పాలనా నగరానికి రెండో శంకుస్థాపన

పాలనా నగరానికి రెండో శంకుస్థాపన

- విజయదశమికి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి 

- గతేడాది అక్టోబర్‌ 26న అరుణ్‌ జైట్లీతో శంకుస్థాపన చేయించిన సీఎం

- డిజైన్ల పైనే  స్పష్టత రాకుండా ప్రచార ఆర్భాటానికేనని విమర్శలు

 

సాక్షి, అమరావతి : రాజధాని పరిపాలనా నగరానికి మరోసారి శంకుస్థాపన చేయించి హడావుడి చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. పరిపాలనా నగరం డిజైన్లు ఖరారు దశకు రావడంతో నిర్మాణ పనులు ప్రారంభించే ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. గత ఏడాది అక్టోబర్‌ 26న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీతో భారీ బహిరంగ సభ పెట్టి 900 ఎకరాల్లో (ఆ తర్వాత ఇది 1,350 ఎకరాలకు పెరిగింది) పాలనా నగరానికి శంకుస్థాపన చేయించారు. అయితే ఇంతవరకు అక్కడ నిర్మాణ పనులూ ప్రారంభం కాలేదు.అవి కావడానికి డిజైన్ల రూపకల్పన చేయించడంతో పాటు టెండర్ల ప్రక్రియ నిర్వహించి నిర్మాణ సంస్థలను ఎంపిక చేయాల్సి వుంది. కానీ ఏడాదిన్నరగా రకరకాల డిజైన్లు చూపిస్తూనే ప్రభుత్వం కాలక్షేపం చేసింది. చివరికి ఇటీవలే అసెంబ్లీకి వజ్రాకారం, హైకోర్టుకు స్థూపాకార డిజైన్లను ఆమోదించడంతో  డిజైన్‌ను ప్రాథమికంగా ఖరారు చేసింది.  ఇంకా పలు మార్పులు చేయాల్సి ఉన్నందున 15 నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా విజయదశమికి నిర్మాణం (సెప్టెంబర్‌) పనులు ప్రారంభిస్తామని ప్రకటించేశారు. ఇంకా డిజైన్ల రూపకల్పనే పూర్తిస్థాయిలో కాలేదు. టెండర్లపైనా స్పష్టత రాకుండానే ప్రకటన చేయడం ద్వారా  మరో భారీ ప్రచార ఆర్భాటానికి తెరలేపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
Back to Top