విద్యాశాఖలోనూ స్విస్‌ చాలెంజ్‌

విద్యాశాఖలోనూ స్విస్‌ చాలెంజ్‌

వృత్తివిద్యా కళాశాలల్లో ఎస్‌ఏపీ శిక్షణ పేరుతో భారీ దోపిడీకి పన్నాగం

ఒక్కో విద్యార్థిపై రూ.30 వేల చొప్పున మొత్తం రూ.540 కోట్లకు ‘టెండర్‌’

 

- శిక్షణ ఇస్తామంటూ యాష్‌ టెక్నాలజీ సంస్థ ప్రతిపాదనలు

వాటిపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందేహాలు

పట్టించుకోని సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ 

అనుమతి లేకుండానే స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో నోటిఫికేషన్‌

యాష్‌ టెక్నాలజీకే కాంట్రాక్టు దక్కేలా నిబంధనలు

ప్రభుత్వ ముఖ్యులతో ముందస్తు బేరసారాలతోనే అక్రమ వ్యవహారం!

 

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణంలో స్విస్‌ చాలెంజ్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీ తంతుకు సాంకేతిక విద్యాశాఖలోనూ తెర లేపారు. ఒక ప్రైవేటు సంస్థతో కుమ్మక్కై రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ తదితర వృత్తివిద్యా కాలేజీల్లోని విద్యార్థులకు ఎస్‌ఏపీ శిక్షణ పేరిట భారీ ఎత్తున దండుకునేందుకు స్కెచ్‌ వేశారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులకు ఎస్‌ఏపీలో శిక్షణ పేరిట యాష్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ ప్రతిపాదనలు అందించింది.



వీటిపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందేహం వ్యక్తం చేసినప్పటికీ, ప్రతిపా దనలను పెండింగ్‌లో పెట్టినప్పటికీ ఏమా త్రం పట్టించుకోకుండా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నేరుగా స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో టెండర్లు పిలవడం గమనార్హం. సదరు సంస్థకే కాంట్రాక్టు దక్కేలా ఈ నిబంధనలుండడం విశేషం. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అనుమతి లేకున్నా ఈ నోటిఫికేషన్‌ విడుదలవడం వెను క ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహమున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఏపీ శిక్షణకోసం దాదాపు రూ.540 కోట్లు అవుతుందని, ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకోవడానికే స్విస్‌ ఛాలెంజ్‌కు తెరలేపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

అనుమతి లేకుండానే స్విస్‌ ఛాలెంజ్‌ ప్రకటన

రాష్ట్రంలోని వృత్తివిద్యా కళాశాలల్లోని విద్యార్థులకు ఏదైనా శిక్షణ ఇవ్వాల్సిన అవసరముంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ముఖ్యులు, ఇతర నిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికొచ్చాక ఆ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి భిన్నంగా సాంకేతిక విద్యాశాఖలో అక్రమ వ్యవహారాలకు తెరతీశారు. ఈ నేపథ్యంలో యాష్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ తమ టెక్నాలజీని సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రంలోని కళాశాలల్ని ఆసరా చేసుకుంది. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలను, సాంకేతిక విద్యాశాఖ అధికారులను తెరవెనుక నుంచి ప్రసన్నం చేసుకుంది.



ఈ క్రమంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం, ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎస్‌ఏపీ శిక్షణ ఇచ్చేందుకు ప్రతిపాదనలు అందజేసింది. అదే తడవుగా సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ జీఎస్‌ పండాదాస్‌ వాటిపై ఎలాంటి అధ్యయనం లేకుండానే విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌(స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ)కి పంపారు. అయితే దాన్ని పరిశీలించిన ఆదిత్యనాథ్‌దాస్‌కు పలు సందేహాలు కలగడంతో.. అధ్యయనం చేయడానికి ఏడుగురితో ఒక కమిటీని జూలై 31న ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికలోనూ అనేక సందేహాలుండడంతో ప్రతిపాదనల్ని పెండింగ్‌లో పెట్టారు.



ఆ సందేహాలపై çవివరణ పంపాలంటూ పండాదాస్‌కు రాశారు. కానీ ఆ సందేహాలకు జవాబులు పంపకుండానే, ఎటువంటి అనుమతి లేకుండానే పండాదాస్‌ ఈనెల 8న స్విస్‌ ఛాలెంజ్‌పై కొన్ని పత్రికల్లో ప్రకటనలు విడుదల చేశారు. యాష్‌ టెక్నాలజీ సంస్థ ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులకు ఎస్‌ఏపీ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిందని, ఓపెన్‌ మార్కెట్‌ ప్రకారం ఆ కంపెనీలా చేయగలిగే సంస్థలు ఏవైనా ఉంటే ముందుకురావాలని అందులో పేర్కొన్నారు. శనివారం(16వ తేదీ) మధ్యాహ్నం రెండుగంటలతో గడువు ముగుస్తుందని అందులో వివరించారు. యాష్‌టెక్నాలజీ అందించిన ప్రతిపాదనల్ని ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీటీఈఏపీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’లో పొందుపరచినట్టు పేర్కొన్నారు. 

