'సర్వే'ర్పణం

TDP Activists Loss With Lagadapati Survey Bettings - Sakshi

కొంపముంచిన లగడపాటి సర్వే

భారీ బెట్టింగ్‌లకు దిగిన టీడీపీనేతలు, అభిమానులు

జిల్లాలో రూ.30కోట్ల పైనే పందేలు

ఆస్తులు, బంగారు, జేసీబీలు, బైక్‌లు పోగొట్టుకున్న వైనం

అప్పులపాలై ఇళ్లు వదిలి పరారీ

సమ్మర్‌ క్యాంప్‌ అంటూ బుకాయింపు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌

లగడపాటి చిలుక జోస్యం.. టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు నమ్మి జిల్లాలో ఆ పార్టీ నాయకులు, అభిమానులు అప్పులపాలు కావాల్సివచ్చింది. టీడీపీ గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లకు దిగి కోట్లాది రూపాయలు పోగొట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందులో కొందరు జేసీబీలు, బుల్లెట్లు, బంగారు చైన్లు, ఉంగరాలను సమర్పించుకోగా.. మరికొందరు ఇళ్లు, భూములను సైతం పోగొట్టుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

పలమనేరు:జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తర్వాత పలుచోట్ల బెట్టింగులు సాగాయి. 19వ తేదీన లగడపాటి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను నమ్మి జిల్లాలో పలువురు భారీ ఎత్తున పందేలు కాసి రోడ్డున పడ్డారు. కొందరైతే ఉన్న ఊర్లను వదిలి బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు చేరుకున్నారు. మరికొందరు బడా నేతలు బెట్టింగ్‌ల ప్రభావం అని చెప్పకుండా సమ్మర్‌ క్యాంపుల్లో ఉన్నామంటూ ఫోన్లలో చెబుతున్నారు.

రెచ్చగొట్టి బెట్టింగులు
సర్వేలను గుడ్డిగా నమ్మి బెట్టింగులు కాసిన వారు ఎన్నికల ఫలి తాలను చూసి షాకయ్యారు. పలమనేరునియోజకవర్గంలో మంత్రి గెలుస్తాడని సుమారు 200మంది ఆ పార్టీకి చెందినవారు రూ.1000 నుంచి పది లక్షల రూపాయల దాకా పందేలు వేసుకున్నట్టు తెలిసింది. మున్సిపాలిటీలోని ఇద్దరు యువ నాయకులు  వెయ్యికి రెండు వేలంటూ రూ.20లక్షలు పోగొట్టుకున్నారు. మదనపల్లె రోడ్డుకు చెందిన ఓ కీలక కార్యకర్త ఒంటిపై ఉన్న బంగారు చైను మూడు ఉంగరాలను పోగొట్టుకున్నాడు. 20 మంది దాకా బంగారు ఉంగరాలను వదులుకోవాల్సి వచ్చింది. పట్టణంలోని టీడీపీకి చెందిన ఓ వ్యాపారి చాలామందిని రెచ్చగొట్టి మరీ పందేలు కాసి రూ.20లక్షలు ఖాళీ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దపంజాణి మండలంలోని రాయలపేటలో యువ నాయకుడు రూ.2లక్షలు ఖాళీ చేసుకున్నాడు. బైరెడ్డిపల్లి మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌ బైక్‌ను పందెంకాసి పోగొట్టుకున్నాడు. ఆతర్వాత కొందరు పెద్దమనుషులు నచ్చజెప్పడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త బైక్‌ను అతనికే ఇచ్చేసినట్టు తెలిసింది. వీకోటకు చెందిన ఓ నాయకుడు పొలాన్ని పోగొట్టుకున్నట్టు తెలిసింది.

కుప్పంలో రూ.5 కోట్లకుపైగా పందేలు
కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీపై ఆ నియోజకవర్గంలో పలువురు నాయకులు భారీ ఎత్తున బెట్టింగులు పెట్టి ఓ నేత తన ట్రాక్టర్‌ను పోగొట్టుకున్నాడట. కుప్పం నియోజవర్గంలోనే సుమారు 5 కోట్లదాకా పందేలు కాసినట్టు తెలుస్తోంది. పుంగనూరులో రియల్టర్‌ ఏకంగా ఏడు సైట్లను పందెంకాసి పోగొట్టుకున్నాడు. పూతలపట్టులో టీడీపీ గెలుస్తుందని టీడీపీ నాయకుడు పందెంకాసి ఆరు లక్షలకు తన భూమిని గెలిచిన వ్యక్తికి తన ఖాపెట్టాడట. చంద్రగిరిలో నానిపై బెట్టింగులు వేసుకున్న యువత పది దాకా ద్విచక్రవాహనాలు పోగొట్టుకున్నారట. నగరి, తిరుపతి, పీలేరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా బెట్టింగులు కట్టి డబ్బులు పోగొట్టుకున్నట్టు సమాచారం.

ఆ ఇద్దరి మాటలు నమ్మి
ఎన్నికలు ముగియగానే సాధారణంగా సాగిన బెట్టింగులు లగడపాటి సర్వేతో ఊపందుకున్నాయి. ఆపై చంద్రబాబు సమీక్షలు, ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ తమకు రాష్ట్రంలో 130 స్థానాలు వస్తాయని చెప్పడంతో బెట్టింగులు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో వెయ్యికి వెయ్యిగా ఉన్న బెట్టింగులు వీరి మాటలతో వెయ్యికి రెండు వేలు, మూడువేలుగా పెట్టి మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. నాయకులే కాదు సామాన్య కార్యకర్తలు సైతం అప్పులు చేసిమరీ బెట్టింగులకు దిగారు. గ్రామాల్లో సైతం బూత్‌లవారీ మెజారిటీలపై భారీగా పందేలు కాసిన టీడీపీ నాయకులు చేతులు కాల్చుకున్నారు.

నష్టపోయిన వారి పరిస్థితి ఘోరం
బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకున్న నాయకులు పరిస్థితి ఘోరంగా మారింది. ఆస్తులు, బంగారు, వాహనాలను అమ్ముకోవాల్సి వచ్చింది. మరికొందరు అప్పులపాలై ఉన్న ఊర్లను వదలివెళ్ళారు. కొందరు కుటుంబసమేతంగా ఇంటికి తాళం వేసి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. చాలామంది ఫలితాలొచ్చాక బయటకనిపించడం లేదు. వ్యాపారాలు చేసే నాయకులు తాత్కాలికంగా వదలిపెట్టేశారు. ఇలా ఉండగా ఈ బెట్టింగ్‌లకు పాల్పడివారిలో ఎక్కువమంది నీరు–చెట్టులో అక్రమంగా సంపాదించినోళ్లు, అధికార పార్టీని అడ్డం పెట్టుకుని జేబులు నింపుకున్నవారు, ఇసుకాసురులు ఉండడం కొసమెరుపు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top