మంత్రులకు ముప్పుతిప్పలు!

Some ministers do not know where to contest - Sakshi

సీనియర్‌ మంత్రులకు చుక్కలు చూపించిన సీఎం 

గంటా శ్రీనివాసరావుకు చివరి నిమిషం వరకు టెన్షన్‌ 

అయ్యన్నపాత్రుడిదీ అదే పరిస్థితి 

జవహర్‌ను మరో జిల్లాకు తరిమేశారు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టిక్కెట్ల కేటాయింపు విషయంలో చాలామంది మంత్రులకు సీఎం చంద్రబాబు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఒకప్పుడు తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకున్న సీనియర్‌ మంత్రులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. నామినేషన్ల ఘట్టం సమీపిస్తున్నప్పటికీ కొందరు మంత్రులు తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.

గంటా శ్రీనివాసరావు... అయ్యన్నపాత్రుడు... విశాఖ జిల్లాలో ఇద్దరికిద్దరే. సీనియర్‌ మంత్రులు. కానీ, ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. పార్టీలో సీనియారిటీ విషయంలో మొదలైన యుద్ధం ఒకరి తప్పులను మరొకరు బయటపెట్టుకునే దాకా వచ్చింది. వీరిద్దరినీ  చంద్రబాబు ఒకే గాటన కట్టేశారు. ప్రజాప్రతినిధిగా రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మంత్రి గంటాకు ఏ స్థానం నుంచి టిక్కెట్‌ ఇస్తారో చివరి వరకు తేల్చలేదు. తాను సీఎం సొంత మనిషినని గంటా బీరాలు పోతున్నారు.కానీ ఆయన అనుచరులు గంటాను చూసి జాలిపడుతున్నారు. 

పాపం అయ్యన్న...
సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడిదీ అదే పరిస్థితి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న పొలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్న మాటకు ఏమాత్రం విలువ లేకుండాపోయింది. ఈసారి తాను పోటీ చేయనని, తన కుమారుడికి నర్సీపట్నం నుంచి అవకాశం ఇవ్వాలని చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. కుదరదు.. నువ్వే పోటీ చేయాలని బాబు స్పష్టం చేయడంతో వీలైతే అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని అయ్యన్న అభ్యర్థించారు. అది కూడా ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. అయ్యన్న వైరి వర్గానికి చెందిన విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌ పేరును ఖరారు చేశారు. అవసరమైతే తాను ఎమ్మెల్యేగా పోటీకి దూరమని, తన కుమారుడికి కాకుండా విశాఖ డెయిరీ వాళ్లకు టిక్కెట్‌ ఇస్తే ఊరుకునేది హెచ్చరించినా వినే స్థితిలో బాబు లేరనే అంటున్నారు.

జవహర్‌ రూటు మారింది...
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి జవహర్‌ది మరీ దారుణ పరిస్థితి. సీటు కోసం ఆయనను ఏకంగా మరో జిల్లాకు పంపడాన్ని జవహర్‌ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అనూహ్యంగా గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి గెలిచిన జవహర్‌కు రెండేళ్ల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎక్సైజ్‌ శాఖను కట్టబెట్టారు. ప్రతిపక్ష నేతను నోటికొచ్చినట్టు మాట్లాడిన ట్రాక్‌ రికార్డ్‌ చూసే జవహర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న బాబు.. ఇప్పుడు టిక్కెట్‌ విషయానికి వచ్చే సరికి నరకం చూపించారు. కొవ్వూరులో మళ్లీ నెగ్గలేవు, కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లు అని అటు తరిమేశారు.

క్రాస్‌ రోడ్‌లో శిద్ధా...
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్ధాను బలవంతంగా ఎంపీగా  పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను ఈసారి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. తొలుత బాబు ప్రతిపాదనకు అయిష్టంగానే అంగీకరించిన శిద్ధా ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. తనకు దర్శి టిక్కెట్‌ కావాలని కోరుతున్నారు. 
ఆదికి మొండిచేయి.. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నుంచి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై గెలిచిన మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫిరాయించి, మంత్రి అయిపోయారు. ఇప్పుడు ఆయనను చంద్రబాబు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఆదేశించారు. ఫిరాయింపు సమయంలో మళ్లీ జమ్మలమడుగు టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపారు. చివరికి ప్రొద్దుటూరు టిక్కెట్‌ ఇవ్వాలని ఆదినారాయణరెడ్డి కోరినా పట్టించుకోలేదు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై నోటికొచ్చినట్లు విమర్శలు చేయించడానికి ఇన్నాళ్లూ ఆదినారాయణరెడ్డిని వాడుకున్న చంద్రబాబు చివరికిలా పక్కనపెట్టేయడాన్ని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top