మట్టి దొంగలు

Sand mafia In Kurnool - Sakshi

ఇతర పనులకుఎస్‌ఆర్‌బీసీ ర్యాంప్‌మట్టి అక్రమ  తరలింపు

టీడీపీ ముఖ్య నేత అనుచరుడి కనుసన్నల్లో పనులు

జేసీబీలతో 100 మీటర్ల మేర మట్టి తోడేసిన వైనం

ప్రభుత్వానికి రూ. 30 లక్షల నష్టం

గ్రామస్తుల ఫిర్యాదుతో స్పందించిన ఎస్‌ఆర్‌బీసీ అధికారులు

తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. అధికారం చేతిలో ఉందని అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు.  ఏకంగా ఎస్‌ఆర్‌బీసీ ర్యాంప్‌ మట్టిని తోడేసి మైనర్‌ ఇరిగేషన్‌ రస్తాలకు తరలిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో వారి అక్రమ దందా బయటపడింది.    

కర్నూలు, సంజామల:  గిద్దలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గిద్దలూరు, మిక్కినేనిపల్లె, రామభద్రునిపల్లె, మంగపల్లె గ్రామాల్లోని  రైతుల పొలాలకు రస్తాల నిర్మాణం కోసం  ప్రభత్వం నిధులు మంజూరు చేసింది. మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ తరపున జరిగే ఈ పనులను నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత అనుచరుడు దక్కించుకున్నాడు. రస్తాలకు రెడ్‌ గ్రావెల్‌ వినియోగించాలి.  గిద్దలూరు, మిక్కినేనిపల్లె గ్రామాల సమీపంలో వెలసిన కొండల్లో ఆ గ్రావెల్‌ దొరుకుతుంది. కానీ, సదరు కాంట్రాక్టర్‌ అంత శ్రమ ఎందుకనుకున్నాడో ఏమో గిద్దలూరు సమీపంలోని కమ్మోరుపల్లె రహదారిలో ఎస్‌ఆర్‌బీసీ  (శ్రీశైలం రైట్‌ బ్రాంచ్‌ కెనాల్‌) 17వ బ్లాకు  నిర్మాణానికి ఏర్పాటు చేసిన ర్యాంపు మట్టిపై కన్నేశాడు.  జేసీబీ ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా  గత వారం రోజులుగా ఆ మట్టిని అక్రమంగా   రహదారి పనులకు తరలించాడు. కాలువ నిర్మాణ పనులు పూర్తికాకముందే అక్కడి మట్టిని తరలించారు. దిగువ ప్రాంత రైతులకు నీరందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన అకాల మరణంతో 2010 నుంచి నిధులు మంజూరు కాక కిలోమీటరున్నర  కాలువ పనులు ఆగిపోయాయి.  ఆ  పనులు పూర్తి చేయించాల్సింది పోయి అక్కడి మట్టినే టీడీపీ నేతలు తరలించడం గిద్దలూరు గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. దీనిపై ఎస్‌ఆర్‌బీసీ  అధికారులకు  ఫిర్యాదు చేయగా వారు ఆలస్యంగా స్పందించారని వారు తెలిపారు.

రూ. 30 లక్షల మేర నష్టం
గ్రామస్తుల ఫిర్యాదుతో మంగళవారం ఎస్‌ఆర్‌బీసీ  ఏఈ రామ్మోహన్‌రెడ్డి, డీఈ చెన్నయ్య  కాలువ మట్టి తరలించిన ప్రదేశాన్ని పరిశీలించారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు మట్టి తోడి తరలించడంతో రూ. 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని  ఏఈ వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.     ఎస్‌ఆర్‌బీసీ   ర్యాంపు మట్టిని ఇతర పనుల నిమిత్తం తోడేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని  రికవరీ చేయాలని గిద్దలూరు గ్రామస్తులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top