పరువు హత్య?

scheduled caste Girl brutally murdered in Anantapur district - Sakshi

యువకుడితో వెళ్లిపోయిన బాలిక 

ఐదు రోజుల తర్వాత    గ్రామానికి రాక 

ఆగ్రహంతో ఊగిపోయిన బాలిక తల్లిదండ్రులు 

తీవ్రంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారంటున్న స్థానికులు 

మరుసటి రోజే హెచ్చెల్సీలో శవమైన బాలిక 

బుక్కరాయసముద్రం: తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి యువకుడి వెంట వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన బాలిక మరుసటి రోజు హెచ్చెల్సీలో శవమై తేలింది. తిరిగి వచ్చిన సమయంలో బాలికను కుటుంబ సభ్యులు కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బాలిక మృతి చెందటం కలకలం రేపింది. కచ్చితంగా ఇది పరువు హత్యేనంటూ స్థానికులు పేర్కొంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో కురుబ సామాజిక వర్గానికి చెందిన మిడతల నారాయణస్వామి, ఎర్రమ్మ దంపతుల కుమార్తె హేమశ్రీ (16) గుత్తిలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈమె స్వగ్రామానికి చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన యువకుడి ప్రేమలో పడింది. పది రోజుల కిందట ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇరు వర్గాల వారూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వీరిలో అమ్మాయి మైనర్‌. దీంతో ఇరు కుటుంబాల వారినీ పిలిపించి మాట్లాడి అమ్మాయి, అబ్బాయిలను ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు.  

పోలీసుల నిర్లక్ష్యం 
హేమశ్రీని స్టేషన్‌ దాటాక తల్లిదండ్రులు బహిరంగంగా కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. గ్రామస్తులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారమందించారు. అయితే వారు పెద్దగా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ అటు వైపు నుంచి స్పందన కనిపించకపోవడంతో గ్రామస్తులు డయల్‌ 100కు కాల్‌ చేసి చెప్పారు. అప్పుడు బుక్కరాయసముద్రం పోలీసుస్టేషన్‌ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను చెన్నంపల్లికి పంపించారు. వారు అమ్మాయి తల్లిదండ్రులను మందలించి వెళ్లారు. డయల్‌–100కు ఫోన్‌ చేసిన వ్యక్తులపై ఆ కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని గ్రామస్తులు తప్పు పట్టారు. విషయం పోలీసుల దాకా వెళ్లడం, గ్రామస్తులందరి నోళ్లలోనూ విషయం నానుతుండటంతో అమ్మాయిని తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి వారు తిరిగి రాలేదు. మూడు రోజుల కిందట హెచ్చెల్సీలో హేమశ్రీ శవమై తేలింది. తల్లిదండ్రులు చితకబాదిన రోజే అమ్మాయిని హోంలో ఉంచి ఉంటే ఈ రోజు ప్రాణాలతో బతికేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

తల్లిదండ్రులు లేకుండానే అంత్యక్రియలు 
పరారీలో ఉన్న అమ్మాయి తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు హేమశ్రీ చిన్నాన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయన తెలిపిన వివరాల ఆధారంగా తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల తర్వాత మంగళవారం మధ్యాహ్నం హేమశ్రీ మృతదేహానికి అనంతపురం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాకుండా నగర సమీపంలోని గుత్తిరోడ్డు శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లిదండ్రులు లేకుండానే సమీప బంధువులు, పోలీసుల ఆధ్వర్యంలో అంత్యక్రియల ఘట్టం ముగించినట్లు తెలిసింది.  

త్వరలో పూర్తి వివరాలు వెల్లడి
అమ్మాయి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీఐ శ్రీహరి తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top