గంటా అడిగితే నేను సీబీఐ విచారణ వేయాలా?

సిట్‌ విచారణలో అన్నీ తేలతాయి: చంద్రబాబు


అమరావతి: విశాఖపట్టణం భూ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 276 ఎకరాల భూముల రికార్డులు ట్యాంపర్‌ అయ్యాయన్నారు. కానీ, ఎక్కడా వాటిపై లావాదేవీలు జరగలేదని చంద్రబాబు తెలిపారు. ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ 25మంది ఫోటోలతో పాటు వివరాలు ఉన్నాయని, సిట్‌ విచారణలో అన్నీ తేలతాయన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలకు పాల్పడితే రద్దు చేశామని, ఆధారాలు ఉంటే సిట్‌కు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.కాగా అక్రమాలపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగారు. సీబీఐ విచారణ అడుగుతున్న వారివద్ద ఆధారాలు ఉన్నాయ అంటూ ఎదురు ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ 20ఏళ్ల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటా అడిగితే నేను సీబీఐ విచారణ వేయాలా అని వ్యాఖ్యలు చేశారు.విశాఖలో వందల ఎకరాల భూములు కబ్జా అవ్వడం, స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు తదితర నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ కుంభకోణం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి డైరెక్షన్‌లో మంత్రి లోకేష్‌ సారథ్యంలోనే జరిగినట్లు విపక్షాలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, అధికారులు దుయ్యబడుతున్నారు. విశాఖ జిల్లాకే చెందిన సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఈ భూముల కబ్జాపై వాస్తవాలు వెల్లడించారు. మరోవైపు విశాఖ భూ కుంభకోణంపై సీబీసీఐడీ, సీబీఐ లేదా జట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి గంటా శ్రీనివాసరావు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Back to Top