ఆటే చివరి మజిలీ

sports teacher death in DSA indore stadium - Sakshi

డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో తుది శ్వాస విడిచిన ఉపాధ్యాయుడు

విజయనగరం మున్సిపాలిటీ : ఆటే ఆయనకు చివరి మజిలీ అయింది. నిత్యం  చిన్నారులకు పాఠ్యాంశాలను బోధించే ఆ ఉపాధ్యాయుడు రోజూ క్రమం తప్పకుండా ఆడే ఆట వద్దనే తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో తోటి క్రీడాకారులు హతాశులయ్యారు. జిల్లా బ్యాడ్మింటన్, సిటీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యులు అందించిన వివరాల ప్రకారం పట ్టణంలోని కామాక్షినగర్‌ ప్రాంతంలో గల పైడిమాండ కాలనీలో నివాసముంటున్న చొక్కాకుల మహేశ్వరరావు (48) బొండపల్లి మండలం ఒంపిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. రోజూ మహేశ్వరరావు విజయనగరం పట్టణంలో గల డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం ఆవరణలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడేందుకు వస్తుంటారు. అదే తరహాలో సోమవారం కూడా రెండు గేమ్‌లు ఆడిన అనంతరం విరామ సమయంలో కుర్చీలో సేదతీరారు. ఈ క్రమంలో వేరే క్రీడాకారుల బృందం అదే కోర్టులో ఆట ప్రారంభించి... ముగించేసుకున్న తరువాత మహేశ్వరరావును ఆటకు రమ్మంటూ పిలిచారు. అయితే అతని వద్ద నుంచి స్పందన లేకపోవటంతో దగ్గరకు వెళ్లి నిశితంగా పరిశీలించారు.

అప్పటికే అపస్మారకస్థితిలో ఉన్నట్లు గమనించి హుటాహుటిన స్థానిక తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి చనిపోయినట్టు నిర్థారించటంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. చనిపోయిన మహేశ్వరరావుది స్వస్థలం రాచకిండాం కాగా... ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా మహేశ్వరరావు మృతి పట్ల జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌తో పాటు సిటీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరఫున వై.కుసుంబచ్ఛన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయటంతో పాటు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఉదయం స్టేడియం ఆవరణలో  నిర్వహించే సంతాప సభకు క్రీడాకారులంతా హాజరుకావాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top