అధికారాంతమునా అదే దగా

Schemes forgot allotments to be copied - Sakshi

చివరి బడ్జెట్‌లోనూ బాబు జిత్తులమారి ఎత్తులు

నాలుగేళ్ల 9 నెలలుగా అడుగడుగునా మోసం

ఒక్క హామీ అమలు చేయకుండా వంచన

ఎన్నికలు రెండు నెలలు ఉండగా బడ్జెట్‌ సాక్షిగా ఘరానా మోసం

కొత్త పథకాల పేరుతో సెట్స్‌పైకి మరో సినిమా

రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను వంచించే ఎత్తులు

పథకాలు కాపీ కొట్టారు.. కేటాయింపులు మరిచారు..

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఓటర్లపై రంగుల వల.. 600కు పైగా హామీలు.. అందులో అలవికానివి ఎన్నో..వాగ్దానాల వర్షం.. అది చేస్తా ఇది చేస్తా అంటూ గొప్ప సినిమా చూపించారు..ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా ఇన్నాళ్లూ బూటకపు మాటలతో నెట్టుకొచ్చేశారు... అన్ని వర్గాలనూ మోసగించారు.. ఇంకాచెప్పాలంటే పచ్చిగా జనాన్నిదగా చేయడంలో పీహెచ్‌డీ చేశారు..అయితే ఆ ఎత్తులు అందరికీ అర్థమైపోయాయి.కథ క్లైమాక్స్‌కు చేరుకుంది.

ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతోసెట్స్‌పైకి మరో సినిమా వచ్చింది.అబ్బో సూపర్‌ కదా.. అని భ్రమించేలా ఎన్నికలకురెండు నెలల ముందు ఎంతో హడావిడి..ఇప్పటికే కొంత ట్రైలర్‌ చూపించారు. ఇప్పుడుచిట్ట చివరి బడ్జెట్‌ సాక్షిగా అసలు సినిమా రిలీజయ్యింది.

రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, అంతర్జాతీయ రాజధాని విషయాలలో ఘరానా మోసం ఏ రీతిలో సాగిందో ప్రజ లు ఈ ఐదేళ్లలో చూశారు. ఇపుడు ఎన్నికలకు రెండు నెల ల ముందు విడుదలైన ఈ సినిమాలోనూ కథా వస్తువులు అవే. కానీ ఇపుడు స్కీముల సీన్లు మారిపోయాయి.మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు దీరబోతోంది. మరి ఇలాంటి సమయంలో 4 నెలల కోసం తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ ఇదేదో వార్షిక బడ్జెట్‌లా ఇలాంటి మోసపూరిత విన్యాసాలేమిటా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో రైతులను మోసగించే స్కీము ఈ బడ్జెట్‌లో ప్రత్యేకం. అయితే ఆ స్కీము వివరాలు పాపం ఎవరి దగ్గరా లేవు. హడావిడి వంటకమాయె. ‘రైతు సురక్ష’ పేరుతో రైతుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి తన వందిమాగథ చానళ్లలో అంతెత్తున ప్రచారం చేయించుకున్నారు.

దాన్ని వదిలేశారు. మన రాష్ట్రంలో 1.60 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. ఎకరాకు 10వేల చొప్పున అంటే రూ. 16వేల కోట్లు ఇవ్వాలి. ఆ మేరకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులే లేవు. ప్రతిపక్ష నేత ప్రకటించిన స్కీమును కాపీకొట్టారు సరే.. అదయినా సరిగ్గా చేశారా అంటే లేదు. 85 లక్షల రైతు కుటుంబాలకు రు. 12,500 చొప్పున మొత్తం రూ.10,600 కోట్లు ఇస్తానని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. స్కీమును కాపీ కొట్టిన చంద్రబాబు ఈబడ్జెట్‌లో కేటాయించింది రూ.5,000 కోట్లు. తను ప్రచారం చేసుకున్న విధంగానైతే రూ.16వేల కోట్లు కేటాయించాల్సింది. లేదా జగన్‌ నుంచి కాపీ కొట్టిన స్కీమ్‌ కయితే రూ.10,600 కోట్లు కేటాయించాలి. కానీ రెండూ చేయకుండా రూ. 5వేల కోట్లతో సరిపెట్టారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకూ అదే ఘరానా మోసం. రుణాలన్నీ మాఫీ చేస్తానని మోసగించాడు. అదలా ఉంచితే ఇపుడు రూ.10వేల చొప్పున ఇస్తామంటున్నారు.

అంటే  93 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.10వేలు చొప్పున అంటే రూ.9,300 కోట్లు కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్‌లో కేటాయించిందెంత? రూ. 4 వేల కోట్లు. ఈ బడ్జెట్‌లో ఏప్రిల్‌ వరకు కేటాయించింది రూ.1700 కోట్లు. అంటే డ్వాక్రా మహిళలకు రూ. 9,300 కోట్లు కావాల్సి ఉంటే ఇప్పటివరకు అందుబాటులో ఉంచింది రూ.5,700 కోట్లు మాత్రమే. ప్రకటించిన రూ. 10వేలు ఉచితమూ కాదు. ఇంతకుముందు లానే అని ఊరుకున్నారు. అంటే ఈ రూ.10వేలు అప్పేనని తేలిపోయింది. మేనిఫెస్టోలో అన్ని వర్గాలనూ మోసగించిన రీతిలోనే ఇపుడు బడ్జెట్‌లో కులాలవారీగా కార్పొరేషన్లు ప్రకటించారు. 35 కులాలకు రూ. 3 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

కానీ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లయినా కేటాయించకుండా అన్ని కులాలను మోసగించారు. బీసీలపై ప్రేమ నటిస్తూ నాలుగేళ్ల తొమ్మిదినెలల్లో వారికి ఖర్చుచేసింది రూ.18వేల కోట్లు. ఇపుడు ఒకే ఏడాదిలో రూ.16వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నమ్మేదెలా?. కాపులకు ఏటా వెయ్యికోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేల కోట్లు కేటాయించాల్సింది. కానీ కేటాయించింది రూ.1400 కోట్లు మాత్రమే. ఇపుడు మళ్లీ ఏడాదికి రూ.వెయ్యికోట్లు కేటాయిస్తానని కల్లబొల్లి కబుర్లు. బాబుగారి బడ్జెట్‌లలో అన్ని వర్గాలకు కేటాయింపులే చాలా తక్కువ. అవసరాలకు తగినన్ని కేటాయింపులు ఏ పద్దులోనూ లేవు.

అన్నీ అరకొర విదిలింపులే.. వాటిలోనూ ఖర్చు చేసింది మరింత తక్కువ. అవసరమైనదాంట్లో 50శాతం కూడా కేటాయింపులు లేవు. ఆ కేటాయించినవన్నా పూర్తిగా ఖర్చు చేస్తారా అంటే అదీ లేదు. కేటాయించినదాంట్లో 60శాతం కూడా ఖర్చుచేయరు. మరి నాలుగేళ్లలో విడుదల చేసినంత మొత్తాన్ని ఒకేసారి కేటాయిస్తున్నట్లు చివరి బడ్జెట్‌లో చూపిస్తే ఎవరు నమ్ముతారు బాబూ? ఈ అంకెల గారడీ ఎన్నికల సుడిగుండం నుంచిగట్టెక్కిస్తుందా... హవ్వ ఇంత పచ్చి దగానా జనం నవ్విపోరా అని విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top