ఎంతపని చేశాడు... వెనకున్నదెవరో...!

Tanelanka Village People Talking About Accused Srinivas East Godavari - Sakshi

ఠానేలంక ప్రజల్లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నంపై చర్చ

శ్రీనివాస్‌ ఘాతుకంపై విస్మయం

తెర వెనక ఎవరో ఉన్నారంటూ అనుమానాలు

శ్రీనివాస్‌ బాబాయి ఠానేలంకలో తాజా మాజీ ఉప సర్పంచి

స్థానిక ప్రజా ప్రతినిధి సిఫార్సుతోనే విశాఖలోని టీడీపీ నేత రెస్టారెంట్‌లో ఉద్యోగం

అన్నింటా యూటర్న్‌లే...వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపైహత్యాయత్నం జరిగిన నాటినుంచి తడబాటే. మసిపూసి మారేడు కాయ చేసిన చందంగా సీఎం చంద్రబాబు నాయుడు నుంచి కింది స్థాయి వరకు టీడీపీ నేతలందరిదీ ఒకే మాట...గోబెల్స్‌ ప్రచారానికి తెరదీస్తూ అసలు విషయాన్నితప్పుతోవ పట్టించే ప్రయత్నాలే. నిందితుడు శ్రీనివాసరావు ఇంటివద్దా అదే సీన్‌ కనిపించింది. ఆ ఇంటి చుట్టూ ఉన్నవారంతా టీడీపీ నేతలే...అయినా జగన్‌ అభిమానులన్నట్టుగా నమ్మించేందుకు నానాపాట్లు పడుతున్నారు.

సాక్షి,తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్న ఉదంతం నిందితుడు జనిపెల్ల శ్రీనివాస్‌ స్వగ్రామం ముమ్మిడివరం మండలం ఠానేలంకలో తీవ్ర చర్చనీయాంశమైంది. తమ మధ్య తిరిగే కుర్రాడు ఎంత పని చేశాడని గ్రామ ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇలా చేస్తాడని ఊహించలేదని నిందితుడు శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు, సోదరుడు, బంధువులు వాపోతున్నారు. ఎవరో తెర వెనుకనుంచి చేయించారంటూ బలంగా నమ్ముతున్నారు. పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం తమ  జీవితాలతో ఆడుకున్నారని బంధువులు వాపోతున్నారు. ఆర్మీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యవసాయం చేసుకుంటూ గౌరవంగా బతికే తమను బజారున పెట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరిదీ ఒకే మాట...
ఠానేలంక గ్రామంలో దాదాపు 700 కుటుంబాలున్నాయి. తోటలు, రోడ్లకు ఇరువైపులా దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో ఈ కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కో ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరం ఉంది. జనిపెల్ల ఇంటి పేరు గల దాదాపు 15 కుటుంబాలు పంట కాలువ గట్టున నివసిస్తున్నాయి. ప్రస్తుత ఘటనతో వారు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడేంత ధైర్యం వాడికి లేదని, ఇది ఎవరో కావాలనే చేయించి ఉంటారని అక్కడివారంటున్నారు. మహిళలు, పురుషులు, యువకులు, పెద్దలు.. ఇలా ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు.

కుట్ర దాగిఉంది..
ఈ దుండగం వెనుక పెద్దల కుట్ర ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. జనిపెల్ల శ్రీనివాస్‌ ప్రవర్తన ఇటీవల కాలంలో పూర్తిగా మారిందని చుట్టు పక్కల యువకులు పేర్కొంటున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన జనిపెల్ల శ్రీనివాస్‌ తనకు జాక్‌పాట్‌ వచ్చిందని, తన జీవితమే మారిపోబోతోందని స్నేహితుల వద్ద చెప్పినట్లు యువకులు పేర్కొంటున్నారు. పైగా యువకులకు మద్యం, పసందైన విందుకు భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అప్పటి వరకు పెద్దగా పని చేయని జనిపెల్ల శ్రీనివాస్‌ గత తొమ్మిది నెలల్లో ఆరు ఖరీదైన సెల్‌ఫోన్లు మార్చినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించడం గమనార్హం.

టీడీపీ నేతల సిఫార్సుతో విశాఖ రెస్టారెంట్‌కు.
పెద్దగా చదువు అబ్బని శ్రీనివాస్‌ ఐటీఐలో చేరేందుకు ప్రయత్నించాడు. కౌన్సెలింగ్‌కు వెళ్లి సీటు తెచ్చుకున్నా కాలేజీలో మాత్రం చేరలేదు. స్థానికంగా ఉన్న ఉషాకిరణ్‌ ఐటీఐ కళాశాలలో 2003లో అతను చేరేందుకు కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు ఉంది. కానీ అతను కళాశాలలో రిపోర్టు చేయకపోవడంతో డిశ్చార్జి చేసినట్లు కాలేజీ రికార్డుల్లో ఉంది. రికార్డుల్లో జనిపెల్ల సత్యనారాయణ అనే పేరుతో శ్రీనివాస్‌ నమోదై ఉన్నాడు. అది మరొకరి పేరుగా భావించేందుకు అవకాశం ఉన్నా ఫొటో మాత్రం శ్రీనివాస్‌దే కావడంతో రుజువైంది. చదువు అబ్బకపోవడంతో కువైట్‌ కూడా వెళ్లి అనారోగ్యంతో వచ్చిన శ్రీనివాస్‌ తర్వాత స్థానిక పనులు చేసుకుంటున్నారు. విశాఖ విమానాశ్రాయంలోని టీడీపీ నేత హర్షవర్థన్‌కు చెందిన ఫ్యూజెన్‌ రెస్టారెంట్‌లో చేరకముందు శ్రీనివాస్‌ విజయవాడలో ఓ రెస్టారెంట్‌లో పని చేసినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. తర్వాత గ్రామ టీడీపీ నేతలు స్థానిక నాయకుడికి సిఫార్సు చేయడం, ఆయన విశాఖలోని టీడీపీ నేత రెస్టారెంట్‌లో పని చేసేందుకు రిఫర్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్‌ బాబాయ్‌ జనిపెల్ల నాగేశ్వరరావు పంచాయతీలో టీడీపీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆరో వార్డుకు పోటీ చేసి గెలుపొందారు. అనంతరం గ్రామ ఉప సర్పంచిగా కూడా ఎన్నికయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top