ఏపీ తీరుపై ‘సుప్రీం’ ఆగ్రహం!

Supreme Court fires on Government of Andhra Pradesh - Sakshi

కోర్టు ముందు అఫిడవిట్‌ దాఖలు చేయని ప్రభుత్వం

హాజరు కాని న్యాయవాదులు

తీవ్రంగా ఆక్షేపించిన ధర్మాసనం.. రూ.5 లక్షల జరిమానా

ఘన వ్యర్థాల నిర్వహణ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: ఘన వ్యర్థాల నిర్వహణ విధానాన్ని రూపొందించే విషయంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటి వరకు ఘన వ్యర్థాల నిర్వహణ పాలసీని రూపొందించలేదో అక్కడ జరిగే నిర్మాణాలన్నింటిపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. పాలసీ రూపొందించేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయంది. ఇదే సమయంలో ఘన వ్యర్థాల నిర్వహణ విధానం రూపొందించినదీ లేనిదీ అఫిడవిట్‌ రూపంలో తెలియచేయనందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మండిపడింది. అంతేకాక ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున ఎవరూ హాజరుకాకపోవడాన్ని ఆక్షేపించింది. ఇందుకు గానూ ప్రభుత్వానికి రూ.5 లక్షల జరిమానా విధించింది.

ఈ మొత్తాన్ని రెండు వారాల్లో సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని జువైనల్‌ జస్టిస్‌ వ్యవహారాల్లో వినియోగించాలని లీగల్‌ సర్వీసెస్‌ కమిటీకి స్పష్టం చేసింది. 2016లో ఘన వ్యర్థాల నిర్వహణ రూల్స్‌ వచ్చాయని, ఇవి వచ్చి రెండేళ్లు అవుతున్నా వాటికి అనుగుణంగా ఇప్పటి వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఘన వ్యర్థాల నిర్వహణ పాలసీని రూపొందించకపోవడం  శోచనీయమమని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రజల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పారిశుద్ధ్యం విషయంలో ఇప్పటికే ఓ విధానాన్ని రూపొందించి, రాష్ట్రం పరిశుభ్రంగా ఉండేలా చూసుకునే వారని వ్యాఖ్యానించింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నా.. ప్రభుత్వాలు ఘన వ్యర్థాల నిర్వహణ పాలసీని రూపొందించడం లేదంటూ పారిశుద్ధ్యం విషయంలో వారికి చిత్తశుద్ధి లేదని భావించాల్సి ఉంటుందని తెలిపింది. ఢిల్లీలో ఓ చిన్నారి డెంగ్యూతో మరణించడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2015లో జరిగిన ఈ ఘటనపై చలించిపోయిన సుప్రీంకోర్టు చిన్నారి మరణానికి అసలు కారణం ఏమిటో ఆరా తీసింది. అపరిశుభ్ర పరిసరాల కారణంగా డెంగ్యూ రావడమే ఆ చిన్నారి మరణానికి కారణమని తేలింది. దీంతో సుప్రీం ఈ మొత్తం వ్యవహారంపై సుమోటోగా విచారణ ప్రారంభించి 2015 నుంచి పర్యవేక్షిస్తోంది. ఘన వ్యర్థాల నిర్వహణ ఆవశ్యకతను తెలియచేస్తూ ఆ మేర రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు ఆదేశాలిస్తూ వస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top