ఇదీ..అవినీటి చరిత్ర!

TDP Government Water Canal Corruption In Chittoor - Sakshi

 టీడీపీ ప్రభుత్వంలో దోపిడీల పర్వం

ఉపకాలువ పనుల్లో రూ.287 కోట్లు దోచేయత్నం

 నేడు జిల్లాకు నిపుణుల కమిటీ రాక

ఇది ఓ అవి‘నీటి’చరిత్ర. టీడీపీ గద్దల దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. ఏదో చేస్తున్నామన్న భ్రమకల్పించి సర్వం మింగేసే యత్నం. అంచనాలు పెంచుకుని.. నేతలు పంచుకుతిన్న అవినీతి బాగోతం. హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ ద్వారా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు కుప్పం ఉపకాలువ నిర్మాణాలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం తన కాంట్రాక్టు సంస్థ కోసం నిబంధనలు పక్కనబెట్టింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్‌ కోసం కొత్త జీవోలు జారీచేసింది. అంచనాలు పెంచి ఏకంగా రూ.144.7 కోట్లను దోచిపెట్టింది. దీనిపై నేడు నిపుణుల కమిటీ జిల్లాలో పర్యటించనుంది. కుప్పం ఉప కాలువల్లో పారిన అవినీతి వరదను పరిశీలించనుంది.

సాక్షి, బి.కొత్తకోట: పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లె చెరువు నుంచి కుప్పంలోని పరమసముద్రం చెరువు వరకు 143.9 కి.మీ హంద్రీ–నీవా కాలువ పనులు, మూడు ఎత్తిపోతల పథకాలు, మధ్యలో కాంక్రీటు నిర్మాణాలు పూర్తి చేయడానికి 2015లో రూ.413 కోట్లతో టెండర్లు నిర్వహించారు. టెండర్‌ వేసిన గాయత్రి నిర్మాణ సంస్థకు అర్హతలేదని తప్పించారు. 4శాతం ఎక్సెస్‌తో రూ.430.27 కోట్లకు హెఈఎస్, ఆర్‌కే, కోయా జాయింట్‌ వెంచర్‌ టెండర్‌ దక్కించుకున్నాయి. పనిచేపట్టాక వెంచర్‌ సంస్థ పనులు పూర్తిచేసేందుకు రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ కాంట్రాక్టు సంస్థకు పనుల్లో భాగస్వామ్యానికి అనుమతి ఇవ్వాలన్న లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతోనే అవినీతి కథ మొదలైంది.

కాంట్రాక్టర్ల ఇష్టంగా పనులు
కుప్పం ఉపకాలువ పనులు దక్కించుకున్న కాం ట్రాక్టు సంస్థ డీపీఆర్‌ (డీటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు) మేరకు పనులు చేపట్టలేదు. తమకు అనుకూలంగా, ఇబ్బందులు లేనివిధంగా, పనిభారం తగ్గేలా వ్యవహరించింది. దీనివల్ల నిర్మాణాలు, కాలువ పొడవు తగ్గిపోయాయి. అంటే టెండర్‌ విలువ మేరకు పనిచేయకపోవడంతో టెండర్‌ విలువ తగ్గాలి. ఇక్కడ అలా జరగలేదు. పనిభారం తగ్గినా అదనం చెల్లింపుల కోసం పావులు కదిపారు. డీపీఆర్‌లో సైఫన్‌ కాలువలో 6 నిర్మాణాలు, 12 అక్విడెక్టులు, పనుల్లో సొరంగాల (టన్నల్‌) నిర్మాణం లేదు. కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసం సోమాపురం వద్ద 50మీటర్లు, గుడుపల్లె వద్ద 475మీటర్లు, యామిగానిపల్లె వద్ద 50మీటర్లు, కిలోమీటర్‌ 108 వద్ద 50మీటర్లు, గ్యాస్‌ పైప్‌లైన్‌ వద్ద 50మీటర్ల సొరంగం పనులు చేపట్టారు. ఈ పనుల కారణంగా కొండల చుట్టూ వెళ్లాల్సిన కాలువ పొడవు 20 కిలోమీటర్ల దూరం తగ్గింది. 12 కిలోమీటర్ల పైప్‌లైన్, 45 వరకు బ్రిడ్జిలు, వాగులు, వంకలపై నిర్మాణాలు చేపట్టారు. కాలువకు సంబంధించి 1.15కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 1,17,345 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనిచేయాలి. కాలువలో మట్టిపనికి క్యూబిక్‌ మీటరుకు రూ.80 చెల్లిస్తారు. అయితే గట్లమీద మట్టి పనిచేశామని అందుకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.500 చెల్లించాలని, అదనంగా నిర్మించిన కాంక్రీటు పనులకు అదనంగా చెల్లించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు.

రూ.287 కోట్ల కోసం స్కెచ్‌
వాస్తవంగా కుప్పం ఉప కాలువ పనిలో ప్రభుత్వం నుంచి టెండర్‌ విలువ కాకుండా అదనంగా మరో రూ.287 కోట్లు దోచుకోవా లని పథకం వేశారు. అదనంగా మట్టి పనులు చేశామని కాంట్రాక్టు సంస్థ విన్నవించింది. ఈ విన్నపం ప్రభుత్వానికి నివేదించగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. దీనిపై ప్రాజెక్టు అధికారులు రూ.160కోట్లు చెల్లించేలా ప్రతిపాదించారు. స్టేట్‌లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ అదనపు చెల్లింపు కదరదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం మంత్రి మండలికి చేరి నిర్ణయం తీసుకునేలా చేసింది. కాంక్రీటు నిర్మాణాలకు మాత్రమే అదనం చెల్లిస్తామని ఎస్‌ఎల్‌ఎస్‌సీ నిర్ణయం తీసుకోగా రూ.122.75 కోట్లు మం జూరుచేస్తూ 2018 సెప్టెంబర్‌ 7 జీవో నంబర్‌ 626 జారీచేసింది. అంతటితో ఆగని కాంట్రాక్టు సంస్థలు మట్టిపనులకు అదనపు చెల్లింపుల డిమాండ్‌తో పావులు కదిపాయి. కుప్పం కాలువ పనిలో కాలువ గట్లమీద మట్టిపనులు చేశారని ప్రభుత్వం 2019 జనవరి 28న జీవో 68 జారీచేసి రూ.21.95 కోట్లున మంజూరు చేసింది. దీంతో టీడీపీ సర్కార్‌ అడ్డంగా అదనం రూ.144.7 కోట్లు దోచిపెట్టింది.

