చదవలేక.. చావు లేఖ

చదవలేక.. చావు లేఖ - Sakshi


► తల్లిదండ్రులూ మారండి.. మీ పిల్లల భవితను మార్చండి

►పైసాలో పుస్తకాలు వేతికే కార్పొ‘రేట్‌’లను నమ్మకండి..

►పిల్ల ఆలోచనలకు విలువనివ్వండి

►విద్యార్థులూ.. మీ సాధక బాధకాలను అమ్మానాన్నతో పంచుకోండి..

►బంగారు భవితను నాశనం చేసుకోకండి




అక్షరాలను ఆస్వాదిస్తారనుకుంటే.. అంతులేని విషాదాన​ఇన నింపుతున్నారు.. ఊరికి పేరు తెస్తారనుకుంటే.. ఉరికొయ్యలకు వేలాడుతున్నారు.. ఆకాశమంత ఎత్తు ఎదుగుతారనుకుంటే.. చివరికి మట్టిలో కలిసిపోతున్నారు.. కనికరంలేని కార్పొ‘రేట్‌’ కాలేజీల ఒత్తిడి కొరడా ఝుళిపిస్తుంటే.. చదవలేక చావును కోరుకుంటున్నారు విద్యార్థులు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ విషానికి విరుగుడు కావాలి.  భావిభారత పౌరుల మరణ రాతకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. -లబ్బీపేట(విజయవాడ తూర్పు)







కృష్ణాజిల్లా, గూడవల్లి  నారాయణ కాలేజీలో వారంతపు పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదని అధ్యాపకులు చితకబాదడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ తమ కుమారుడిని కళాశాల యాజమాన్యం​ హత్య చేసిందని ఈశ్వర్‌రెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.



కృష్ణా జిల్లా, కోడూరు మండలం మందపాకలకు చెందిన శివసాయి మణికంఠ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతన్ని బాగా చదివించాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. కానీ, అతను చదువులో రాణించలేక, తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చలేక పోతున్నానని  మనస్థాపం చెంది మరణ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.



అమ్మానాన్న.. నన్ను క్షమించండి ఇష్టం లేకుండా చదువుతూ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నానంటూ నాలుగు రోజుల కిందట గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి దుర్గాసతీష్‌నాయుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.



ఈ ముగ్గురే కాదు.. అనేక మంది విద్యార్థులు చదువులో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ.. ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి తనను కార్పొరేట్‌ కళాశాలలో చేర్చితే చదవలేక పోతున్నామని ఆవేదనతో జీవితాలను ముగిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య క్రమేణా పెరడగం ఆందోళన కలిగించే అంశం.



కనికరం లేని కార్పొరేట్‌లు వద్దు..

కార్పొరేట్‌ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. వేకువజామున 5 నుంచి 10 గంటల వరకూ పుస్తకాలతో కుస్తీ పట​‍్టాల్సిన దుస్థితి ఏర్పడింది.  మధ్యాహ్నం, రాత్రివేళ భోజనం కూడా ఉరుకులు పరుగుల మీద మెస్‌కు వెళ్లి చేయాల్సిందే. రోజులో కనీసం అర్ధగంట కూడా విశ్రాంతి దొరకదు. క్రీడలు అసలు తెలియవు. వినోదం పేరే వినిపించదు. వారానికోసారి నిర్వహించే వీకెండ్‌ టెస్ట్‌లో మార్కులు తగ్గాయంటే తరగతి గది మారిపోవాల్సిందే. అప్పటివరకు మెరిట్‌ విద్యార్దులతో ఉన్నవారు ఒక్క వారంలో మార్కులు తగ్గితే డల్లర్స్‌​ సెక్షన్స్‌కు మార్చేస్తారు. వసతీ గృహాల్లో ప్రతిఫ్లోర్‌కు ఒక ఇన్‌చార్జిని నియమించి, వారిన బలవంతంగా చదివేలా ఒత్తిడి చేస్తుంటారు. అనారోగ్యంగా ఉందని చెప్పినా వదలకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పొడుతున్నారు.



