అక్రమాలకు ఖాకీ సాయం!

Some Police Officers Are Supporting To Cricket Betting And Matka Gangs In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం సెంట్రల్‌ : పోలీసుశాఖలో కొంత మంది అడ్డదారులు తొక్కడం మానలేకపోతున్నారు. గతంలో జిల్లాలో మట్కా, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలను తెరవెనుక పెంచి పోషించిన కొంతమంది అక్రమార్కులు నేటికీ అదే పంథాను కొనసాగిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై రాజీ పడకూడదని కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే హితబోధ చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా సీఎం అడుగుజాడల్లో నడుస్తూ అక్రమాలను అరికట్టడంపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో మట్కాకు కేరాఫ్‌గా మారిన తాడిపత్రిని జిల్లా ఎస్పీగా బూసారపు సత్యయేసుబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రక్షాళన చేశారు. తాడిపత్రిలో మట్కాతో సంబంధాలున్న ఏడుగురు కానిస్టేబుళ్లను ఒకేసారి వీఆర్‌కు పంపుతూ ఎస్పీ సత్యయేసుబాబు గత నెలలో నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీరితో పాటు మరికొంత మంది అధికారులను సైతం తప్పించారు. అలాగే కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

ఒకే డిపార్ట్‌మెంట్‌లో సహచరుడు మృతి చెందితే సానుభూతి తెలపడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అప్పటి  ట్రాఫిక్‌ ఎస్‌ఐ నగేష్‌బాబు నిందితున్ని తప్పించేందుకు యత్నించాడు. రూ. 4వేలు ఆర్టీసీ డ్రైవర్‌ నుంచి వసూలు చేసినట్లు ఎస్పీ విచారణలో తేలడంతో ఏకంగా సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇవి మాత్రమే కాదు పోలీసుశాఖలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని, పోలీసుస్టేషన్‌లలో లంచాలకు పాల్పడుతున్న వారిపై సైతం ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. స్టేషన్‌ నిర్వహణ పేరుతో తీసుకునే లంచాలను కూడా వదిలేయాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పలు కేసులలో అదుపులోకి తీసుకునే నిందితుల భోజనాల ఖర్చు కూడా బిల్లులు పెట్టుకుంటే మంజూరు చేస్తానని వెల్లడిస్తున్నారు.

మారని బుద్ధులు
జిల్లా ఎస్పీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ అవినీతి, అక్రమాల విషయంలో కొంతమంది పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికీ మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులతో పోలీసుల సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. మడకశిర, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో గ్రానైట్‌ పరిశ్రమలు పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి క్వారీలు ఎక్కువశాతం రాజకీయ నాయకులవే కావడంతో ఎలాగూ కేసులు నమోదు చేయలేమని భావనతో కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా స్టేషన్‌లకు మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనాలు సరిహద్దు దాటించే బాధ్యత నెత్తిన పెట్టుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల బదిలీ అయిన ఓ అధికారి ఈ విషయంలో చక్రం తిప్పి రూ. లక్షలు వెనకేసున్నట్లు సమాచారం. ఎవరైనా కింది స్థాయి సిబ్బంది మాట వినక పోతే అప్పటి అధికారపార్టీ నేతల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా బదిలీ చేయించిన సందర్భాలు ఉన్నాయి. జిల్లా సరిహద్దు ప్రాంతమైనప్పటికీ అక్కడ పనిచేయడానికి చాలా మంది మక్కువ చూపుతుండటానికి కూడా ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

⇔ మడకశిర నుంచి రోజూ రాత్రి సమయంలో పదుల సంఖ్యలో గ్రానైట్‌ వాహనాలను గనులశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే జిల్లా సరిహద్దు దాటించేస్తున్నారు. ఈ వాహనాలను దాటించే పని ఖాకీలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా రోడ్డును పరిశీలించి గనులశాఖ, విజిలెన్స్‌ అధికారులు లేరని సమాచారం అందించి వాహనాలు దాటించేందుకు సహకారం అంది స్తున్నారు. ఇందుకోసం ప్రతి నెలా రూ.లక్షల్లో క్వారీ నిర్వాహకులు మామూళ్లు అందిస్తున్నారు. ఓ స్టేషన్‌ సీఐకు నెలకు రూ.2 లక్షల వరకూ అక్రమ ఆదాయం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు కొందరు పోలీసు సిబ్బంది సాయమందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

⇔ జిల్లా సరిహద్దు ప్రాంతమైన హిందూపురంలో మట్కా నిర్వాహకులను ఎస్పీ ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మట్కా వ్యవహారంలో కొంతమంది పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలినట్లు సమాచారం. ఈ విషయంలో రెండు, మూడు రోజుల్లో హిందూపురం ప్రాంతంలో కొంతమంది ఖాకీలపై కూడా వేటు పడనున్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. త్వరలో నిందితుల అరెస్ట్‌ చూపించే అవకాశమున్నట్లు తెలిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top