కాళరాత్రి

Six dead, 15 hurt in road accident in Kurnool district - Sakshi

రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ 

ఆరుగురు దుర్మరణం 

మృతుల్లో ఇద్దరు బాలికలు 

16 మందికి గాయాలు 

ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద ఘటన

మృతులు, క్షతగాత్రులంతా కర్నూలు వాసులు 

ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం

దైవసన్నిధిలో శుభకార్యం కోసం వారంతా సంతోషంగా బయలుదేరారు. అయితే.. ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకటే ఆటంకాలు. వారు ప్రయాణిస్తున్న వాహనం అతిభారంగా ముందుకు కదిలింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఐదుసార్లు మొరాయించింది. అతికష్టమ్మీద ఆలూరు మండలం పెద్దహోతూరు వద్దకు చేరింది. అప్పటికే అర్ధరాత్రి రెండు గంటలైంది. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో ఇక అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేకపోయింది. దీంతో డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డుపక్కనే ఆపేశాడు. బళ్లారిలోని తన బంధువుకు ఫోన్‌ చేసి..మరో వాహనాన్ని తీసుకొని రావాలని కోరాడు. ఆ వాహనం వచ్చేలోపే ఇక్కడ ఘోరం జరిగిపోయింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని అక్కడికక్కడే కబళించేసింది. 16 మందిని గాయాలపాలు చేసింది. మృతుల్లో ఇద్దరు బాలికలు ఉన్నారు. బాధితులంతా బంధువులే కావడం గమనార్హం.

ఆలూరు/ఆదోనిటౌన్‌/ కర్నూలు ఓల్డ్‌సిటీ: ఆలూరు మండలం పెద్దహోతూరు సమీపంలోని ఆలూరు–కర్నూలు రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలులోని గడ్డవీధికి చెందిన షేక్‌ ఖాజా (24), ఎస్‌.ఫాతిమా (26), ఎస్‌.హుస్సేన్‌ (23), ఎస్‌.ఆసిఫ్‌(17)తో పాటు ఎస్‌.హస్రా (9), ఎస్‌.మహెక్‌ (7) అనే బాలికలు చనిపోయారు. అలాగే షేక్‌ మగ్బుల్, డ్రైవర్‌ రఫిక్, షేక్‌ మహ్మద్, షబానా, హసీనా, అక్బర్‌బీ, షేకున్, మాబున్నీ, ఖైరూన్‌బీ, షేక్‌ పర్వీన్, అబుబకర్, ముదస్సిర్, చిన్నారి సుమేరా, షెక్షావలి, ఎండీ ముస్తాఖిమ్, ఫర్హత్‌ హెరీనా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరికి కర్నూలు, ఆదోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. షేక్‌ ఖాజా, హసీనా దంపతుల కుమార్తె సుమేరా కేశ ఖండన కార్యక్రమాన్ని హొళగుంద మండలంలోని ఎల్లార్తి దర్గా (షేక్షావలి, షాషావలి దర్గా)లో పెట్టుకున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి 22 మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు నుంచి టాటా మ్యాజిక్‌ వాహనం (ఏపీ21వై8784)లో పయనమయ్యారు. ఈ వాహనం మొరాయించడంతో డ్రైవర్‌ రఫిక్‌ పెద్దహోతూరు సమీపంలోని జెండాకట్ట వద్ద రోడ్డుపక్కన ఆపేశాడు.

 అప్పటికే అర్ధరాత్రి రెండు గంటలు కావడం, మరోవాహనం బళ్లారి నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో వారంతా కాసేపు కునుకు తీయాలని భావించారు. కొందరు వాహనంలో, మరికొందరు కింద వాహనానికి కుడి, ఎడమ వైపు కార్పెట్లు పరుచుకుని నిద్రించారు. చిరుజల్లులు కురుస్తుండడంతో వాహనానికి డ్రైవర్‌ నల్లటి టార్పాలిన్‌ కప్పి ఉంచాడు. అదే సమయంలో ఆస్పరి వైపు నుంచి బళ్లారి వైపు వెళుతున్న ఎనిమిది చక్రాల గుర్తు తెలియని లారీ వారిపై దూసుకెళ్లింది. వెంటనే చేరుకున్న పోలీసులు.. పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ ఎం.దస్తగిరి బాబు అక్కడికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ డాక్టర్ల కొరత ఉండడంతో ప్రథమ చికిత్స తర్వాత ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. మృతదేహాలకు ఆదోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆదోని డీఎస్పీ అంకివీడు ప్రసాద్‌ ఆలూరు ఆస్పత్రికి చేరుకొని మృతుల వివరాలను సేకరించారు. ఘటనపై ఎస్‌ఐ రామయ్య కేసు నమోదు చేశారు. 

 కాస్త ముందే వచ్చి ఉంటే.. 
బళ్లారి నుంచి బయలుదేరిన స్కార్పియో వాహనం కాస్త ముందు వచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం ప్రత్యక్ష సాక్షుల్లో వ్యక్తమైంది. స్కార్పియో డ్రైవర్‌ ఆలూరుకు చేరుకున్న తర్వాత రూట్‌ తెలియకపోవడంతో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులను అడిగాడు. ఈ సమయంలో ఒక్కరే వెళ్లడం శ్రేయస్కరం కాదని, అయినా ఏమైనా ఇబ్బంది వస్తే సమాచారం ఇవ్వాలని ఫోన్‌ నంబర్‌ ఇచ్చి పంపారు. అతను అక్కడికి చేరుకునేలోపే ఘోరం జరిగిపోయింది. సంఘటన స్థలంలో భీతావహ పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అర గంట ముందు ఆ వాహ నం వచ్చి ఉంటే తమ వారు ప్రాణాలతో ఉండేవారని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. 