గ్యారెంటీనే వద్దన్నారు
అదనంగా రూ.144.7 కోట్లు పొందిన కుప్పం కాలువ కాంట్రాక్టర్ల వ్యవహరంపై ఉన్నతాధికారులకు నమ్మకం కుదరలేదు. నిర్ణీత గడువు 9నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. పలుమార్లు గడువు పెంచుకుంటూ వెళ్లారు. దీంతో అదనంగా పెంచిన నిధులను విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు విముఖత వ్యక్తంచేశారు. అదనం పొందినా పనులు ముందుకు సాగడం లేదు, ప్రధానంగా కాంట్రాక్టు సంస్థ తీరుపై నమ్మకం లేదని, అదనపు చెల్లింపులకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ తీసుకుంటామని, పనులన్నీ పూర్తి చేశాకే అదనపు సొమ్మును చెల్లిస్తామని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు. అధికారుల నివేదికను పక్కనపెట్టి కాంట్రాక్టు సంస్థ దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్నారు. బ్యాంకు గ్యారంటీతో పనిలేదు. బిల్లుల మేరకు చెల్లింపులు చేయండి అంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో అధికారులు టీడీపీ ప్రభుత్వం చెప్పినట్టుగా చేయక తప్పలేదు.

జీవో 32 ద్వారా వెసులుబాటు
తొలుత కాంట్రాక్టు సంస్థ కోరిన అదనపు ధరలు, నిర్మాణాలపై స్టేట్‌లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ, ఐబీఎం కమిటీలు సమీక్షించి ఒప్పందం మేరకు పనులు చేయాలని స్పష్టంచేశాయి. కాంట్రాక్టర్‌ కోరినట్టు అదనం పెంపు సాధ్యం కాదని తేల్చేసింది. జీవో 22 జారీకి మునుపున్న పనులకు మాత్రమే ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అంటే కొత్తగా ఈపీసీ ద్వారా నిర్వహిం చిన టెండర్లతో చేపట్టిన పనులకు అదనం, వెసులుబాటు వర్తించదు. దీంతో ఆశించింది సాధ్యంకాదని తేలిపోవడంతో ప్రభుత్వం కుప్పం ఉపకాలువ కాంట్రాక్టర్లను దృష్టిలో ఉంచుకుని ఈపీసీ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చేలా కొత్తగా జీవో 32 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం మరోమారు పరిశీలించిన స్టేట్‌లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ, ఐబీఎం కమిటీలు కుప్పం కాలువ పనులకు అదనం చెల్లింపులకు ఆమోదం తెలిపాయి. పనులు చేయని కాంట్రాక్టు సంస్థను నిబంధనల ప్రకారం పనుల నుంచి తొలగించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.

సొరంగం లైనింగ్‌ వదిలేశారు
తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి వెళ్లే హంద్రీ –నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ మదనపల్లె మీదుగా పుంగనూరుకు నీళ్లు చేరాలంటే 59వ ప్యాకేజీలోని సొంరంగం పనులు కీలకం. 150కిమీ నుంచి 173కిమీ వరకు కాలువ, 3కిమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసేందుకు ఏపీఆర్‌ కాంట్రాక్టు సంస్థ రూ.69.71కోట్లతో పని దక్కించుకుంది. 2015 నాటికి ఒప్పందం మేరకు రూ.36.92 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనుల్లో రూ.34.27 కోట్ల పనులు కాంట్రాక్టు సంస్థ నుంచి తొలగించారు. తొలగించిన పనికి సంబంధించి కాట్లాటపల్లె–రామిరెడ్డిగారిపల్లె మధ్యలో 2.5 కిలోమీటర్ల సొరంగం పనులు, కాలువ, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి 59ఏ ప్యాకేజీ కింద రూ.160.518 కోట్లకు అంచనాలు పెంచి టెం డర్లు నిర్వహించగా పనులను రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు సంస్థ సొరంగం పని పూర్తిచేసినా లైనింగ్‌ పనుల జోలికి వెళ్లలేదు.

2.5కిలోమీటర్ల సొంరంగానికి లైనింగ్‌ చేయాల్సి ఉండగా కేవలం 200 మీటర్లు మాత్రమే లైనింగ్‌ చేశారు. మిగిలిన 2.3కిలోమీటర్లు లైనింగ్‌ చేయలేదు. దీనికితోడు పనులు చేసేందుకు వసతులు కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఎన్నికల సమయంలో పారిన కృష్ణా జలాలతో సొరంగంలో పూడిక చేరినా తొలగించలేదు. ఇదిలా ఉంటే ప్రాజెక్టు పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంకా బిల్లులు పెండింగ్‌లో ఉండగా రిత్విక్‌ సంస్థకు మాత్రం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చూసిం ది. చేసిన పనులన్నింటీకి బిల్లులు చెల్లించేసింది. అయినప్పటికీ సొరంగానికి కీలకమైన లైనింగ్‌ పనుల జోలికి మాత్రం వెళ్లలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top