నాడెప్‌ కుండీలతో నిధుల గల్లంతు..!

TDP Government Misuse Of Public Funds In Vizianagaram District - Sakshi

నిరుపయోగంగా మారిన సేంద్రియ ఎరువుల తయారీ కుండీలు

రైతులకు అవగాహన కరువు

నాసిరకం నిర్మాణాలతో గత పాలకుల నిర్వాకం 

సుమారు రూ.55 కోట్ల ప్రజాధనం వృథా 

అధికారం ఉంది... అడిగేవారు ఎవ్వరన్న ధైర్యంతో గత టీడీపీ పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నాడెప్‌ కుండీల నిర్మాణాల పేరుతో రూ.కోట్లాది రూపాయలను ఖర్చుచేశారు. నాసిరకం నిర్మాణాలతో నిధులు కాజేశారు. సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యాన్ని మరుగునపడేశారు. ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేశామంటూ ప్రచారం చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు నిరుపయోగంగా మారిన నాడెప్‌ కుండీలు కనిపించడం లేదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. 

లక్కవరపుకోట: జిల్లాలోని పలు గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన నాడెప్‌ కుండీలు నిరుపయోగంగా మారాయి. ఉపాధి హామీ పథకం నిధులు రూ.కోట్లు ఖర్చుచేసినా పైసా ప్రయోజనం కలగలేదు. ఎక్కడా కిలో సేంద్రియ ఎరువు కూడా తయారు కాలే దు. టీడీపీ కార్యకర్తలకే కుండీలను మంజూరు చేసి నిధులను కైంకర్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లోని కుండీలు నిధుల దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యంగా మారాయి. అయ్యవారు టార్గెట్‌ ఇచ్చారు.. మనం నిర్మించేద్దామనే క్రమంలో ఒక్కో గ్రామంలో ఒకే చోట నాలుగు నుంచి ఎనిమిది కుండీలను నిర్మించారు.  ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేయాలని.. మంచి విజన్‌ ఉన్న నాయుకుడినంటూ చెప్పుకున్న చంద్రబాబుకు ఈ వృథా ఖర్చులు కనిపించలేదా అంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాల చేశారంటూ మండిపడుతున్నారు.

నిర్మాణాల తీరు ఇలా... 
జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో 33, 256 నాడెప్‌ కుండీల నిర్మాణానికి రూ. రూ.35కోట్ల72 లక్షల41వేలు ఖర్చుచేశారు. అలాగే, 2017–18 సంవత్సరంలో 16,450 కుండీల నిర్మాణానికి రూ.14.46 కోట్లు,  2018–19 సంవత్సరంలో 2,239 కుండీలకు రూ2.05కోట్లు ఖర్ఛు చేశారు. జిల్లాలో అత్యధికంగా గుర్ల మండలంలో 810 కుండీల నిర్మాణానికి సుమారు రూ.76లక్షల నిధులు చెల్లించారు. ఎస్‌.కోట నియోజకవర్గం పరిధిలోని కొత్తవలస మండలంలో 796, లక్కవరపుకోటలో 520, వేపాడలో 705, ఎస్‌.కోటలో 421, జామి మండలంలో 550 సేందియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణాలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే నిర్వహించారు. ఇప్పటికే కొన్ని చోట్ల బీటలు వారి శిథిలావస్థకు చేరాయి.

చెల్లింపులు ఇలా..
ఒక్కో కుండీ నిర్మాణానికి గత ప్రభుత్వం సుమారుగా రూ10,900 కేటాయించింది. 10 అడుగుల పొడువు, ఆరడుగుల వెడెల్పు, మూడు అడుగుల ఎత్తు పరిమాణంలో నిర్మించాలి. ఈ నిర్మాణాలు అత్యధికంగా టీడీపీ కార్యకర్తలు సంబంధిత ఉపాధి హామీ క్షేత్రసహాయకులు కుమ్మకై నిర్మించారని పలువురు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఎలా నిర్మించినా ఒక్కోగుంతకు సుమారుగా రూ.9,100 చెల్లించారు.

అవగాహన కల్పించక... 
సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కుండీల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారే తప్ప వీటిపై రైతులకు ప్రచారం చేయలేదు. కుండీల లబ్ధిదారుల ఎంపికలో పాడి పశువులు లేనివారు.. ఎరువులు అవసరం లేనివారు అధికమంది ఉండడం వల్లే లక్ష్యం నీరుగారింది. నిధులు కాజేయడమే లక్ష్యంగా నిర్మాణాలు చేశారే తప్ప సేంద్రియ ఎరువులు తయారుచేద్దామన్న ఉద్దేశం ఎక్కడా కనిపించలేదనేందుకు నిరుపయోగంగా కనిపిస్తున్న కుండీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిర్మాణ బాధ్యతలు ఉపాధిహామీ సిబ్బంది తీసుకున్నారు. అవగాహన బాధ్యతను మండల వ్యవసాయాధికారులకు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. కాగా... ఎక్కడ రైతులకు అవగాహన మాత్రం కల్పించలేదు. సేంద్రియ ఎరువుల గుంతల్లో పోయాల్సిన చెత్త, పశువుల పేడను ఎప్పటి మాదిరిగానే ఆరుబయటే రైతులు పోసుకుంటున్నారు.

నిధులు రికవరీ చేయాలి 
గ్రామాల్లో నిర్మించిన నాడెప్‌ల పనులను ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల నుంచి రికవరీ చేయాలి. నిర్మాణ పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వి నియోగం అయ్యింది.
–  గాడి అప్పారావు, సీఐటీయూ నాయకుడు, ఎస్‌.కోట డివిజన్‌

ఎందుకు నిర్మించారో తెలియదు...
మా గ్రామంలో పదుల సంఖ్యలో సేంద్రియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణ సమయంలో అధికారులు వచ్చి హడావుడిగా నిర్మించేశారు. వాటిని ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించలేదు. నిరుపయోగంగా ఉన్న కుండీలను ఇప్పటికే కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. 
– కొట్యాడ జగం, మాజీ సర్పంచ్‌ 

మాది నిర్మాణ బాధ్యత మాత్రమే.. 
మేము గ్రామాల్లో రైతులకు అవసరమైన చోట నాడెప్‌లను నిర్మించిన వరకే మా పని. రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. 
– ఎస్‌.విజయలక్ష్మి, ఉపాధిహామీ ఏపీఓ,  లక్కవరపుకోట మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top