అయినా.. వెళ్లక తప్పలేదు..

School Students Attends Chandrababu Meeting on Sunday - Sakshi

సెలవు రోజైనా సీఎం సభకు విద్యార్థులను తరలించిన ప్రభుత్వ యంత్రాంగం

ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సభలోనే విద్యార్థులు

డ్వాక్రా సభ్యులను బలవంతంగా తరలించిన వైనం

ఎంత ప్రయత్నించినా గ్యాలరీలు నిండక అధికారుల పాట్లు

సాక్షి, అమరావతి బ్యూరో: ఆదివారం అందరికీ ఆటవిడుపు. వారం అంతా ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ గడుపుతూ.. ఆదివారం వచ్చిందంటే అంతా రిలాక్స్‌ అయిపోతుంటారు. ఇక విద్యార్థులైతే వారం అంతా ఆదివారం ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అటువంటి రోజు పంజరంలో పక్షుల్లా గడపాల్సివస్తే అంతకు మించిన నరకం ఇంకొకటి ఉండదు. పామర్రు  మండలం కొమరవోలు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనసమీకరణలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను వారి వారి యాజమాన్యాలతో బెదిరించి సభకు రప్పించారు. ప్రతి విద్యార్థి తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు ఇప్పించి వారిని ప్రత్యేక బస్సుల ద్వారా బహిరంగ సభకు తరలించారు. సెలవు రోజు బలవంతంగా బస్సులను ఎక్కించుకుని తీసుకుని వచ్చారని నారాయణ, శ్రీ చైతన్య క్యాంపస్‌లోని ఇంటర్‌ విద్యార్థులు వాపోయారు.

ఉదయం నుంచి పడిగాపులు...
ఆదివారం ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను బస్సుల్లో తరలించి ప్రారంభించి 9 గంటలకల్లా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. సీఎం సభ ఉదయం గంటల 10.30 నిమిషాలకు మొదలవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ సీఎం సభ వద్దకు రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. సీఎం ప్రసంగం, సన్మాన కార్యక్రమాలు పూర్తి అయి ట్రాఫిక్‌ క్లియర్‌ అవ్వటానికి మధ్యాహ్నం 3 గంటలైంది. ఉదయం సభా ప్రాంగణంలోకి వచ్చిన విద్యార్థులను బంధీలుగా వేసి సభ çపూర్తయ్యే వరకు ఆపారు. విద్యార్థుల్లో కొంతమంది ఆకలికి ఆలమటించారు. కేవలం వాటర్‌ బాటిల్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

ఖాళీగా గ్యాలరీలు..
మరోవైపు సభ కోసం మహిళలను బలవంతంగా తరలించారు. డ్వాక్రా సభ్యులకు త్వరలో పదివేల రూపాయలు ఇస్తున్నామని, సభకు వచ్చిన వారికి త్వరగా పడతాయని ఆశ చూపి కొంతమందిని, మరికొంతమందిని బెదరించి సభకు తీసుకొచ్చారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గ్యాలరీలు నిండక అధికారులు నానా అవస్థలు పడ్డారు. సీఎం సభా ప్రాంగణానికి వచ్చేవరకూ అధికారులు మైకుల్లో జనాన్ని తీసుకురండి, సభ చాలా ఖాళీగా ఉందంటూ అరుస్తూనే కనిపించారు. ఇంతచేసినా సభలో దాదాపు సగం గ్యాలరీల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

ఇదేం ఖర్మ బాబూ..!  
పామర్రు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటనకు అధికారులు డ్వాక్రా సభ్యులను బలవంతంగా తరలించడంతో సభకు వచ్చిన మహిళలు ఇదేం ఖర్మ దేవుడా అంటూ వాపోతున్నారు. ఆదివారం మండల పరిధి కొమరవోలు గ్రామంలో జరిగే సీఎం సభకు అన్ని గ్రామాల నుంచి బస్సులను ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితిల్లోనూ బస్సు ఎక్కాస్సిందే అంటూ హుకుం జారీ చేశారు. సభకు రాక పోతే ప్రభుత్వం ఇస్తున్న పసుపు, కుంకుమ పథకంలో వచ్చే రూ.10వేల రావని, ఆన్‌లైన్‌ చేయమంటూ ఐకేపీ అధికారులు బెదిరింపులకు దిగారు. దీంతో చేసేది లేక సీఎం సభకు ఆటోలలో, బస్సుల్లో తరలి రావడం జరిగిందని డ్వాక్రా మహిళలు చెబుతున్నారు.

నిలువు కాళ్లపై విద్యార్థులు
సీఎం పర్యటనలో భాగంగా గ్రామంలో చెరువులు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యార్థులు నిలువు కాళ్లపై నిల్చుని ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

స్పందన నిల్‌..
సీఎం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారనుకున్న టీడీపీ నాయకులు నిరాశే ఎదురయ్యింది. భారీ ఏర్పాట్లు చేసినా.. అనుకున్న స్థాయిలో జనాభా రాక పోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

పార్కింగ్‌ లేక ఇబ్బందులు
సీఎం సభకు తరలి వచ్చే వాహనదారులకు పార్కింగ్‌ సౌకర్యం లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సభ వద్దకు వాహనాలను వెళ్లినీయక పోవడంతో చేసేది రహదారి వెంబడే, పంట పొలాలలో వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాల్సి వచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top