తల్లిదండ్రుల ధోరణి మారాలి

పిల్లల సామర్ధ్యాన్ని తెలుసు కోకుండా, ఆకాంక్షలను, ఆశయాలను వారిపై రుద్దడం సరైన విధానం కాదు. పదో తరగతి పూర్తయిన తర్వాత, ఏకోర్సులో చేరితే రాణిస్తారనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకోవాలి. వారికి ఇష్టంలేని కోర్సుల్లో చేర్చడంపై సరైన విధానం కాదు. పదో తరగతిలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని అంటర్మీడియెట్‌లో చేరడంతో అక్కడ కూడా రాణించలేక చతికిల పడుతున్నారు. స్కూల్‌, కాలేజీ ఎడ్యుకేషన్‌లో తేడా ఉందనే విషయాలను తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది. ఆస్తులు అమ్మి అయినా అబ్బాయిని డాక్టర్‌ను చదివించాలనే ఆలోచన కంటే.. అబ్బాయి రాణిస్తున్నాడు, ప్రోత్సహిద్దామనే ధోరణిని అలవరచుకోవాలి.



టీచర్లు పాఠాలు నేర్పాలి

ఐఐటీ ఫౌండేషన్‌ పేరుతో ఎల్‌కేజీ నుంచి చిన్నారులను నలిపేస్తున్నారు. విద్యార్ధుల్లో  కాన్ఫిడెన్స్‌ పెంచడంతో పాటు రిలేషన్స్‌, రెస్పాన్సిబిలిటీ ప్రాధాన్యాన్ని వారికి వివరించాలి. జీవితంలో చదువు భాగం మాత్రమేనని వారికి తెలియజెప్పాలి. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేలా చూడాలి. అప్పటికి ఓటమి చెందినా.. విజయం అనేది ముందు ఉందనే విషయాన్ని వారు గ్రహిస్తారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్దుల్లో ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందనేది నిపుణుల అంచనా. జీవితంలో గెలుపోటములు సహజం అనే ధోరణిలో విద్యార్థులు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.



ఇతరులతో పోలిక తగదు

పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇతరులతో పోల్చి మాట్లాడటం సరికాదు. ‘ఫలానా వ్యక్తికి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఆస్తులు అమ్మి చదివిస్తున్నా. ఇవేం మార్కులు.. అని తల్లిదండ్రులు అనడంతో పిల్లల తీవ్ర మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. మార్కులు తక్కువ వచ్చినా, ఈసారి ఇంకా మంచి మార్కులు సాధిస్తావు అని ప్రోత్సహించాలి. అంతేకానీ వారిని నిరుత్సాహపరిచేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాట్లాడకూడదు. పిల్లల్లో కాన్ఫిడెన్స్‌ పెంచి, మంచి ఆలోచనలతో ముందుకు సాగేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది.



ఒత్తిడిన తట్టుకునే శక్తి లేక..

నేటి విద్యార్దుల్లో ఒత్తిడిని తట్టుకునే శక్కి ఉండట్లేదు. గెలుపోటములను తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని చిన్నప్పటి నుంచి వారిలో పెంచాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదైనా విషయాన్ని చెప్పనప్పుడు సిల్లీగా తీసుకోకుండా స్పందించాల్సిన అవసరం ఉంది.

                          - డాక్టర్‌ విశాల్‌రెడ్డి, పిల్లల మానసిక వైద్య నిపుణుడు



తల్లిదండ్రులే మారాలి..

మొదట తల్లిదండ్రుల ఆలోచనాధోరణిలో మార్పు రావాలి.  తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు కాలేజీల్లో చేరుస్తుండటంతో తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. చదువు ఒక్కటే జీవితం కాదనే విషయాన్ని వారికి తెలియజెప్పాలి. బంధాలు, బాధ్యతల ప్రధాన్యతను వివరిస్తే ఫలితం ఉంటుంది. ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

                                        - డాక్టర్‌ విమల, సైకాలజిస్ట్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం



పిల్లలతో బంధం పెంచుకోండి

పిల్లలు చదువులో ఎలా రాణిస్తున్నారు. వారి ఎమోషన్లు ఎలా  ఉన్నాయనే అంశాలపై తల్లిదండ్రులు, ఉపధ్యాయులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రోజులో కొంత సమయాన్ని తల్లిదండ్రులు పిల్లలతో గడపాలి. ఆ సమయంలో పిల్లలు తాము ఎదుర్కొంటున్న విషయాలను తల్లిదండ్రులకు తెలియజేసే అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా వారి ఆలోచనల నుంచి బయటకు వచ్చేలా చేయోచ్చు.

                      -డాక్టర్‌ టీఎస్‌ రావు, సైకాలజిస్ట్‌, రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేసన్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యుడు, విజయవాడ.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top