హత్యను కప్పిపుచ్చే కుట్రలు

Sisters Meet Ys Jagan Her Father Murder Case Complaint Visakhapatnam - Sakshi

టీడీపీ మద్దతుదారుల ఎత్తుగడలు పోలీసులూ న్యాయం చేయడం లేదు

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన మృతుని కుమార్తెలు

న్యాయం జరిగేలా చూడాలని వేడుకోలు

విశాఖ, నక్కపల్లి(పాయకరావు పేట): టీడీపీ మద్దతుదారులు తమ తండ్రిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, పోలీసులు కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పాయకరావుపేట మండలం అరట్లకోటకు చెందిన అక్కచెల్లెళ్లు వైఎస్సార్‌సీపీ అధినేత  జగన్‌మోహన్‌ రెడ్డికి మొర పెట్టుకున్నారు. ఎమ్మెల్యే అనిత కూడా తమను ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారని మృతుని ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. మంగళవారం కైలాసపట్నంలో జగన్‌ బస చేసిన టెంట్‌ వద్దకు వచ్చి వారు తమ తండ్రి మరణానికి సంబంధించిన అన్ని పరిణామాలను పూస గుచ్చినట్టు వివరించారు.

తమకు జరిగిన అన్యాయంపై ‘సాక్షి’లో వెలువడ్డ కథనం క్లిప్పింగ్‌ను  జగన్‌కు చూపించారు. ‘అరట్లకోటలోని రాజుగారి బీడు సమీపంలో నిర్మితమవుతున్న ఓ భవనం వద్ద మా తండ్రి  శుకనాల సత్యనారాయణ వాచ్‌మన్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది జనవరి 5న అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనను అక్కడ పనికి కుదిర్చిన బిల్డర్,  మా గ్రామస్తుడు పోతంశెట్టి రాజబాబు ఆరోజు ఉదయం వచ్చి మాకు మరణవార్తను చెప్పారు.’ అని శకునాల లత, దొండపాటి రమ జగన్‌కు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తాము బంధువులతో కలసి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లామని, తమ తండ్రి శరీరంపై రక్తం చిందిన గాయాలు ఉండడడంతో ఎవరో కొట్టి చంపారని అనుమానం వచ్చిందని, దాంతో ఎస్‌ఐ రామకృష్ణకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చామని తెలిపారు. ఎస్‌ఐ మూడు గంటలైనా రాలేదని, దాంతో మృతదేహానికి అంత్యక్రియలు చేశామని తెలియజేశారు.

‘జనవరి 25న పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. ఎస్‌ఐ రామకృష్ణ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా మమ్మల్ని పంపేశారు. అదే రోజు టీడీపీ నేత కట్టా శ్రీను, పోతంశెట్టి రాజబాబు రూ. 50 వేలు ఇచ్చి.. ఏదో రాసి ఉన్న బాండ్‌ పేపర్‌పై సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారు. మేం ఒప్పుకోలేదు.’ అని చెప్పారు. వారం తర్వాత ఎస్‌ఐ తమకు ఫోన్‌ చేసి సీఐ రుద్రశేఖర్‌  రమ్మంటున్నట్టు చెప్పడంతో నక్కపల్లి సర్కిల్‌ ఆఫీసుకు వెళ్లామన్నారు. ‘మమ్మల్ని చూసి సీఐ మండిపడ్డారు. మీ రిపోర్ట్‌ తీసుకోను.  దిక్కున్న చోట చెప్పుకోండి.. ఎవరూ నన్నేం చేయలేరు. ఆడవాళ్లు కాబట్టి బతికిపోయారు.’ అంటూ కొట్టినంత పనిచేశారన్నారు. మరోదారి లేక ఫిబ్రవరి 5న విశాఖ వెళ్లి కలెక్టర్‌ నిర్వహించే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశామన్నారు. వారం తర్వాత ఎస్పీ రాహుల్‌ దేవ్‌ను ఆఫీసులో కలిసి ఈ సంఘటన గురించి వివరించామని, ఆయన వెంటనే  నర్సీపట్నం ఏఎస్పీకి ఫోన్‌ చేసి  కేసును పరిశీలించాల్సిందిగా ఆదేశించారని, పోలీసులు ఇంటికి వచ్చి విచారిస్తారని  ధైర్యం చెప్పారని తెలిపారు.

అయినా తర్వాత ఎవరూ  రాలేదన్నారు. ఫిబ్రవరి 23న రాయవరం ఎస్‌ఐ కుమారస్వామి ఫోన్‌చేసి విచారణకు రాయవరం రమ్మన్నారని, ఏదో రాసి ఉన్న కాగితంపై సంతకం పెట్టమన్నారని తెలిపారు. భాష తెలియకపోయినా సంతకం పెట్టామన్నారు. ‘తర్వాత కూడా విచారణ ఊసే లేదు. మార్చి 27న మళ్ళీ ఎస్పీని కలిశాం. ఏఎస్పీ వస్తారని హామీ ఇచ్చారు కానీ ఆయన రాలేదు. ఏఎస్పీని అయిదారుసార్లు కలిసినా వస్తానన్నారే తప్ప రాలేదు.’ అని చెప్పారు. ఎమ్మెల్యే అనితకు ఫోన్‌ చేస్తే కట్‌ చేశారని, మరోసారి తమ ఇంటి మీదుగా వెళ్తుంటే... కారును అడ్డుకుని విషయం చెప్పబోగా, హేళన చేసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ ఘటనలో తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ను కన్నీటితో అభ్యర్థించారు. విషయం ఆసాంతం విన్న జగన్‌ ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని, వెంటనే కోర్టులో కేసు వేయాలని చిక్కాల రామారావు తదితర నాయకులను ఆదేశించారు. ‘మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, జరిగేలా నేను చూస్తా’ అని మృతుడి కుమార్తెలకు ధైర్యం చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top