జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: హోంమంత్రి

State Home Minister And Nellore District Incharge Mekothoti Sucharita Said I Am Doing My Best To Promote Nellore District - Sakshi

జిల్లా అభివృద్ధిపై  సమీక్ష

సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి

తాగునీటి ఎద్దడిని నివారించాలని ఎమ్మెల్యేల వినతి 

పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వైనం  

సాక్షి, నెల్లూరు(అర్బన్‌): ‘ప్రజలకు పారదర్శక పాలన అందిస్తాం. జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా’ అని రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మేకతోటి సుచరిత తెలిపారు. జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న నూతన జెడ్పీ శనివారం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా నీటి సమస్యను ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్రంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోం మంత్రిమేకతోటి సుచరిత, హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. ఈ విషయంలో సీఎం ఎంతో పట్టుదలతో ఉన్నారన్నారు. పేదలకు విద్య, వైద్యం అందాలన్నదే ఆయన ధ్యేయమని చెప్పారు. ఉగాది నాటికి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని, అభివృద్ధి – సంక్షేమాన్ని సమంగా చూస్తామని తెలిపారు. సచివాలయాలతో ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పారు. పారదర్శకంగా పాలన అందిస్తామన్నారు.పాఠశాలలు, గ్రామాలు, వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

 జిల్లా సైన్స్‌ సెంటర్‌ను సైతం అభివృద్ధి చేస్తామన్నారు.జిల్లాలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని  రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో భూగర్భ, తాగునీటి పథకాలకు హడ్కో లోన్‌ ఇచ్చిందని, దీనికి సంబంధించి ఈ సంవత్సరం రూ.180 కోట్లు చెల్లించాలన్నారు. ఇది కార్పొరేషన్‌కు మోయలేని భారమని చెప్పినా నాటి పాలకులు వినలేదని విమర్శించారు. కార్పొరేషన్‌ను అప్పుల నుంచి బయటపడేసే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.  సమావేశంలో తొలుత  కలెక్టర్‌ శేషగిరిబాబు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిపై వివరణ ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతిని కోరారు. దీంతో ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే కాలానికి 50 గ్రామాల్లో నీటిని టాంకర్ల ద్వారా సరఫరా చేశామన్నారు. ఈ సంవత్సరం తీవ్ర  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 423 గ్రామాల్లో తాగునీటిని టాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లుగా చెప్పారు. భూగర్భజలాలు అందుబాటులో లేవన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌రావు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం తమ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వివరించారు.

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ అధికారులు తాగునీటి ఎద్దడిపై నివేదిక తయారుచేస్తూ కలువాయి, డక్కిలి తదితర మూడు మండలాలను ఏ ప్రాతిపాదికన విస్మరించారని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడైనా సక్రమంగా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పుడు తయారుచేసే నివేదికలో అన్ని ప్రాంతాలు కవర్‌ చేసినట్టుగా తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం మంజూరుచేసిన నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి నిధులు రానున్నందున ఈలోగా తాగునీటి బోర్లు, ఇతర మరమ్మతులకు ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలని కోరారు.    

20 ఎకరాలను పోలంరెడ్డి కబ్జా చేశారు
నా నియోజకవర్గంలోని బొడ్డువారిపాళెంలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన నిషిద్ధ భూములు 20 ఎకరాలున్నాయి. వీటిని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కబ్జా చేశారు. తండ్రి, అత్తల పేరుతో పట్టాలు పుట్టించాడు. తహసీల్దారు అడంగళ్‌లో పేర్లు ఎక్కించి పోలంరెడ్డికి పట్టాలు ఇచ్చారు. ఇది సిగ్గు చేటు. ఆ భూములను తీసుకుని పేదలకు పంచాలి. పాఠశాలల్లో మధ్యాహ్నం పెడుతున్న భోజనంలో రాళ్లు, పురుగులు ఉంటున్నాయి. గత ప్రభుత్వం విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇలా జరిగేందుకు వీలు లేదు. వెంటనే మంచి బియ్యాన్ని సరఫరా చేయాలి. కబ్జా భూముల విషయమై జేసీ వెట్రిసెల్వి స్పందించి ఇచ్చిన పట్టాలను రద్దు చేయిస్తామన్నారు. 
– నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కోవూరు 

ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా కొత్తవారిని నియమించాలి
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు అవినీతికి కేరాఫ్‌గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టే విధంగా మారారు. మారారు. అందువల్ల ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి కొత్తవారిని నియమించాలి. ఇదే విషయమై ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ గత ప్రభుత్వం అసలైన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తీసేసి వారి స్థానంలో దోపిడీకి ఉపయోగపడే టీడీపీ కార్యకర్తలను నియమించుకుంది. వెంటనే ప్రక్షాళన చేయాలి. 
– ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే, వెంకటగిరి 

టౌన్‌ బస్సులు నడిచేలా చూడాలి
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్ల ల సంఖ్య పెరిగింది. అయితే నెల్లూరు జిల్లాలోనే అతి తక్కువగా ఉంది. ఇక్కడ టీచర్లుండే చోట విద్యార్థులు లేరు. విద్యార్థులు ఎక్కువగా ఉండే చోటకు టీచర్లు వెళ్లడం లేదు. రెండు కిడ్నీలు బాగోలేనివారికి డెప్యుటేషన్‌ వేయమన్నా వేయని అ«ధికారులు బాగున్న వారికి ఎందుకు వేస్తున్నారు. డీఈఓ సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితిని కలెక్టర్‌ చక్కదిద్దాలి. కేంద్రీయ విద్యాలయానికి టౌన్‌ బస్సులు నడిచే విధంగా చూడాలి. 
– వి.బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ

తెలుగుగంగ ద్వారా నీరివ్వాలి
సూళ్లూరుపేట ప్రాంతానికి స్వర్ణముఖి మినహా ఇక ఎలాంటి నీటి ఆధారం లేదు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలుగుగంగ కాలువలను పొడిగించి తమ ప్రాంతవాసులను ఆదుకోవాలి. అలాగే చెరువులను పూడిక తీయించి నీటితో నింపాలి. 
– కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యే, సూళ్లూరుపేట 

గూడూరును గ్రేడ్‌ –1 మున్సిపాలిటీగా మార్చాలి
గూడూరును గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాలి. ఇందువల్ల గూడూరుకు రూ.100 కోట్లు నిధులు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. తెలుగుగంగ ద్వారా నీరందించాలి. 
– వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యే, గూడూరు  

పనులు పూర్తయ్యేలా చూడాలి
నెల్లూరు నగరంలో గత ప్రభుత్వం తాగునీటి పథకానికి, భూగర్భ డ్రెయినేజీకి రూ.1,100 కోట్ల నిధులతో పనులు ప్రారంభించింది. పనులు నాసిరకంగా జరిగాయి. రూ.300 కోట్ల సిప్‌ నిధులతో రోడ్లు ప్రారంభించారు. పనులు కూడా సుమారు 90 శాతం పూర్తయ్యాయి. బిల్లులు 80 శాతం వరకు ఇచ్చినా కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. పబ్లిక్‌హెల్త్‌ అధికారులు, కార్పొరేషన్‌ అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు 100 శాతం పూర్తయ్యేలా చూడాలి.  
– కోటంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్‌   

లోపాలను సరిదిద్దాలి
జిల్లాలో రైతులు పంటలు వేసుకునేందుకు విత్తన కొరత లేకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలి. రాయితీలు పొందేందుకు గత ప్రభుత్వం రైతులకు బయోమెట్రిక్‌ పద్ధతిని ప్రవేశపెట్టిందన్నారు. అన్ని గ్రామాల్లో పాస్‌పుస్తకాలతో అధికారుల వద్దకు వెళ్లలేని ముసలివారు ఉన్నారు. వారు బయోమెట్రిక్‌ వేద్దామన్నా వేలిముద్రలు పడడంలేదు. అధికారులు పాస్‌పుస్తకాల్లో బిడ్డల పేర్లు ఉండేలా మార్చుకుని రావాలని అంటున్నారు. ఇదేలా సాధ్యం?. ఈ లోపాలను సరిదిద్దాలి. అదేవిధంగా విద్యుత్‌ సంస్థలో ఏఈలు, ఇతర సిబ్బంది అతి తక్కువగా ఉన్నారు. నూతన ప్రభుత్వం పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేయమన్నా కొన్నిచోట్ల అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. 
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, సర్వేపల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top