ఏమే.. బయటకు పో.. కాళ్లు నరికేస్తా!

ఏమే.. బయటకు పో.. కాళ్లు నరికేస్తా!

- చిత్తూరులో దళిత మహిళా ఇంజనీరుపై టీడీపీ కార్పొరేటర్‌ భర్త దుర్భాషలు

బిల్లు కోసం కార్పొరేషన్‌ కార్యాలయంలో దౌర్జన్యం

అధికారుల మౌనం..కన్నీటి పర్యంతమైన ఉద్యోగిని

మొత్తం సీసీ కెమెరాల్లో నిక్షిప్తం  

 

చిత్తూరు అర్బన్‌: అధికార పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యాలకు అంతూపొంతు లేకుండా పోతోంది. రెచ్చిపోయి ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈసారి చిత్తూరులోని నగర పాలక సంస్థ కార్యాలయం ఇందుకు వేదికగా మారింది. టీడీపీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్‌ భర్త దళిత వర్గానికి చెందిన ఓ మహిళా ఇంజనీరును పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడటాన్ని చూసి అక్కడి ఉద్యోగులు, ఇతర కాంట్రాక్టర్లు నివ్వెరపోయారు. 

 

ఏం జరిగిందంటే..?

మంగళవారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయం ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు వెంకట్రామిరెడ్డితో పాటు సహాయ ఇంజనీరు, ఆరుగురు ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. హఠాత్తుగా అక్కడకు దూసుకొచ్చిన టీడీపీ మహిళా కార్పొరేటర్‌ లలిత భర్త యువరాజుల నాయుడు నేరుగా దళిత వర్గానికి చెందిన మహిళా సహాయ ఇంజనీరు వద్దకు వెళ్లి... ‘‘ఏమే నీకోసం ఎంతసేపు కూర్చోవాలి? సైట్‌లో వర్క్‌ కొలతలు తీస్తామని ఇక్కడ కూర్చుని కథలు చెప్పుకుంటా ఉండావా? నీ.. పోయే బయటకు. ఇంకోసారి నాకు తెలియకుండా సైట్‌లోకి వస్తే కాళ్లు నరికేస్తా. ఏమే మేమంటే నీకు లెక్కలేదా?’’ అంటూ దూషణలకు దిగాడు. ఓ దశలో ఇంజనీరుపై కుర్చీతో దాడి చేయడానికి కూడా ప్రయత్నించటంతో మరో ఇద్దరు కాంట్రాక్టర్లు ఆయన్ను అడ్డుకుని బయటకు తరలించారు. అందరి ముందు నానా దుర్భాషలాడటంతో దళిత మహిళా ఇంజనీరు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారం మొత్తం కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.

 

సెలవు పెట్టి పోమ్మా....

చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో అమృత్‌ పథకం కింద ఉద్యానవన పనులు దక్కించుకున్న టీడీపీ మహిళా కార్పొరేటర్‌ భర్త.. బిల్లు తయారు చేయాల్సిందిగా మహిళా ఇంజనీరును పురమా యించాడు. అయితే అప్పటికే కమిషనర్‌ అప్పగించిన పనుల్లో ఉండటం, మేయర్‌ మరో ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్ప డంతో ఆమె అందులో నిమగ్నమయ్యారు. దీన్ని పట్టించు కోని కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యానికి దిగాడు. ఇంత జరుగుతున్నా సదరు నేతను మందలించడంకానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కానీ ఉన్నతాధికారులు ముందు కురా లేదు. ఓ అధికారి సెలవు పెట్టి వెళ్లిపోమని సూచిస్తే, మరో అధికారి ధర్నా చేయమ్మా.. అంటూ సలహా ఇచ్చి వెళ్లిపోయారు. 

 

ప్రజా సమస్యపై అడిగానంతే...

నా డివిజన్‌లో ప్రజల కోసం పార్కు కడుతున్నారు. ఇది త్వరగా పూర్తి చేయాలని 45 రోజులుగా ఏఈని కోరుతున్నా పట్టించుకోలేదు. దీనిపై నిలదీశానే తప్ప ఆమెను అమర్యాదగా మాట్లాడలేదు. కోపంతో అరిచిన మాట వాస్తవమే.

– యువరాజులనాయుడు, టీడీపీ నేత 
Back to Top