ఎండ.. ప్రచండ!

Summer temperature Rising in PSR Nellore - Sakshi

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం

బెంబేలెత్తుతున్న ప్రజలు

మరో మూడు రోజులు ఇదే పరిస్థితి

సింహపురి నిప్పుల కుంపటిలా మారిపోయింది. రోహిణి కార్తెకు ముందే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం లేకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం జిల్లాలో 44.5 డిగ్రీల రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రత నమోదైంది.

నెల్లూరు(పొగతోట): ఆత్మకూరు, కావలి, ఉదయగిరి ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెల ప్రారంభం నుంచి భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రెండు, మూడు రోజులుగా ఎండలు తీవ్రత తార స్థాయికి చేరుకుంటున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల గతంలో ఎన్నడూ నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలో రానున్న మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.భానుడి భగభగలకు జనం భయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8 నుంచే సెగలు ప్రారంభమవుతున్నాయి. అధిక ఎండలతో నెల్లూరు నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో ముఖ్య కూడళ్లు జన సంచారం లేక బోసిపోతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలు దాటినా వేడి సెగలు తగ్గడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు వడదెబ్బకు గురయ్యే అవకాశం అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బయటకు వచ్చే వారు తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఓఆర్‌ఎస్‌తో పాటుగా మంచినీరు, మజ్జిగా అధికంగా తీసుకోవాలని తెలుపుతున్నారు. మరో మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రోహిణి కార్తె ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే 20 రోజులు ముందుగానే సూర్య ప్రతాపం మొదలైపోయింధి. అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. గతేడాది చలివేంద్రాలు అధికంగా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడం తదితర కారణాల వలన చలివేంద్రల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top