ఆ 750 మద్యం దుకాణాలను ప్రారంభించండి

Start those 750 liquor stores - Sakshi

జిల్లా సంయుక్త కలెక్టర్లతో నోటిఫికేషన్‌ జారీ చేయించండి

అధికారులకు ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబర్‌ చివరి వరకు కొనసాగించుకునేలా అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని 750 మద్యం షాపుల్ని వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెన్యువల్‌ చేసుకోని షాపుల్ని వెంటనే ప్రారంభిస్తే.. ప్రభుత్వమే మద్యం షాపుల్ని ఎలా నిర్వహించాలో, ఇబ్బందులు, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణాలను అక్టోబర్‌ నుంచి ఏర్పాటు చేస్తుండటంతో పొడిగించిన లైసెన్సులను రెన్యువల్‌ చేసుకునేందుకు మద్యం వ్యాపారులు సుముఖత చూపలేదు. రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులుంటే 750 షాపులు లైసెన్సులను రెన్యువల్‌ చేసుకోలేదు. వీటిలో 130 మద్యం దుకాణాల్ని ఆగస్టు మొదటి వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు తొలుత నిర్ణయించారు. అయితే.. ఎక్సైజ్‌ అధికారులకు అనుభవం ఉంటుందని.. రెన్యువల్‌ చేసుకోని అన్ని మద్యం షాపుల్ని నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను పంపిస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు.

ఆయా జిల్లాల్లో నోడల్‌ అధికారులుగా జిల్లా సంయుక్త కలెక్టర్లను నియమించడంతో జేసీలతో నోటిఫికేషన్‌ జారీ చేయించేలా ఎక్సైజ్‌ అధికారులు చొరవ చూపించాలని సూచించారు. త్వరలో అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని, వీరిని నియమించే కాంట్రాక్టు ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆయా జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు (జేసీలు) నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top