 

ఒక్కో విద్యార్థికి రూ.30 వేల చొప్పున ధర..

ఎస్‌ఏపీ శిక్షణను యాష్‌ టెక్నాలజీకి అందించడం ద్వారా భారీ దోపిడీకి స్విస్‌ ఛాలెంజ్‌ ద్వారా స్కెచ్‌ వేసినట్లుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంస్థ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులకు అందించే శిక్షణకుగాను ఒక్కో విద్యార్థికి రూ.30 వేలు చొప్పున ధర నిర్ణయించింది. మళ్లీ దానికి పన్నులు(ట్యాక్స్‌లు) అదనంగా వర్తిస్తాయని పేర్కొంది. యాష్‌ టెక్నాలజీ సంస్థకే పనులు దక్కేందుకు వీలుగా స్విస్‌ఛాలెంజ్‌లో ప్రతిపాదనలు అందించాల్సిన సంస్థలకుండాల్సిన అర్హతల్ని కూడా అందులో నిర్దేశించారు. సంబంధిత అంశంలో పదేళ్ల అనుభవముండాలని, గడచిన మూడేళ్లలో ఏడాదికి రూ.500 కోట్ల చొప్పున టర్నోవర్‌ ఉండాలని పేర్కొన్నారు. ఎస్‌ఏపీ శిక్షణ ఇచ్చే సంస్థలు రాష్ట్రంలో చాలా ఉన్నప్పటికీ, యాష్‌ టెక్నాలజీ సంస్థకే పనులు దక్కేలా చేసేందుకే ఈ నిబంధనలు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

కమీషన్లు దండుకోవడానికే!

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ థర్డ్‌ ఇయర్, ఎంబీఏ సెకండియర్‌ విద్యార్థులు దాదాపు 1.80 లక్షలమంది ఉన్నారు. వీరికి శిక్షణకోసం రూ.540 కోట్లు అవుతుంది. అసలు భారీ సంఖ్యలో విద్యార్థులకిచ్చే ఈ శిక్షణకు ఒక్కొక్కరికి అయ్యే రూ.30 వేల వ్యయాన్ని ఎవరు భరిస్తారు? ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు శిక్షణిచ్చేందుకు తగ్గ నిధులకు ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులున్నాయా? ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు ఈ శిక్షణ తప్పనిసరి చేయడం ద్వారా ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 వేల చొప్పున కోట్లాది నిధులు ఆ సంస్థకు కట్టబెట్టడానికేనా? ఎస్‌ఏపీ శిక్షణ ప్రతిచోటా అందుబాటులో ఉండగా విద్యార్థుల్ని యాష్‌ టెక్నాలజీస్‌ సంస్థ ద్వారానే శిక్షణ తీసుకోవాలని చెప్పడం వెనుక మతలబేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదంతా ఎస్‌ఏపీ శిక్షణ పేరిట కేవలం కమీషన్లు దండుకోవడానికేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. యాష్‌ టెక్నాలజీ అందించిన ప్రతిపాదనల్లో అనేక అనుమానాలు, సందేహాలున్నాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాటిని పెండింగ్‌లో పెట్టి వివరణ పంపాలని కమిషనర్‌కు రాసినా, దానికి స్పందించకపోగా నేరుగా నోటిఫికేషన్‌ విడుదల చేయడం వెనుక ప్రభుత్వ ముఖ్యుల హస్తముందని అంటున్నారు.

 

అనుమతి లేకుండా నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు?: ఆదిత్యనాథ్‌ దాస్‌

యాష్‌ టెక్నాలజీ సంస్థతో ఎస్‌ఏపీ శిక్షణకు స్విస్‌ఛాలెంజ్‌ ప్రతిపాదనలపై నోటిఫికేషన్‌ పిలవడంపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను వివరణ కోరగా... అసలు నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చిందంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యాష్‌ టెక్నాలజీ అందించిన ప్రతిపాదనల్లో అనుమానాలున్నందున వాటిని పెండింగ్‌లో పెట్టామని, వివరణకోసం సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌కు లేఖ రాశామని తెలిపారు. అవి వచ్చాక పరిశీలించి ప్రభుత్వం అనుమతిస్తేనే స్విస్‌ ఛాలెంజ్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వ అనుమతి లేకుండా కమిషనర్‌ ఎలా నోటిఫికేషన్‌ విడుదల చేశారో తనకు తెలియదని చెప్పారు. 

 

నాకా అధికారం ఉంది: పండాదాస్‌

దీనిపై సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ పండాదాస్‌ను వివరణ కోరగా స్విస్‌ ఛాలెంజ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి అక్కర్లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించగా.. తనకా అధికారం ఉందని బదులిచ్చారు. తాను ప్రతిపాదనలు మాత్రమే తీసుకుంటానని, అన్నీ పరిశీలించాక ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top