ప్రమాదం బాధాకరం 
ఆదోని టౌన్‌: ఆలూరు మండలం పెద్దహోతూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి, మరో 16మందికి గాయాలు కావడం బా«ధాకరమైన విషయమని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ, గోపినాథ్‌ జెట్టీ అన్నారు. బుధవారం వారు ఆదోని ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించి, పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణించరాదన్నారు. వాహనం మరమ్మతులకు గురికావడం, రోడ్డు పక్కన నిలిపి సమీపంలోనే నిద్రించడం కూడా ప్రమాదానికి కారణమన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రమాదానికి కారణమైన లారీని బళ్లారిలో గుర్తించామని, త్వరలోనే డ్రైవర్‌ను అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ చెప్పారు. వారి వెంట ఆర్డీఓ రామమూర్తి, డీఎస్పీ అంకినీడు ప్రసాద్, సీఐలు దస్తగిరి బాబు, శ్రీనివాసులు, భాస్కర్, మురళీ, శ్రీరాములు ఉన్నారు. 
మృతులకు ఎమ్మెల్యే సంతాపం 

ఆలూరు: మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రగా«ఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

పెద్దాసుపత్రిలో క్షతగాత్రుల హాహాకారాలు 
కర్నూలు(హాస్పిటల్‌): సూర్యుడు ఉదయించముందే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. పెద్దహోతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బుధవారం తెల్లవారుజామున కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. తమ వారిని చూసేందుకు వచ్చిన పాతబస్తీకి చెందిన ముస్లింలతో క్యాజువాలిటీ నిండిపోయింది. గాయపడ్డ వారిలో ముగ్గురిని న్యూరోసర్జరీ విభాగానికి, ఐదుగురిని ఆర్థోపెడిక్‌ విభాగానికి తరలించి, ముగ్గురిని డిశ్చార్జ్‌ చేశారు. క్షతగాత్రులను కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తన వంతుగా రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు టీజీ వెంకటేష్‌ తెలిపారు.  

 నాన్న వారించినా.. 
నాన్న వారించినా ప్రయాణానికి బయలుదేరి అక్బర్‌బీ తన కూతురు, కుమారుడు, అల్లుడు, మనమరాలిని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుంది. అక్బర్‌బీ, ఆటోడ్రైవర్‌ మహమ్మద్‌ భార్యాభర్తలు. కర్నూలులోని కబేళా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. అక్బర్‌బీ తన మనవరాలు తలనీలాలు ఎల్లార్తి దర్గాలో తీయాలని చాలా రోజులుగా అనుకుంటోంది. ఈ నేపథ్యంలో రఫిక్‌ అనే తెలిసిన వ్యక్తికి చెందిన టాటా మ్యాజిక్‌ వాహనంలో మంగళవారం రాత్రి 8.00 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళ్లారు. అక్బర్‌బీ తల్లిదండ్రులు సత్తార్‌మియ్య, ఖైరున్‌బీ వెంకాయపల్లి సమీపంలో ఉండే జోహరాపురం ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్నారు. ఎల్లార్తి ప్రయాణానికి సమాయత్తం అయ్యే సమయంలో తండ్రి సత్తార్‌మియ్య వారించారు. తలనీలాలు తీయడానికి ఇంతమంది వెళ్లడం ఎందుకని, ఓ ఇద్దరు బస్సులో వెళ్లి తలనీలాలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. పెద్దమనిషి నస పెడతాడనే ఉద్దేశంతో ఆయన్ను అక్కడినుంచి పంపించేశారు. దీంతో ఆయన వెంకాయపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. అక్బర్‌బీ, కుమారులు, బిడ్డాఅల్లుళ్లు, వారి బంధువులు, వారి పిల్లలు..డ్రైవర్‌తో కలిపి 22 మందితో వాహనం బయలుదేరింది. ప్రమాదంలో అక్బర్‌బీ కుమారుడు హుసేన్, రెండో కూతురు ఫాతిమా, చిన్నఅల్లుడు ఖాజా, మనవరాలు హస్రా చనిపోయారు. తీవ్ర గాయాలకు గురైన అక్బర్‌బీ పరిస్థితి కూడా విషమంగా ఉంది.    

  మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలి 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎల్లార్తి దర్గాకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం కర్నూలు పెద్దాసుపత్రిలో, సాయంత్రం పాతబస్తీలోని నివాసాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. చంద్రన్నబీమా సరిగా అమలు కావడం లేదని, అందువల్ల బాధితుల కుటుంబాలను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజు యాదవ్, మాజీ కార్పొరేటర్‌ పి.రహ్మాన్, నాయకులు రైల్వే ప్రసాద్, పెరుగు శ్రీనివాస్‌రెడ్డి, హకీం, జావిద్, పవన్, జిలాన్‌బాబా తదితరులు ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top