‘ఐవైఆర్‌ ఫేస్‌బుక్‌ షేర్‌’తో కలకలం


సీఎంను తప్పుబట్టిన పోస్టింగ్‌లు షేర్‌ చేశారంటూ విమర్శలుసాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తీరును తప్పుపడుతూ కొందరు చేసిన పోస్టింగులను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసినట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో సోమవారం వచ్చిన కథనాలు అటు ప్రభుత్వ, ఇటు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.  ఎన్‌టీరామారావును చంద్రబాబు పదవీచ్యుతుడ్ని చేసిన వైనాన్ని తప్పుపడుతూ, వాటిపై కార్టూన్లను రాఘవరావు, ఆదివిష్ణు అనే వారు ఫేస్‌బుక్‌ల్లో పోస్టు చేశారు. చూడు చూడు రూథర్‌ఫర్డు అంటూ చంద్రబాబు, లోకేష్‌లను పోల్చుతూ ‘బాబు పాలనప్రజల కష్టాలు’... అనే పోస్టును ఐవైఆర్‌ షేర్‌ చేశారని టీడీపీ అభిమానులు తప్పుబట్టారు.ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల నెలసరి వేతనం తీసుకుంటున్న వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని తప్పుబట్టే పోస్టులు ఎలా షేర్‌ చేస్తారంటూ టీడీపీ అనుకూల ఛానళ్లు చర్చను లేవనెత్తాయి.  మరోవైపు ఐవైఆర్‌ను విమర్శిస్తూ కథనాలు ప్రచారం చేయడాన్ని ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు తప్పుబట్టాయి. ఆయన షేరింగ్‌లు పెట్టారో లేదో స్పష్టత లేదని... ఒకవేళ షేరింగ్‌ చేస్తే తప్పేమిటి? అని రిటైర్డు అధికారులు, ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

Back to Top