మా ఓట్లు తొలగించేందుకు టీడీపీ కుట్ర

TDP conspiracy to remove our votes - Sakshi

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్‌ వివేకానందరెడ్డి 

పులివెందుల: వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్లను వారి ప్రమేయం లేకుండా తొలగించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ఫారం–7 దరఖాస్తులు అధికారులకు పంపుతున్న విషయం విదితమే.  రెండు రోజుల క్రితం పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఓటును తొలగించాలని ఆయన పేరుతోనే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌ ద్వారా ఫారం–7 దరఖాస్తు అందింది. దీనిపై వైఎస్‌ వివేకానందరెడ్డి సోమవారం పులివెందులలోని అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు పంపారని.. వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు చేపట్టాలని ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా వైఎస్‌ వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఏడాదిన్నర నుంచి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 58 లక్షలమంది ఓట్లను తొలగించినట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీటిపై పార్టీ నాయకులు మళ్లీ ఓటు నమోదు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పులివెందులలో నా ఓటును కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వీటిని ఎవరు దరఖాస్తు చేస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఓటర్లను భయాందోళనకు గురి చేస్తోందన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును టీడీపీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ప్రతి ఓటరుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోగలిగిందన్నారు. దీని ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌ వీటిపై తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top