బలవంతపు లక్ష్యాలతో కలవరం

Students Suicde With Stress - Sakshi

ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థులు

యాజమాన్య వేధింపులు.. తల్లిదండ్రుల ధోరణి కారణమే

ఆందోళన వ్యక్తం చేస్తున్న మానసిక వైద్య నిపుణులు

బావి ఆశల సౌధాలు కూలిపోతున్నాయి.. కలలుగా మిగిలిపోతున్నాయి.. కార్పొరేట్‌ చదువులు శాపాలవుతున్నాయి.. చిన్నారులు చదువుల సంద్రాన్ని ఈదలేకపోతున్నారు.. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేక.. ఒత్తిడిని జయించలేక అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ప్రస్తుతం కళాశాల విద్యార్థులఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.       

లబ్బీపేట(విజయవాడ తూర్పు) : ‘గుడివాడకు చెందిన పనీష్‌చౌదరి నగర శివారులోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏమి జరిగిందో ఏమో కానీ మంగళవారం తాను ఉన్న రూమ్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాజమాన్య వేధింపులతోనే మా అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి, మేనమామ ఆరోపిస్తున్నారు’.
‘ఆగిరిపల్లిలోని ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగు కళాశాలలో చదువుతున్న ఎం.సాయికృష్ణ మంగళవారం ఉదయం నగరంలోని బుడమేరు వంతెన సమీపంలోన రైలు పట్టాలపై విగతజీవుడై కనిపించాడు. పదిహేను రోజులుగా కళాశాలకు వెళ్లడం లేదు.  రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇలా వీరిద్దరే కాదు.. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థులు చదువులో ఒత్తిడిని ఎదుర్కొంటూ.. ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్చితే చదవలేక పోతున్నామని ఆవేదనతో జీవితాలను ముగిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

యాజమాన్యాల ఒత్తిళ్లే కారణమా..
ఇంటర్మీడియెట్‌లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు బట్టీ చదువులతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. వేకువజాము నుంచే పుస్తకాలతో కుస్తీ పట్టించడం, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులకు సహచర విద్యార్థుల ముందు పనిష్‌మెంట్‌లు ఇవ్వడంతో మనోవేదనకు గురవుతున్నారు. జైళ్ల లాంటి హాస్టళ్ల నుంచి బయటపడలేక, చదువులో రాణించలేక  చావును ఎంచుకుంటున్నారు.

ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం..
ఎల్‌కేజీ నుంచి చిన్నారులకు ఐఐటీ ఫౌండేషన్‌ పేరుతో ఇతర వ్యాపకాల వైపు దష్టి పెట్టకుండా నిరంతరం చదువు అనే విధానంలో మార్పు రావాల్సి ఉంది. విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్‌ పెంచడంతో పాటు, రిలేషన్స్, రెస్సాన్స్‌బిలీటీల ప్రాముఖ్యత వారికి వివరించాలి. జీవితంలో చదువు ఒక భాగం మాత్రమేనని వారి తెలియచెప్పాలి. చదువుతో పాటు, క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేలా చూడాలి. అప్పుడు ఓటమి చెందినా.. విజయం అనేది ముందు ఉందనే విషయాన్ని వారు గ్రహిస్తారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందనేది నిపుణుల అంచనా.

తల్లిదండ్రులోనూ మార్పు రావాలి..
పిల్లల సామర్థ్యాన్ని తెలుసుకోకుండా, ఆకాంక్షలను వారిపై రుద్దడం సరైన విధానం కాదు. పదో తరగతి పూర్తయిన తర్వాత, ఏ కోర్సులో చేర్చితే బాగా రాణిస్తారనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకోవాలి.  పదో తరగతిలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఇంటర్‌లో చేర్చడంతో అక్కడ రాణించలేక చతికిల పడుతున్నారు. స్కూల్‌ ఎడ్యుకేషన్, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌లో తేడా ఉందనే విషయాలను తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది.

పిల్లల ప్రవర్తనతెలుసుకోవాలి
చదువులో ఎలా రాణిస్తున్నారు , వారి ఎమోషన్స్‌ ఎలా ఉన్నాయనే అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ కొంత సమయాన్ని తల్లిదండ్రులు పిల్లలతో  గడుపుతూ ఉండాలి. ఆ సమయంలో పిల్లలు ఎదుర్కొంటున్న విషయాలను వారికి తెలియచేసే అవకాశం ఉంటుంది. వసతిగహాల్లో ఉంటున్న వారిని తరచూ కలుస్తూ ఉండాలి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారిని ముందుగానే గుర్తించవచ్చు. నిరుత్సాహంగా ఉండటం, నలుగురిలో కలవక పోవడం వంటివి చేస్తారు. అలాంటి వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం ద్వారా వారి ఆలోచనల నుంచి బయటకు వచ్చేలా చేయాలి .– డాక్టర్‌ గర్రే శంకర్రావు, ఉపాధ్యక్షుడు,ఏపీ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top