వంద యూనిట్లలోపు విద్యుత్‌ ఉచితమనే మాట అంతా ఉత్తిదే అని చెబుతున్నాడు. రూ.17 వేలు కట్టకపోతే మీటర్‌ పీకేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని నారాయణ వాపోతున్నాడు.  

ఉచితమన్నారు.. బిల్లు కట్టిస్తున్నారు 
టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ అని ప్రకటించింది. కానీ ఇది అస్సలు అమలు కావడం లేదు. వంద యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించినా కూడా మాకు బిల్లు వస్తోంది. అంతా ప్రచార ఆర్భాటమే.
–నాగూరయ్య, కృష్ణమనాయుడుకండ్రిగ, యాకసిరి పంచాయతీ, నెల్లూరు జిల్లా

నీళ్ల చారే గతి 
సంక్షేమ వసతి గృహాల్లో మెనూ కాగితాలకే పరిమితమవుతోంది. నీళ్ల చారు, రుచిలేని పదార్థాల వల్ల విద్యార్థులకు పోషకాహారం అందడం లేదు. వార్డెన్లు, అధికార్లు వసతి గృహాల పర్యవేక్షణ గాలికొదిలేశారు. తగరపువలసలోని కాలేజీ హాస్టల్‌లో గచ్చులు, తలుపులు, కిటికీలు శిధిలమైపోయాయి. కనీసం టాయిలెట్లు కూడా లేవు.
– వై అప్పలరాజు, ఏఐఎస్‌ఎఫ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు, కొయ్య రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top