ఆస్తి రాయించుకుని అనాథను చేశారు

Sons force Mother to Move Out of Their Home In Addanki Prakasam - Sakshi

సాక్షి, అద్దంకి: మాయ మాటలతో మభ్యపెట్టి ఆస్తి రాయించుకుని ఆనక కొడుకులు తల్లిని నిలువునా బయటకు నెట్టేశారు. చేసేది లేక ఆ వృద్ధ తల్లి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగింది. ఈ సంఘటన పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం..కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన భోజనపల్లి ప్రసాదరావు, ధనలక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కోటేశ్వరరావు, శంకరరావు, వెంకట సుబ్బారావు, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. ప్రసాదరావు తనకు ఉన్న ఆస్తిని నాలుగు భాగాలుగా చేసి ముగ్గురు కుమారులు, భార్యకు సమానంగా రాసి ఇచ్చాడు. ప్రసాదరావు మరణంతో ఒంటరిగా ఉన్న తల్లిని పెద్ద కుమారుడు కోటేశ్వరరావు, చిన్న కుమారుడు వెంకట సుబ్బారావులు చేరదీసినట్లు నటించారు. తమ పిల్లల చదువు కోసం బ్యాంకులో రుణం కావాలంటే హమీ సంతకం పెట్టాలంటూ సుమారు 70 ఏళ్ల తల్లికి మాయమాటలు చెప్పారు.

ఆమె వద్ద సంతకాలు తీసుకున్నారు. అనంతరం బంగారం, నగదు మొత్తం సుమారు రూ.25 లక్షల మేర ఆస్తిని అన్నదమ్ములిద్దరూ చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి ఆమెను సరిగ్గా చూడకుండా కొడుకులు, కోడళ్లు వేధించసాగారు. ఆ వృద్ధ తల్లి జరిగిన విషయం తెలుసుకునేలోపు ఆలస్యమైంది. తన ఆస్తి తీసుకుని మోసం చేస్తారా..అంటూ ధనలక్ష్మి తన కొడుకులు, కోడళ్లను నిలదీసింది. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఆమె దుస్తులు సైతం బయటకు విసిరేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ధనలక్ష్మి రెండో కుమారుడు శంకరరావు సాయంతో అద్దంకి మెయిన్‌ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో చిన్న కుమారుడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top