నారాయణలో ఫీ'జులుం'

Student mother committed suicide because of  Fee Payment - Sakshi

ఫీజు కోసం తీవ్రంగా ఒత్తిడి చేయడంతో విద్యార్థి తల్లి ఆత్మహత్యాయత్నం 

ప్రిన్సిపాల్‌ తనపై దాడి చేశాడంటూ తిరుపతిలో విద్యార్థి తండ్రి ఆందోళన  

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ)/తిరుపతి ఎడ్యుకేషన్‌ : నారాయణ కళాశాలల్లో ఫీజుల జులుం మరోసారి వెలుగు చూసింది. విజయవాడలో ఫీజు కోసం ఒత్తిడి చేయడంతో అవమానంగా భావించిన ఓ విద్యార్థి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోబోగా, తిరుపతిలో ఫీజు బకాయి విషయంలో ప్రిన్సిపాల్‌ తనపై దాడి చేశాడంటూ ఓ విద్యార్థి తండ్రి ఆందోళనకు దిగాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మెట్టగూడెంకు చెందిన కల్యాణం సునీత తన కుమారుడితో కలిసి మొగల్రాజపురంలో  నివాసముంటోంది.  స్థానికంగా ఉన్న నారాయణ ఒలంపియాడ్‌ క్యాంపస్‌లో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

ఏడాదికి ఫీజు రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది.  ఫీజులో ఐదువేలతో పాటు యూనిఫామ్, పుస్తకాల కోసం మరో రూ.16 వేలు చెల్లించింది. మిగిలిన రూ.80 వేలలో 60 శాతం మొత్తాన్ని డిసెంబర్‌ లోపు చెల్లిస్తానని ఆమె యాజమాన్యానికి వివరించింది. బాబుకు అడ్మిషన్‌ నెంబర్‌ ఇస్తే పరీక్షలకు హాజరవుతాడని బతిమలాడింది. అయితే మొత్తం ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్‌ నంబర్‌ ఇస్తామని మొండికేశారు. ఈ నేపథ్యంలో పిల్లవాడు నలుగురిలో ఇబ్బందులు పడటంతో ఆమె తీవ్రంగా మానసిక సంఘర్షణకు గురైంది. సోమవారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీ 51వ కానా వద్ద నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. పాదచారులు ఆమెను అడ్డుకుని స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారమందించారు. ఆమెను స్టేషన్‌కు తరలించి  సీఐ కాశీవిశ్వనాథ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

తిరుపతిలో ఫీజు బకాయి వివాదం 
తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్‌ పట్టణంలోని గాంధీ రోడ్డులోని నారాయణ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం నారాయణ రెసిడెన్షియల్‌ కళాశాలలో చదివాడు. ఈ ఏడాది డే స్కాలర్‌గా గాంధీ రోడ్డులోని కళాశాలలో చేరాడు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి రూ. 15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంది. దీంతో బకాయి ఫీజు చెల్లించాలంటూ సోమవారం నితిన్‌ను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించేసింది. కుమారుడిని వెంటబెట్టుకుని కళాశాలకు వచ్చిన గోవిందరెడ్డి, ప్రిన్సిపాల్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ తనపై దాడి చేశాడంటూ గోవిందరెడ్డి కళాశాల ఎదుటే ఆందోళనకు దిగాడు. మొదటి ఏడాది ఫీజు బకాయి చెల్లించకపోవడంతో తండ్రిని తీసుకురావాలని నితిన్‌ను ఇంటికి పంపించిన విషయం వాస్తవమేనని, గోవిందరెడ్డిపై తాము దాడి చేయలేదని ప్రిన్సిపాల్‌ వివరించారు. పోలీసులు ఇరువర్గాలను విచారించి, ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పడంతో విద్యార్థి తండ్రి ఆందోళన విరమించాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top