తాడేపల్లిగూడెంలో జిల్లా జైలు

Sub Jail Has Been Reopening In Tadepalligudem - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం : మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో అధునాతనంగా పట్టణంలోని విమానాశ్రయ భూముల్లో సబ్‌జైలు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు మూడెకరాల భూమిని జైళ్లశాఖకు కే టాయిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు భూమిని జిల్లా సబ్‌జైళ్ల అధికారి అప్పలనాయుడు పట్టణానికి వచ్చి ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించి వెళ్లారు.ప్రభుత్వ విధాన నిర్ణయాలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడితే ఈ జైలునే జిల్లా జైలుగా మార్చే విధంగా నిర్మాణాలు ఉంటాయని సమాచారం.

జిల్లాలో ఉన్న సబ్‌జైళ్లలో ఖైదీల సంఖ్యను పాత సంవత్సరాల ఆధారంగా తీసుకొని, నేర ప్రవృత్తి, సబ్‌జైళ్లకు పంపించే  రిమాండ్‌ ఖైదీలు, ముద్దాయిలు, నిందితులు ఎంత మంది ఉంటారనే అంచనాల ఆధారంగా అవసరమైన విధంగా కొత్త జైలును నిర్మించడంతో పాటు, ఖైదీలు పారిపోకుండా ఉండే విధంగా పక్కాగా రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జైళ్లశాఖ డీజీ పర్యవేక్షణలో పోలీసు హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఇక్కడి జైలు నిర్మాణ పనులకు అధికారిక ఆమోదం అనంతరం పనులు చేపట్టనున్నారు. స్థల బదలాయింపు వ్యవహారం ఏడెనిదిమిది నెలల క్రితం పూర్తి కావాల్సి ఉంది.

ఈలోపు ఎన్నికలు రావడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో స్థల బదలాయింపు ఆలస్యం అయ్యింది. గతంలోనే కొత్త జైలు నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లడం, కొత్తగా ప్రస్తుతమున్న తాలూకా ఆఫీస్‌ ప్రాంగణం నుంచి విమానాశ్రయ భూములకు సబ్‌జైలును తరలించే విధంగా,  కొత్త జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. పాత సబ్‌జైలులో అసౌకర్యాలు ఉండటం, పల్లపు ప్రాంతంగా ఉండటంతో వానలు కురిసిన సమయంలో నీరు బ్యారక్‌లలోకి వెళ్లడంతో జైలులో కొత్తగా పనులు చేపట్టాలని అంచనాలు వేశారు.

పనుల కోసం టెండర్లు పిలిచే సమయంలో ఈ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోవడంతో జైలులోని రక్షణ వ్యవహారంలో డొల్లతనం బహిర్గతమైంది.ఇద్దరు ఉద్యోగులపై వేటు కూడా పడింది. ఈ నేపథ్యంలో నూతన ప్రతిపాదన ఆధారంగా పట్టణానికి దూరంగా మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో సబ్‌జైలు నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈలోపు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రక్రియ ఆలస్యమైంది. భూ బదలాయింపు వ్యవహారం పూర్తి కావడంతో, ని ర్మాణ ప్రతిపాదనల కోసం పైలు జైళ్లశాఖ డీజీకి జిల్లా సబ్‌జైళ్ల శాఖ నుంచి వెళ్లనుంది. వెళ్లిన తర్వాత నిర్మాణ ప్రతిపాదనలు, బడ్జెట్‌ కేటా యింపు, ప్లానుల ఆమోదం అనంతరం టెండర్లు పనుల కోసం పిలువనున్నారు. 

జిల్లాజైలుగా నిర్మించే అవకాశం 
ఇక్కడ త్వరలో నిర్మించబోయే సబ్‌జైలును జిల్లాజైలుగా కూడా నిర్మించే  అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వి«ధాన నిర్ణయాలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటైతే గూడెంలోనే జిల్లా జైలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టెండర్లు పిలిచే సమయంలో ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే  వీలుంది. 

తణుకు సబ్‌జైలుకు ఖైదీలు 
తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఖైదీలను తణుకు సబ్‌జైలుకు పంపుతున్నారు. వాస్తవానికి 2017 సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి ఖైదీలను తణుకు సబ్‌జైలుకు పంపిస్తున్నారు. 2017 సెప్టెంబర్‌ 10వ తేదీన గూడెం సబ్‌జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఖైదీలకు క్షురకర్మ చేయించడానికి బ్యారక్‌ల నుంచి బయటకు తీసిన సమయంలో కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని బేతవోలు గ్రామానికి చెందిన సిరపు గణేష్, అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని నందలపాడుకు చెందిన బుగత శివ గూడెం సబ్‌జైలు నుంచి పారిపోయారు.

ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఇద్దరు సిబ్బందిని అప్పట్లో సస్పెండ్‌ చేశారు. ఘటన తర్వాత సబ్‌జైలును పరిశీలించిన అధికారులు ఖైదీలను ఉంచడానికి తాడేపల్లిగూడెం సబ్‌జైలు సరికాదని గుర్తించారు. అదేనెల 14న తాడేపల్లిగూడెం సబ్‌జైలును మూసివేస్తూ, ఖైదీలను తణుకు సబ్‌జైలుకు తీసుకెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రెండేళ్లుగా సబ్‌జైలు ఖైదీలను తణుకు తీసుకెళుతున్నారు. కొత్త జైలు నిర్మించే వరకు తణుకే తీసుకెళ్లాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top